అపర ప్రతిభావంతుడు అయాచితం  

Extra talent is unsolicited– అయాచితం సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న కవులు
నవతెలంగాణ –  కామారెడ్డి 
తెలంగాణ గర్వించదగ్గ మహాకవి అయాచితం నటేశ్వర శర్మ మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని కామారెడ్డి కవులు అభిప్రాయపడ్డారు.  శనివారం కామారెడ్డి లోని సీనియర్ సిటిజన్ కార్యాలయ భవనంలో ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ కవి, రచయిత, అష్టావధాని డాక్టర్ అయాచితం   నటేశ్వర శర్మ సంస్మరణ కార్యక్రమాన్ని తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సంస్మరణ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు పాల్గొని మాట్లాడుతూ.. కామారెడ్డి లో సాహిత్య వాతావరణాన్ని కలిగించి ఎంతోమంది శిష్యులను మేటి రచయితలుగా తీర్చిదిద్దిన ఘనత నటేశ్వర శర్మది అని అన్నారు.  కామారెడ్డి సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన నటేశ్వర శర్మ కీర్తి ఎంతో గొప్పదని, ఇటు సాహిత్యానికి అటు అవధానానికి పండితుడిగా సాహితీవేత్తగా ఆయన చేసిన సేవలు ఎంతో గొప్ప వని తెలుగు సాహిత్య చరిత్రలో చెరగని ముద్ర వేసిన కవిగా ఆయన అందరి మనసులో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంజనేయ శర్మ మాట్లాడుతూ నటేశ్వర శర్మ జీవిత కాలంలో 56 గ్రంథాలు రాసి 1500 అష్టావధానాలు చేసి కామారెడ్డి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సాహితీవేత్తగా ఈ ప్రాంతం యొక్క సాహితీ సౌరభాలను ప్రపంచమంతా చాటిన గొప్ప వ్యక్తి అన్నారు. తన చేతిరాత ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారన్నారు.  మాజీ టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్రానంద్ మాట్లాడుతూ.. అయాచితం నటేశ్వర శర్మ యొక్క సాహితీ సలహాల ద్వారా ఎంతోమంది గొప్పవారిగా సాహిత్యంలో రాణిస్తున్నారని సాహితీ గురువుగా అభివర్ణించారు.
ఎన్నో సాహిత్య కార్యక్రమాలను తాను నిర్వహించి సాహిత్యానికి పరిమళాలను అద్దిన గొప్ప వ్యక్తిగా నటేశ్వర శర్మ అని ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్ అన్నారు.  వ్యాఖ్యాత సామ్రాట్ అంబీర్ మనోహర్ రావు మాట్లాడుతూ నటేశ్వర శర్మతో ఉన్న తన అనుబంధాన్ని ఈ సభలో పంచుకున్నారు. నటేశ్వర శర్మ లాంటి గొప్ప సాహితీవేత్త మళ్లీ పుట్టడని ప్రభుత్వం నటేశ్వర శర్మను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తన జీవితంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని అజాతశత్రువుగా సాహితీవేత్తలతో సన్నిహితంగా మిగిలే ఆయన స్వభావం ఎంతో గొప్పదని, అనేకమంది సాహితీవేత్తలను తాను ప్రోత్సహించి మంచి కవులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకు ఉంటుందని జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న కవులు రచయితలు నటేశ్వర శర్మతో ఉన్న అనుబంధాన్ని పంచుకొని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. నటేశ్వర శర్మ మరణం సాహితీ లోకాన్ని తీవ్ర నిరాశ పరిచిందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్, ప్రసాద్, మంద పీతాంబర్, తిరుపతి రావు, రామచంద్రన్, రంగాచారి, కాశ నరసయ్య,  సుధాకర్ , ప్రభాకర్, పబ్బ విజయశ్రీ, బాలకృష్ణ తదితర కవులతో పాటు సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love