Saturday, May 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅంచనాలు ఘనం… ఆదాయం స్వల్పం

అంచనాలు ఘనం… ఆదాయం స్వల్పం

- Advertisement -

గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.29 లక్షల కోట్ల రాబడి అంచనా
రూ. 1.81 లక్షల కోట్లు మాత్రమే రాక
ఏటా పెరుగుతున్న వ్యయం
అప్పులపైన సర్కార్ ఆధారం
రూ. 54 వేల కోట్లు అప్పు తేవాలని లక్ష్యం
రూ. 77,762 కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
కాగ్ నివేదికలో వెల్లడి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదు. అంచనాలు ఘనంగా ఉంటున్నాయి. కానీ ఆశించిన విధంగా రాబడి రాకపోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రాబడి అంచనా రూ.2,29,720.63 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే మార్చి నాటికి రూ.1,81,810 53 (79.14 శాతం) కోట్లు మాత్రమే వచ్చాయి. అనుకున్న లక్ష్యం కంటే రూ.47,910.1 (20.86 శాతం) తక్కువ రాబడి వచ్చింది. ఇందులో పన్ను ఆదాయం రూ.1,75,319.36 కోట్లు వస్తుందని అంచనా వేస్తే రూ.1,52,400.91 (86.93 శాతం) కోట్లు వచ్చాయి. పన్నేతర ఆదాయం రూ.31,618.77 కోట్లు వస్తాయని అంచనా వేస్తే రూ.18,986.64 (60.05 శాతం) కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ, మూలధన రాబడి రూ.2,84,837.30 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.2,60,007.65 (91.28 శాతం) కోట్ల రాబడి వచ్చింది. అంటే రూ.24,829.65 (8.72 శాతం) కోట్ల ఆదాయం తక్కువ వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,21,242.23 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. రూ.1,67,804.32 (75.85 శాతం) కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.53,437.91 (24.15 శాతం) తక్కువ ఆదాయం రావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,16,566.97 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ రూ.1,69,089.58 (78.08 శాతం) కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అనుకున్న లక్ష్యం కంటే రూ.47,477.39 (21.92 శాతం) కోట్ల ఆదాయం తక్కువగా వచ్చింది. కాగ్‌ ‌నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఏ ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ప్రకారం రాబడి రాలేదు.

ఆదాయానికి మించి ఖర్చు
గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం అంచనాలకు తగ్గట్టుగా రాలేదు. కానీ ఖర్చు మాత్రం ఆదాయానికి మించి చేయడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,81,810.53 కోట్ల ఆదాయం వచ్చింది. అదే కాలంలో రెవెన్యూ వ్యయం రూ.2,26,982.28 కోట్లు అంచనా వేస్తే, రూ.1,91,045.59 (84.17 శాతం) కోట్లు ఖర్చయ్యాయి. రెవెన్యూ, మూల ధన ఖర్చు కలిపితే గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,44,918.90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అంటే ఆదాయం కంటే ఖర్చు రూ.63,108.37 కోట్లు అధికంగా ఉండడం గమనార్హం.

అంచనా కంటే పెరిగిన అప్పు
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.54,009.74 కోట్లు అప్పు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మార్చి నాటికి రూ.77,762.35 కోట్ల అప్పు తేవడం గమనార్హం. అంటే అనుకున్న దాని కంటే రూ.23,752.61 కోట్లు అధికంగా అప్పు చేసింది. ఈ గణాంకాలను బట్టి అప్పులపైనే ప్రభుత్వం ఆధారపడినట్టు అర్థమవుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర గ్రాంట్ల విడుదలలోనూ తెలంగాణ పట్ల వివక్ష‍ కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.22,782.50 కోట్ల గ్రాంట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మార్చి నాటికి రూ.10,422.98 (45.75 శాతం) కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. ఇంకా రూ.12,359.52 (54.25 శాతం) కోట్లు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించింది. కేంద్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.58,458.71 కోట్ల అప్పు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలో 2,738.35 కోట్ల రెవెన్యూ మిగులు నమోదైంది. రూ.9,235.06 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నది. రూ.77,762.35 కోట్ల ద్రవ్యలోటు నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -