అజేయ శక్తికి ఎదురుందా?

to invincible power Are you waiting?– భారత్‌, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ నేడు
– టీమ్‌ ఇండియాకు నాకౌట్‌ ఒత్తిడి!
– 2019 పునరావృతంపై కివీస్‌ ఆశలు
– 2023 ఐసీసీ ప్రపంచకప్‌
– మధ్యాహ్నం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
అజేయ భారత్‌. గ్రూప్‌ దశలో తొమ్మిదికి తొమ్మిది విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా ప్రపంచకప్‌లోనే తనకు ఎదురులేదని చాటింది. మరోవైపు, ఆఖరు వరకు పట్టువిడువని న్యూజిలాండ్‌. పరాజయాలు పలుకరించినా, గాయాలు వేధించినా, గెలుపు తథ్యమైన మ్యాచ్‌లో ఓటమి వెక్కిరించినా.. ఆ జట్టు పోరాట స్ఫూర్తి వీడలేదు.
ప్రపంచకప్‌ సెమీఫైనల్లో వరుసగా రెండోసారి భారత్‌, న్యూజిలాండ్‌ సమరానికి రంగం సిద్ధమైంది. నాలుగేండ్ల కిందట మాంచెస్టర్‌లో టీమ్‌ ఇండియాకు న్యూజిలాండ్‌ మానని గాయం చేసింది. ఇప్పుడు వాంఖడె స్టేడియంలో న్యూజిలాండ్‌కు ఆ వేదన మిగిల్చేందుకు రోహిత్‌ సేన సిద్ధమవుతోంది.
ఇటు బ్యాట్‌తో విరాట్‌, రోహిత్‌, రాహుల్‌.. అటు విలియమ్సన్‌, రచిన్‌ రవీంద్ర, డెవాన్‌ కాన్వే. ఇటు బంతితో బుమ్రా, షమి, కుల్దీప్‌.. అటు ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ, మిచెల్‌ శాంట్నర్‌. ఏ కోణంలో చూసినా భారత్‌తో సమవుజ్జీగా నిలిచే న్యూజిలాండ్‌.. గ్రూప్‌ దశలో తలొంచినా సెమీఫైనల్లో కఠిన ప్రత్యర్థి. ‘ఒత్తిడి’ ఫలితాన్ని శాసించే నాకౌట్‌ సమరంలో తొలి తప్పు ఎవరు చేస్తారో వారిదే వెనుకంజ!. భారత్‌, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ పోరు నేడు.
నవతెలంగాణ-ముంబయి
ఉరిమే ఉత్సాహం
బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా ఏ రంగంలో చూసినా టీమ్‌ ఇండియాకు ఎదురులేదు. బ్యాటింగ్‌ లైనప్‌లో రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. అందరూ ఏదో ఒక మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు. అదనపు బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సరైన సమయంలో జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. లక్ష్యాన్ని నిర్దేశించినా, లక్ష్యాన్ని ఛేదించినా టీమ్‌ ఇండియాకు తిరుగులేదు. ఆరంభంలో ఓపెనర్లు ఎదురుదాడి మంత్రతో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెడుతుండగా.. మిడిల్‌ ఓవర్లలో విరాట్‌, అయ్యర్‌ చూసుకుంటున్నారు. డెత్‌ ఓవర్లలో పరుగుల వేగం పని సూర్య, రాహుల్‌ బాధ్యత. ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచుల్లో టెయిలెండర్లు బ్యాట్‌ పట్టాల్సిన అవసరం రాలేదు. ఆ స్థాయిలో టీమ్‌ ఇండియా బ్యాటర్లు రచ్చ చేస్తున్నారు. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా భారత బౌలింగ్‌ను మార్చివేశాడు. బుమ్రా లేనియ 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తేలిపోయింది. తాజా ప్రపంచకప్‌లో బుమ్రా పవర్‌ప్లేలో సంధించిన 80 శాతం బంతులు (175/228) డాట్‌ బాల్స్‌ కావటం గమనార్హం. ఓ ఎండ్‌లో బుమ్రా పరుగుల నియంత్రణతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచగా మరో ఎండ్‌లో సిరాజ్‌, షమి వికెట్ల జాతర చేస్తున్నారు. ఆరంభంలో, మిడిల్‌లో, డెత్‌ ఓవర్లలో ఎప్పుడైనా బుమ్రాను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు తంటాలు పడుతున్నారు. మహ్మద్‌ షమి స్వింగ్‌ జోరు, మహ్మద్‌ సిరాజ్‌ సీమ్‌ దూకుడు జత కలవటంతో భారత పేస్‌ త్రయాన్ని ఎదుర్కొవటం కష్టసాధ్యమైంది. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలు మాయ చేయటంలో ఎప్పుడూ నిరాశపరచలేదు.
సమిష్టితత్వమే రక్ష
న్యూజిలాండ్‌ ఎప్పుడూ బలమైన జట్టు. వ్యక్తిగత ప్రదర్శనలు, ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడటం ఆ జట్టుకు అత్యంత అరుదు. తాజా ప్రపంచకప్‌లో రచిన్‌ రవీంద్ర అనూహ్య ప్రదర్శన న్యూజిలాండ్‌కు కొండంత బలమైంది. ఓ వైపు విలియమ్సన్‌ గాయంతో బెంచ్‌కు పరిమితమైనా.. కివీస్‌ ఏమాత్రం జోరు తగ్గలేదు. ఆసీస్‌తో ఛేదనలో ఆఖర్లో తడబడినా.. పాక్‌పై 401 కొట్టినా ఓటమి చవిచూసినా న్యూజిలాండ్‌ చిరునవ్వుతోనే స్వీకరించింది!. క్రీడాస్ఫూర్తి, స్నేహభావంతో కూడిన సమిష్టితత్వం ఆ జట్టును మరింత ప్రమాదకరంగా మార్చాయి. కేన్‌ విలియమ్సన్‌, డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర, టామ్‌ లేథమ్‌ సహా డార్లీ మిచెల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. పరుగుల వేటలో వెనక్కి తగ్గటం లేదు. గ్లెన్‌ ఫిలిప్స్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ మ్యాచులు ముగిసేసరికి ఆల్‌రౌండర్‌ అవతారం ఎత్తాడు. ఇక బంతితో కివీస్‌ పేసర్లు భారత్‌కు ఎప్పుడూ కొరకరాని కొయ్యే. బంతి వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌ అయితే విరాట్‌, రాహుల్‌, రోహిత్‌, శ్రేయస్‌లకు ట్రెంట్‌ బౌల్ట్‌ నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. వికెట్లను లక్ష్యంగా చేసుకుని బంతిని సంధించే బౌల్ట్‌ పవర్‌ప్లేలోనే ఎల్బీడబ్ల్యూ రూపంలో గట్టి దెబ్బ కొట్టగలడు. టిమ్‌ సౌథీ, లాకీ ఫెర్గుసన్‌ సైతం ఏమాత్రం తక్కువ కాదు. బౌల్ట్‌తో సమానంగా ప్రత్యర్థులను దెబ్బకొట్టగలరు. స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌కు ఇక్కడి పిచ్‌లపై మంచి అనుభవం, రికార్డు ఉన్నాయి. మిడిల్‌ ఓవర్లలో అతడిని జాగ్రత్తగా ఎదుర్కొవాలి.
తొలి ప్రత్యర్థి ‘ఒత్తిడి’
ప్రపంచకప్‌లో అసలు మజా నాకౌట్‌ దశలోనే ఉంటుంది. గ్రూప్‌ దశలో విజయాలు ఇక లెక్కలోకి రావు. 2023 ప్రపంచకప్‌లో భారత్‌ గ్రూప్‌ దశలో తొమ్మిదికి తొమ్మిది విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్‌ దశలో టాప్‌ లేపటం భారత్‌కు కొత్త కాదు. 2015 ప్రపంచకప్‌లో గ్రూప్‌-బిలో భారత్‌ ఆరుకు ఆరు విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలువగా.. 2019 ప్రపంచకప్‌లో తొమ్మిదింట ఏడు విజయాలు సాధించి నం.1గా నిలిచింది. కానీ కీలక సెమీఫైనల్లో 2015లో ఆసీస్‌కు, 2019లో కివీస్‌కు ఫైనల్‌ బెర్త్‌ కోల్పోయింది. ముచ్చటగా మూడోసారి భారత్‌ గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచింది. మళ్లీ టీమ్‌ ఇండియా ముంగిట సెమీఫైనల్‌ రూపంలో నాకౌట్‌ సమరం ఎదురుచూస్తుంది. గ్రూప్‌ దశలో ఓటమి పెద్ద విషయం కాదు. పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ నాకౌట్‌లో ఏ చిన్న తప్పు చేసినా భారీ మూల్యం తప్పదు. సెమీఫైనల్‌లో టీమ్‌ ఇండియా తొలి ప్రత్యర్థి ‘ఒత్తిడి’. న్యూజిలాండ్‌ కంటే ముందు భారత్‌ ఒత్తిడిని జయించాలి. అప్పుడే అహ్మదాబాద్‌లో టైటిల్‌ పోరుకు సిద్ధమవగలదు.
గ్రూప్‌ దశలో ఐదో మ్యాచ్‌ నుంచి భారత్‌ తుది జట్టులో మార్పులు చేయలేదు. బ్యాటింగ్‌ లైనప్‌ను సూర్య కుమార్‌, బౌలింగ్‌ లైనప్‌ను మహ్మద్‌ షమి మరింత పటిష్టం చేశారు. సెమీస్‌ పోరుకు తుది జట్టులో మార్పులు ఉండబోవు. ఇక న్యూజిలాండ్‌ను గాయాలు వెంబండించినా సెమీస్‌ మ్యాచ్‌కు అందరూ సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నారు. లాకీ ఫెర్గుసన్‌ తుది జట్టులోకి రానున్నాడు
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, కుల్దీప్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.
న్యూజిలాండ్‌ : డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), డార్లీ మిచెల్‌, టామ్‌ లేథమ్‌ (వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మాన్‌, మిచెల్‌ శాంట్నర్‌, టిమ్‌ సౌథీ, లాకీ ఫెర్గుసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌.

పిచ్‌, వాతావరణం
ముంబయి వాంఖడె పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఫ్లడ్‌లైట్ల వెలుగులో బంతి స్వింగ్‌ అవుతోంది. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని.. బంతితో ఆ అనుకూలతను సొమ్ము చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌కు రిజర్వ్‌ డే లేదు. అయినా, మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. వాతావరణ సమస్యలతో సెమీస్‌ ఫలితం తేలకంటే గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌ ఇండియా నేరుగా ఫైనల్లోకి ప్రవేశించనుంది.

Spread the love