లక్ష్యం సరే… గెలవటం ఎలా ?

The goal is ok...how to win?మనలో చాలామందికి చాలా కావాలని ఉంటుంది. ఉన్నత స్థానాలకి ఎదగాలని ఉంటుంది. కాని వాటిని చేరుకోడానికి ఒక లక్ష్యమంటూ ఉండదు. కొంత మందికి కోరిక, లక్ష్యం  రెండూ ఉంటాయి, కానీ వాటిని సాధించటానికి కావాల్సిన ప్రణాళిక ఉండదు. మరి కొంతమందికి కోరిక, లక్ష్యం, ప్రణాళిక మూడూ ఉంటాయి, కాని వాటిని చేరుకోడానికి  కావాల్సిన కృషి ఉండదు. తను సాధించాలన్న కోరిక, లక్ష్యం, ప్రణాళిక, ఆచరణ ఉంటేనే ఎవరయినా వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. సమాజంలో రోజు రోజుకి  పోటీ పరీక్షల రాసే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలంటే ఈ పోటి పరీక్షలలో విజయం అనివార్యం కావటంతో, నేడు అందరూ ఈ పరీక్షలకి సమాయత్తమవుతున్నారు. నడుస్తున్నది పోటీ పరీక్షల కాలం. ఈ పోటీ పరిక్షలలో విజేతగా నిలవాలంటే  దుగా ఓ ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించు కోవాలి. ఆ ప్రణాళికతో  లక్ష్యాన్ని చేరుకోవటంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలన్న దానిపై ముందుగా దృష్టి సారించాలి. అత్యుత్తమ ప్రణాళిక మీ చేతిలో ఉంటే, సగం లక్ష్యాన్ని మీరు  సాధించినట్టే. ప్రస్తుత పోటి ప్రపంచంలో ఎన్నకున్న లక్ష్యాన్ని సాధించటానికి కావాల్సిన అంశాల్ని ఒకసారి తెలుసుకుందాం.

పోటి పరిక్షలంటే యుద్ధం కాదు, అవి జీవితాన్ని గెలవటానికి ఒక కొలమానమూ కాదు. ఇవి కేవలం ఒక ఉద్యోగానికి అరÛత పరీక్ష మాత్రమే అన్న సంగతి గుర్తుంచు కోవాలి. ప్రభుత్వ ఉద్యోగం అందరికి ఒక కల కాబట్టి, ఆ కలని సాధించుకోడానికి పోటీ పరిక్షలు ఒక మార్గంగా భావించాలి. భయం, ఒత్తిడి రెండూ, విజయానికి శత్రువులు. ఇవి దరి చేరితే మనల్ని విజయం వరించటం కాస్త ఆలస్యం అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకె కాదు, కొత్తగా ఏదయినా సాధించాలనే వాళ్ళకి కూడా భయం, ఒత్తిడి సహజం. పరీక్షలు దగ్గర పడే కొద్దీ ఈ భయం, ఒత్తిడి మరింత పెరుగుతాయి. చాలా మంది విద్యార్ధులు పరిక్షలు సమీపిస్తున్న కాలంలో తీవ్రమయిన ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడే వారి విజాయా వకాశాల్ని దేబ్బతీస్తునాయి. బాగా చదివిన వారు కూడా విజేతలుగా నిలవలేక పోవటానికి ఇదే కారణం. అందుకే పోటీ పరిక్షలలో విజయం సాధించాలి అనుకునే వారు, ముందుగా భయం నుండి, ఒత్తిడి నుండి బయట పడాలి. మొదటినుండి ప్రణాళికాబద్దంగా చదివితే ఈ ఒత్తిడి నుండి దూరం కావొచ్చు. నిజానికి ఇది చెప్పినంత సులువు కాదు. కాని ఖచ్చితమయిన ప్రణాళిక, చిత్తశుద్ది ఉంటె ఈ రెండు భూతాల్ని తరిమి కొట్టవచ్చు. వెయ్యి అడుగుల పయనమయిన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్న సామెత ప్రకారం పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్‌ ప్రారంబించటమే లక్ష్య సాధనలో మొదటి అడుగు. ఆ ఒక్క అడుగుతోనే ఎవరికయినా వారి విజయ ప్రస్థానం ప్రారంభమవుతుంది.
ప్రణాళికతోనే విజయం సాధ్యం…
ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా, దానికి ఖచ్చితమయిన ప్రణాళిక అవసరం. నిర్దేశించుకున్న ప్రణాళికతో కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కటోర క్రమశిక్షణ కూడా అవసరం. పోటీ పరిక్షలో విజేతలుగా నిలవాలనుకునే వారికి ప్రణాళికాబద్దమయిన కృషి అత్యంత అవసరం. ప్రణాళిక రూపొందించుకోడానికి ముందుగా పరిక్షా ప్రకటన వెలువడిన నాటినుండి పరీక్ష నిర్వహించే తేది మధ్య ఉండే కాలాన్ని అంచనా వేసుకోవాలి. ఈ కాలానికి అనుగుణంగా పరీక్ష సబ్జక్ట్స్‌ ప్రిపేర్‌ అవ్వటానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనికోసం గతంలో వొచ్చిన ప్రశ్నాపత్రాల్ని పరిశీలించి ఏ ఏ సబ్జక్ట్స్‌ లో ఎక్కువ మార్కులు వస్తున్నాయో, ఆ సబ్జెక్ట్స్‌ లిస్టు ఒకటి ప్రత్యేకంగా తయారు చేసుకోని, ఆ సబ్జక్ట్స్‌ కి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. తక్కువ మార్కులు వొచ్చే సబ్జెక్ట్స్‌ ని ఆఖరి రోజుల్లో చదువుకోవటం ఎక్కువ ఫలి తాల్ని ఇస్తుంది. ఇలా పక్క టైం టేబుల్‌ రూపొందించుకోవటం వల్ల సమయం ఆదా అవ్వటంతో పాటు, పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో సహజంగా ఎదురయ్యే ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మంచి ప్రణాళికలు (టైం టేబుల్‌) రూపొందిచుకోవటంతో సరిపోదు, పూర్తి చిత్తశుద్ధి, ఆయా సబ్జెక్ట్స్‌ ల ఫఠనం పూర్తి చేసే వరకు విశ్రమించని నైజం, మొక్కవోని దీక్ష కావాలి. అప్పుడే కోరుకున్న లక్ష్యాల్ని అందుకోగలుగుతాము.
ఇలా చదవండి…
పరీక్షలలో ఏ ఏ సబ్జెక్ట్స్‌ నుండి ప్రశ్నలు వస్తాయో, పరీక్ష లలో ఏం జరుగుతుందోననే ఆలోచనలతోనే సహజంగా భయాందోళన మెQదలవుతుంది. ఇది మన ఫఠనాసక్తిని దెబ్బ కావల్సింత మేరా దెబ్బ తీస్తుంది. దీనితో ఒక్కొక్కసారి మొదటికే మోసం రావొచ్చు. కాబట్టి, అలా మనలో ఆందోళన కలిగించే అంశాల మీద నుంచి దృష్టి సారించకుండా, ప్రస్తుతం ఎలా చదవాలన్న దానిపై శ్రద్ధ పెడితే మంచిది. ముందుగా మీకు ఆసక్తిని కలిగించే అంశాలతో మీ ప్రిపరేషన్‌ ప్రారంభిచండి. అది మీకు కావాల్సిన స్థైర్యాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. ప్రిపరేషన్‌ వేగం పుంజుకున్న ప్పుడు మీకు కరినంగా అనిపించినా సబ్జెక్ట్స్‌ పై దృష్టి సారించండి. ఇది మీ ప్రిపరేషన్ను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆయా సబ్జెక్ట్‌ల మీద సలహాలు, సూచనలు తీసుకుంటూ, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్రమంగా మీరు ఆ సబ్జక్ట్స్‌ ని కూడా సమర్ధ వంతంగా అర్ధం చేసుకోగలుగుతారు. ఇది మీలో కావలసినంత ఆత్మవిశ్వాసానికి కారణమవుతుంది .
పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగా లలో విజయం సాధించాలంటే, పోటీని తట్టుకొని ఉద్యో గం సంపాదించాలంటే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావా ల్సిందే. పోటీపరిక్షలకి హాజరయ్యే వారంతా కొన్ని సబ్జెక్ట్స్‌ కామన్‌గా చదవాల్సి ఉంటుంది. జనరల్‌ నాలెడ్జ్‌తో పాటు ప్రాంతీయ భౌగోళిక, సామాజిక, సంస్కృతి, వారసత్వం, ఆర్ధికం, కళలు, సాహిత్యం, పాలన విధానా లపై స్పష్ట మయిన అవగాహన ఏర్పర్చుకోవాలి. దీంతోపాటు భారత రాజ్యాంగం, భారత భౌగోళిక అంశాలు, భారత ఆర్ధిక వ్యవస్థ, భారత జాతీయోద్యమం అంశాలపై కూడా పట్టు సాధించాలి. దైనందిన జీవితంలో సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, అంతర్జాతీయ సంబంధాలు, సమకాలీన సంఘటన లపై కూడా విస్తృతంగా చదవాలి, ఈ అంశాలు ఒక్కొకసారి మన విజయాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వీటిపైనా కూడా పూర్తి పట్టు కలిగి ఉండాలి. విజయం సాధించాలంటే రోజుకు కనీసం 8 గంటలు చదవాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ ఎఫ్ఫైర్స్‌కి సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
సొంత నోట్సు.. కొంత మేలు …
పోటీ పరిక్షలలో ప్రశ్నలు ప్రధానంగా అభ్యర్ధికి ఆయా సబ్జెక్ట్స్‌ పై ఉండే అవగాహనా సామర్ధ్యాన్ని నిర్దారించేలానే ఉం టాయి. అందుకే ఏ పోటీ పరీక్షలోనైనా ప్రశ్నని అర్ధం చేసుకో వటం ముఖ్యం, దానికి అనుగుణంగా సరైన సమాధానాన్ని ఆతి తక్కువ సమయంలో గుర్తించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. దీని కోసం నాణ్యమయిన ప్రామాణిక పుస్తకాలని ఎంచుకోవటం, వాటిని సమగ్రంగా చదవటం అవ సరం. ముఖ్యంగా గ్రూప్‌ పరిక్షలలో వివిధ రకాలయిన సబ్జెక్ట్స్‌ సిలబస్‌ లో ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్‌ కి సంభందించిన మౌళిక అంశాలు అర్ధం కావాలంటే ఎన్సీయార్టీ, ఎస్సీయార్టీ ప్రచురుం చిన పుస్తకాలని చదవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ సంస్థలు వివిధ సబ్జెక్ట్స్‌ పై రూపొందించిన 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న పుస్తకాలు చదివితే ఆయా సబ్జెక్ట్స్‌ కి సంబం ధించిన ప్రామాణిక అంశాల మీద పట్టు సాధించే అవకాశం ఉంటుంది. దీనితోపాటు తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు చదవటం వల్ల కూడా అభ్యర్ధుల అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పుస్తకాల్ని నేరుగా చదవటంతో పాటు, వాటి నుంచి సేకరించిన సమా చారం ఆధారంగా సొంతంగా నోట్స్‌ని తయారు చేసుకుంటే అది మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక్కడ గమనిం చాల్సిన మరొక ప్రధాన అంశం ఏమిటంటే, సమయం తక్కు వగా ఉంటె గుర్తుంచు కోవాల్సిన అంశాల ఆధారంగా సంక్షి ప్తంగా నోట్స్‌ని తయారు చేసుకోవాలి. మార్కెట్‌లో దొరికే నాసిరకం స్టడీ మెటీరియల్‌తో జాగ్రత్తగా ఉండండి, వివిధ రకాలయిన స్టడీ మెటీరియల్‌ని చదవటం వల్ల అనవసర మయిన గందరగోళానికి గురయ్యే అవ కాశం ఉంది. దీనిని అధిగమించాలంటే ప్రామాణికమయిన పుస్తకాలనే ఎంపిక చేసుకుని చదవాల్సి ఉంటుంది. వీలయి నంత వరకు సోషల్‌ మీడియా ద్వారా వ్యాపించే ప్రతికూల నెగెటివ్‌ ప్రచారాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన మన సుతో, ఎలాంటి ఆందోళనకూ గురి అవ్వ కుండా పరీక్షకు సన్నద్ధ మైతేనె అనుకున్న లక్ష్యాన్ని సాధించటం సాధ్యమవుతుంది.
