మోడీ భజన తప్ప..

మోడీ భజన తప్ప..– కరీంనగర్‌కు ఏంకావాలో సంజయ్ అడగలేదు..
– వారణాసికి రూ.వందకోట్లు ఇచ్చిన ప్రధాని
– వేములవాడకు నయాపైసా ఇవ్వలేదు.. : బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ విమర్శ
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘వేములవాడ బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ ప్రధాని మోడీ జపం చేస్తూ భజన చేశారే తప్ప.. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గానికి, రాష్ట్రానికి ఏం కావాలో అడగలేకపోయారు. అభివృద్ధి కాంక్ష కాసింత కూడా లేని సంజయ్ ఈ ఐదేండ్ల పదవీకాలంలో ఐదుకొత్తలు కూడా తేలేదు. ఇప్పుడు ఆయన గెలుపు కోసం వచ్చిన మోడీ సైతం వారణాసికి రూ.వందకోట్లు ఇచ్చినట్టుగా.. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడకు నయాపైసా ప్రకటించలేదు’ అని బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెయ్యేండ్ల చరిత్ర ఉన్న వేములవాడ ఆలయానికి ఏవైనా అభివృద్ధి నిధులు ఇస్తారని తాను ఆశించానని, కనీసం ఆలయ ప్రతిష్ట గురించి ప్రస్తావించకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమని అన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసే బండి సంజయ్ కూడా వేములవాడ గుడి కోసం నిధులు ఇవ్వాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడే వేములవాడ ఆలయ అభివృద్ధి జరిగిందని, పక్కనే ఉన్న 32 ఎకరాల గుడి చెరువును పునరుద్ధరించి ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రం ప్రసాద్‌ స్కీమ్‌ను తీసుకొస్తే ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు ఒక సర్క్యూట్‌ జారీ చేయాలని కొట్లాడానని తెలిపారు. ఇక్కడకు ప్రధాని వచ్చినా ఒక్క హామీ దక్కలేదని, రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల జాతీయ హోదా, ఇలా ఒక్క జాతీయ ప్రాజెక్టునూ అడగలేకపోయిన సంజరుని ప్రజలు ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. మరోవైపు దేశంలో బీజేపీ సర్కారు రాదనే అసహనం ప్రధాని మొహంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు గుంజుకునే హక్కు ఎవరికీ లేదని, వీటిపై కాంగ్రెస్‌, బీజేపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, భానుప్రసాద్‌ రావు, మేయర్‌ సునీల్‌రావు, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చల్ల హరి శంకర్‌, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ సర్దార్‌ రవిందర్‌ సింగ్‌ ఉన్నారు.

Spread the love