జాతరలు

Fairs

తెలంగాణ నేలపైన రెండు జాతరలు ఈ నెలలోనే జరుగుతున్నాయి. ఒకటి పుస్తకాల జాతర, హైద్రాబాద్‌లో గత వారం రోజులుగా అక్షర జన సమ్మర్థంతో కొనసాగుతుండగా. ఇదే నెల 21 నుండి మేడారంలో గిరిజన జాతరకు జనం పోటెత్తనున్నారు. మరో జాతర మన దేశ రాజధానిలో, అన్నా న్ని మన నోటికందించే రైతన్నలు ఆవేదనతో నినదిస్తూ ఢిల్లీని చుట్టుము డుతున్నారు. మొదటిది మేధో మధనానికి విజ్ఞాన వికాసాలకు సంబంధించిన దైతే, చివరి రెండు వేరు వేరైనా గానీ కష్టాలను తొలగించమని వేడు కోవడ మొకటైతే, రెండోది కష్టాల కారకులను నిలదీసే చైతన్యం. ఈ రెండూ ప్రజల్లో పెరిగిపోతున్న బాధలు, కష్టాలు, వేదనలను తెలియజేస్తాయి. మూడింట్లోనూ ప్రజలు సామూహికంగా పాల్గొంటున్న సందర్భమే కనపడుతుంది.
‘మనిషి సృష్టించిన అన్ని అద్భుతాల్లో కెల్లా పుస్తకాలు అత్యంత అద్భుత మైనవీ” అంటారు మాక్సింగోర్కి. నిజంగా పుస్తకం ఎంతో అపురూపమైనది. మానవ జీవితం చాలా పరిమితమైనది. ఈ తక్కువ కాలానికి సంబంధించిన జీవితంలోనే ఈ ప్రపంచపు అనేక అనుభవాలసారాన్ని, జ్ఞానాన్ని పొందగల ఏకైక సాధనం పుస్తకమే. ఒక కొత్త అనుభూతిని, ప్రేరణను ఆలోచనను, ఎరుకను కలిగిస్తుంది ఈ నిశబ్ద పుస్తకం. పుస్తకాలు, మస్తకానికి అందించే ఆహారం వంటివి. వాస్తవంగా ఏ పుస్తకం చదవాలో కూడా తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్‌ మాయాజాలాలు తీసుకొస్తున్న పుస్తకాలూ చాలానే వున్నాయి. కొన్నిభ్రమలను, వక్రీకరణలతో కూడిన సారాన్ని అందించేవీ వుం టాయి. సామాజిక వాస్తవికతలను మరుగుపరిచి, ఊహల్లో విహరింపజే స్తాయి. కొన్ని. అందుకనే ఎంపిక చాలా కీలకమయిన విషయం. మనిషి ఆలో చనలు వికాసం పొందే, సత్యశోధనకు ప్రేరణలిచ్చే ప్రగతిశీల అభ్యుదయ పుస్తక ప్రచురణ సంస్థలు ఎన్నో, దశాబ్దాలుగా అలాంటి పుస్తకాలను వెలుగు లోకి తెస్తూనే ఉన్నాయి. మన కందరికీ తెలుసు, కేవలం 23 పేజీల కమ్యూనిస్టు మేనిఫెస్టో పుస్తకం, ప్రపంచ గమనాన్ని, ప్రాపంచిక దృక్పధాన్ని విప్లవాత్మకంగా మార్చివేసింది. వాస్తవిక పునాదుల పై నుండి కొత్త చూపును అందించింది. ప్రపంచ గమన మూలసూత్రాల్ని విప్పి పెట్టింది. మనిషి కేంద్రంగా ఈ ప్రపంచాన్ని మార్చుకోవటమెలాగో నేర్పింది. ఆ పుస్తకం ఒక సంచలనం. దీనికంటే ఎన్నో తరాల ముందు ప్రపంచంలో మత గ్రంధాలూ వచ్చాయి. అవికూడా మానవునిపై దేవుని కేంద్రంగా చేసుకుని మాట్లాడాయి. మనుషుల ప్రవర్తనలు, బాధలు, కన్నీళ్లు, వేదనల గురించీ చెప్పాయి. కానీ దేవుని సంప్రాప్తితాలని నుడి వాయి. కర్మఫలితాలని చెప్పాయి. వాటిని మార్చుకోలేమన్నాయి. ఇవి మానవున్ని ఆధార జీవిగామలిచాయి. ఓదార్పులను మాత్రమే ఇవ్వగలి గాయి. కాబట్టి చదవటానికి పుస్తకాల ఎంపిక కూడా ముఖ్యమైనది.