పునశ్చరణతో ఫలితమేక్కువ..
చదువుతో పాటు, చదివినదాన్ని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవటం కూడా చాలా అవసరం. పదే పదే ఒకే దారిలో నడిస్తే, అది ఒక సునాయాస ప్రయాణానికి దోహదపడే దారిగా అవతరిస్తుందన్నది వాస్తవం. దీన్ని పునశ్చరణకు సరిగ్గా అన్వ యించుకోవచ్చు, చదివిన అంశాలని అదే పనిగా పునశ్చరణ చేసుకోవటం వల్ల మెరుగయిన విజయవకాశాలు పొందే అవ కాశం ఉంది. మానవ మస్తిష్కం ఏది చదివినా, దానిలో 70 నుండి 80 శాతం 24 గంటలలోపు మరిచిపోతుందని హెర్మన్‌ ఎబింగస్‌ అనే జర్మన్‌ సైకాలజిస్ట్‌ తన పరిశోధన ద్వారా తేల్చి చెప్పాడు. 1885 హెర్మన్‌ ప్రతిపాదించిన ఈ ద్రుగ్విషయాన్నే ‘స్పేసింగ్‌ ఎఫెక్ట్‌’ అంటారు. అయితే పునశ్చరణ ద్వారా దీనిని అధిగమించవచ్చు. చదివిన వాటిన పదే పదే వల్లే వేసుకోవటం ద్వారా మరిచిపోయే ప్రమాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొ వచ్చు. ఆరోజు మనం విన్న, చదివిన లేదా చూసిన విషయా లకు సంబంధించిన జ్ఞాపకాలన్నిటినీ మెదడు రాత్రి నిద్రపోయే సమయంలో క్రమబద్ధీకరించుకుంటుంది. ఆ సమయంలో అంతగా ఉపయోగం లేదని అనుకునే విషయాలను అది వదిలించుకుంటుంది. అందుకే నిద్ర పోయేలోగా ఆ రోజు చదివిన విషయా లను ఒకసారి మననం చేసుకుని పడు కోమని మన పెద్దలు చెప్పేవారు. వ్యక్తి త్వ వికాస నిపుణులు కూడా దీనినే నిర్ధారిస్తారు. రాత్రయ్యే సరికి మెదడు ఎలాగూ అలసిపోయి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చు కునేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండదు. దీన్నే ‘డెసిషన్‌ ఫెటిగ్‌’ అంటారు. ఈ దశలో యాంత్రికంగా సాగే పునశ్చరణ వల్ల ఉపయోగం ఉంటుంది. ఇక రెండో పునశ్చరణ మర్నాడు, ఆ తర్వాత మూడు రోజుల తర్వాత, ఆపై వారానికి, ఇలా శాశ్వతంగా గుర్తుండిపోయే వరకు పునశ్చ రణ సాగాల్సిందే. ప్రపంచంలో ఎంతటి మేధావి అయినా, ఎంతటి ప్రతిభావంతుడయినా పునశ్చరణ (రివిజన్‌) విషయం లో బద్ధకిస్తే విజయం కూడా మనల్ని మరిచిపోతుందని గుర్తు పెట్టుకోవాలి.
