తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం

ఈ గ్రంథాన్ని డా||ఎన్‌గోపిగారికి అంకితం చేశారు. ప్రొఫెసర్‌ కేతవరపు రామకోటిశాస్త్రి, ప్రొఫెసర్‌ ఎన్‌.గోపి, ప్రొఫెసర్‌ రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ చింతకింది కాశీం చక్కటి ముందు మాటలు రాశారు.
‘తెలుగు కవిత్వ పరిణామాన్ని అంచనా కట్టడంలో కె.వి.ఆర్‌, సి.నా.రె, వెల్చేరు తదితరుల గ్రంథాలకు ఈ గ్రంధం ఒక చేర్పుగా భావిస్తున్న’ అంటారు సుంకిరెడ్డి. ఇది సిద్ధాంత పరిశోధనా గ్రంథం. కేతవరపు వారు అన్నట్లుగా ఇది ప్రశంసనీయకృషి. విలువైన పరిశోధన. జీవితాన్ని కళాత్మకంగా అలంకరిస్తే కవిత్వం అవుతుంది. కవిత్వానికి ముడిసరుకు జీవితమే.
లోక అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ దృగ్గోచర ప్రపంచాన్ని సౌందర్యంగా వ్యక్తం చేస్తాడు. సామాజిక మార్పును వేగవంతం చేసే సమూహంలో కవి ప్రత్యేక ప్రతినిధి.
కవిత్వంలో ప్రతిబింబమైన సమాజ నిర్మాణానికి శోధక శక్తి ప్రజలు. ఏడు అధ్యాయాలుగా ఈ పరిశోధన సాగింది. 1. తాత్వికత: పరిధి; ప్రమేయం, పరిణామం. 2. ప్రాచీన తెలుగు కవిత్వం, 3. ఆధునిక కవిత్వం, 4. భావ – అభ్యుదయ కవిత్వ సంధిదశ, 5. అభ్యుదయ కవిత్వ యుగం, 6. దిగంబర కవిత్వం – తిరగబడు కవిత్వం, 7. విప్లవ కవిత్వ యుగం. శివ విష్ణు పారాయణములైన భక్తి తత్వ భావజాలంగా ప్రాచీనాంధ్ర కవిత్వానికి నేపధ్యాన్ని సమకూర్చి పెట్టిన విధానాన్ని విశదీకరణ బాగుంది. 1991 లో డాక్టరేట్‌ పట్టా పొందారు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి (డా||ఎన్‌.గోపి పర్యవేక్షణలో). 30 ఏళ్ల కిందటి పరిశోధన నేడు పుస్తక రూపంలో వచ్చింది. కర్మకాండ ప్రతిపాదికన వైదిక మతోద్ధరణ ప్రయత్నంగా నన్నయ భారతాన్ని అనువదించాడు అంటారు.
భూస్వామ్య వ్యవస్థ కనుగుణమైన భక్తి భావాన్ని పెంచే కవిగా నన్నెచోడుడిని ప్రతిపాదించారు సు.నా.రె. (సుంకిరెడ్డి నారాయణరెడ్డి). అధిక్షేప శతక కవులు, వేమన, పోతులూరి వీరబ్రహ్మం మొ|| ఆధునిక కవిత్వానికి ముఖ్యంగా గురజాడకు ఒక స్థానీయమైన పూర్వ రంగాన్ని రూపొందించారని సు.నా.రె. ఒక నిర్ధారణ చేశారు. శిష్ల్టా, పఠాభి, జాషువా, శ్రీరంగం నారాయణబాబు భావ కవిత్వం మీద తిరుగుబాటు చేశారు. కానీ కొత్త మార్గం వేయలేదని నిర్థారణ ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ఇలా కవుల్ని, కవిత్వాన్ని అంచనా వేసి విశ్లేషణ చేయడం బాగుంది.
నన్నయ నుంచి అభ్యుదయ కవిత్వం వరకు అనేక తాత్విక విషయాలను పునాదిగా చేసుకుని సు.నా.రె విశ్లేషణ కొనసాగింది ఈ పరిశోధనాగ్రంథం. తెలుగు సాహిత్యాభిమానులకు, పరిశోధకులకు కవిత్వం ఆస్వాదిస్తూ గొప్ప కవిత్వం రాయాలనుకునే యువకులకు చక్కటి పాఠ్యగ్రంథంగా ఉపకరిస్తుంది. సాహిత్య వేత్తలు, రచయితల వద్ద తప్పక ఉండాల్సిన గ్రంథం ఇది.
– తంగిరాల చక్రవర్తి, 9393804472

Spread the love