36వ పుస్తక ప్రదర్శనగా నిర్వహిస్తున్న హైద్రాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ఈ సారి పుస్తక దుకాణాలు ఎక్కువగా పెట్టారు. ఏర్పాట్లపై వస్తున్న సూచనల మేరకు నిర్వాహకులు ఈ సారి బాగానే చేశారు. కానీ పుస్తక సందర్శకులు కాస్త మందగించారు. అమ్మకాలు కూడా సన్నగిల్లాయి అంటున్నారు. ఇందుకు కారణం, ఫిబ్రవరి నెల కావటం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరీక్షల తయారీ కాలం. అంతే కాక వేసవి కాలపు ఆరంభ సమయమూ ఒక సమస్య. ఏది ఏమయినా ప్రదర్శన సంద ర్భంగా ఏర్పాటు చేసిన, సాహిత్య చర్చలు, పుస్తకావిష్కరణలు, సామాజిక విషయాల విశ్లేషణలు చాలా బాగాజరుగుతున్నాయి. అనేక మంది రచ యితలు, కవులు, మేధావులు కలుసు కోవడానికి ఇదో గొప్ప సందర్భం.
ఇక ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ పండగ, తెలంగాణ కుంభ మేళాగా ప్రసిద్ధమయిన మేడారం జాతరకూ ప్రజలు వెల్లువెత్తనున్నారు. ఇప్పటికీ జనం చేరుకుని మొక్కులు తీరుస్తున్నారు, చుట్టు ప్రక్కల ఏడెని మిది రాష్ట్రాల నుండీ జనం వచ్చే ఈ జాతర ఈ నెల 21న ప్రారంభ మవుతుంది. కోట్లాది మంది భక్తులు జాతరలో పాల్గొంటారు. ఆనాడు కాక తీయ సామ్రాజ్యంలో రాజుకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన తెగ నాయకులు చేసిన పోరాటంలో అమరులయిన సారక్క, సమ్మక్క, జంపన్న దొర, పగిడిద్దరాజుల జ్ఞాపకార్థం జరుగుతున్న ఉత్సవమిది. ఇంకా అనేక కథలు దీని చుట్టూ అల్లుకుని ఉన్నాయి. ఆ జాతరలో పాల్గొనే ప్రజలు తమ బాధలను తీర్చమని, కోర్కెలను నెరవేర్చమని, మొక్కులు మొక్కుతారు. ఏడాదికేడాది జనం పెరుగుతూనే వున్నారు. ఎందుకంటే జనం బాధలూ, కోర్కెలూ, పెరుగు తూనే ఉన్నాయి. తీర్చే నాయకులు లేకుండా పోయారు. ఏం చేయలో తెలి యని పరిస్థితిలో జనం ఆధ్యాత్మిక నమ్మకాలపైనే ఆధారపడుతుండటాన్ని ఇవి మనకు తెలియజేస్తాయి. అయినప్పటికీ పెద్ద యెత్తున ప్రజలు కదిలే జాతర ఇది. సమూహ సందర్భాలు ప్రజల్లో ఒక ఉత్సాహం, భరోసా, ధైర్యం కలుగ జేస్తాయి. వారికి తగిన ఏర్పాట్లను సౌకర్యాలను కలిగించటం ప్రభుత్వాల బాధ్యత.
ఇక ఢిల్లీలో జరుగుతున్న డిమాండ్ల జాతరకూ రైతులు పెద్ద యెత్తున కదలి వచ్చారు. గ్రామీణ ప్రజలూ సమ్మెకు దిగారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆదుకోవాలని కోరటం ఇందులోని అంశాలు. కానీ ప్రభుత్వం మేకులు కొట్టి, కాంక్రీటుతో గోడలు కట్టి, బుల్లెట్లతో దాడులు చేస్తూ అన్నదాతలను అణచివేయ చూడటం దారుణం. వీటన్నింటికీ వచ్చే ఎన్నికల జాతరలోనే సరైన పరిష్కారాన్ని వెతుక్కోవాలి మనం.

Spread the love