ఆరోగ్యం జాగ్రత్త …
పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి శిక్షణతో పాటు, ఆరోగ్య పరిరక్షణ అనేది కూడా కీలకం. ఆరోగ్య వంతులు మాత్రమే తమ శక్తిసామర్ధ్యాలని తగిన రీతిలో వినియోగిస్తారు. అందుకే చదువుతోపాటు ఆరోగ్యంపైన కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన శరీరం మాత్రమే మెదడును, ఆలోచనల్ని ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మితమైన ఆహారం తీసుకోవటంతో పాటు, ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహా రాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవ సరం. జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్‌లకు వెళ్ళాల్సిన అవ సరం లేదు. ప్రతిరోజు అరగంటలో సగ భాగం నడకకి కేటాయించాలి. నడక శారీరక ఆరోగ్యంతో పాటు, మాన సిక ఆరోగ్యాన్ని వృద్ధి చేయటంలో ఎంతో విలువయిన పాత్రని పోషిస్తుంది. మిగిలిన సగభాగం యోగా, ఆసనాలు వేయటం ద్వారా మరింత మెరుగయిన ఫలి తాలని పొందవొచ్చు. ఇది పరిక్షల సమయంలో మిమల్ని ఒత్తిడి నుండి దూరం చేస్తుంది.
నిద్ర కూడా మానవుని ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభా వాన్ని చూపిస్తుంది. చాల మంది ఎక్కువ సమయం చదువుతూ, నిద్రకి తక్కువ సమయం కేటాయిస్తారు. దీని వల్ల లాభాల కన్న, అనర్ధాలే ఎక్కువ. మంచి నిద్ర మెదడు, శరీరానికి కావలసినంత మేలు చేస్తుంది. అందువల్ల పరీక్షలకి ప్రిపేర్‌ అయ్యే అభ్యర్ధులు రోజుకి కనీసం 6 నుండి 8 గంటలు నిద్ర పోయేలా ప్లాన్‌ చేసుకోవాలి. నిద్ర తక్కువైతే, కొన్నిసార్లు ఏం చదివినా గుర్తుం డదు. అలాగే నిద్ర ఎక్కువైనా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎడతేరిపి లేకుండా చదవటం కూడా అంత ప్రయోజనకారి కాదు. గ్యాప్‌ లేకుండా చదివితే, చదివింది మెద డుకు ఎక్కదు అని పరిశోధకులు చెబుతారు. మానవులు శ్రద్ధగా ఒక గంట మాత్రమే చదవగలరు. మిగిలిన సమయమంతా చదివినట్టు అనిపించినా, అది గుర్తుండే అవకాశాలు తక్కువ. అందువల్ల రెండు గంటలకొకసారి విరామం తీసుకుంటూ చదవాలి. అప్పుడే చదువుతున్న అంశాలపై మనసు లగం చేయడానికి అవకాశం కలుగుతుంది.
ఇతరులతో పోల్చుకోవద్దు…
ఈ భూమ్మీద పుట్టిన ఏ జీవికి ఇంకొక జీవితో పోలిక ఉండదు. ఒకే జాతి జీవుల మధ్య కూడా ఏదో ఒక అంతరం ఉంటుంది. మనుషుల్లో కూడా అంతే, ఏ ఒక్కరిలోను ఐక్యూ లెవెల్స్‌, గ్రహణ శక్తీ, ఆలోచన సరళి, అవగాహనా సామర్ద్యం ఒకేలా ఉండవు. కొంత మంది ఒక అంశాన్ని ఒకసారి చదివితే అర్ధం చేసుకోగలుగుతారు, మరి కొంతమంది ఒకటికి రెండు సార్లు చదివితేనే అర్ధం చేసుకోగలుగుతారు. దీనిని అనేక భాహ్య, అంతర్గత కారణాలు ప్రభావితం చేస్తాయి. అందుకే ఏ ఒక్కరు ఇతరులతో పోల్చుకుని తమ శక్తీ, సామర్ద్యాల్ని అంచనా వేసుకోకూడదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవటం వల్ల మాత్రమే మీరు ఎక్కువ లబ్ది పొందుతారు. చదవటం ప్రారంబించిన తర్వాత, ప్రతిరోజు మిమ్మ ల్ని మీతో పోల్చుకోవటం ప్రారంభించండి. మొద ట్లో ఉన్న మీకు, కొంత శిక్షణ అనంతరం మీకు ఉన్న పోలికని అంచనా వేసుకోవటం వల్ల, మీరు ఏ మేరకు పురోగతి సాధించారో అర్ధమవుతుంది. ఎప్పటి కప్పుడు మీరు సాధించిన పురోగతిని అంచనా వేసుకోవటం, మీకు తిరుగులేని ఉత్సాహాన్ని అందిస్తుంది. ప్రిపరేషన్ని మరింత వేగవం తంగా, సమర్ధవంతంగా నిర్వహించడానికి ఈ పోలిక ఒక చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆ చోదక శక్తే మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టే సంజీవనిలా పనిచేస్తుంది.
ఆఖరిగా ఒక మాట…
నడుస్తున్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ప్రతి ఒక్కరికి సవాలుగానే మారింది. అందునా ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించడమంటే కత్తి మీద సామే అని చెప్పాలి. నిరంతర శ్రమ, ఎంచుకున్న లక్ష్యంపై అకుంటిత దీక్ష, ప్రణాళికా బద్దమయిన అభ్యాసనం ఉంటె పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవటం అసాధ్యమేమీ కాదు. దానికి ముందుగా, మిమల్ని మీరు అంచనా వేసుకోవాలి. మీ బలాలు, బలహీనతలపై స్పష్ట మయిన అవగాహన కలిగి ఉండాలి. మీ బలహీనతలను పక్కన పెట్టి, మీ బలాలను మరింత బలోపేతం చేసుకోడానికి కృషి చెయ్యాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా చేరుకోవాల్సిన లక్ష్యాన్ని విడిచి పెట్టకూడదు. అప్పుడే మీరు కోరుకున్న విజయ తీరాల్లో విహరిస్తారు.
‘తల బద్దలైనా సరే అల డీకొడుతుంది/ అడ్డు నిలిచిన పర్వ తమూలాన్ని, ఈకలూడిపోయినా సరే/ విహాయసానికి ఎదురీ దుతుంది పిడికెడు పక్షి, కడుపు చిట్లిపోతున్నా/ పచ్చని మొలక ను ప్రసవిస్తుంది విత్తు. ఆశలు విరిగినప్పుడల్లా వ్యక్తిత్వం విరిగి పోరాదు’ అంటారు జ్యానపీట్‌ అవార్డు గ్రహీత, విఖ్యాత రచ యిత డా. సి. నారాయణరెడ్డి తన ”మట్టి మనిషీ ఆకాశం” అనే పుస్తకంలో. తన తల పగిలిపోద్దని తెలిసి కూడా, తన దారికి అడ్డుగా నిలిచినా పర్వతాన్ని అల తన తలతో అదే పనిగా డీ కొడుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ పర్వతాన్ని తను గెలు స్తానన్న నమ్మకమే, ఆ అల సాగించే అలుపెరుగక పోరాటంలో దాగి ఉన్నఅంతరార్ధం. అలాగే తన తనువు రెండుగా చీలిపో తున్నా, ఒక కొత్త మొలకకి ప్రాణం పోస్తుంది విత్తనం. సరిగ్గా ఇలాగే ”విత్తనం చనిపోతూ.. పంటని వాగ్దానం చేస్తుంది” అంటారు శివసాగర్‌. అంటే ఒక ఓటమి, మరిన్ని విజయాలకి ప్రేరణగా నిలుస్తుంది అన్నదే ఈ కవిత ఫంక్తుల నుండి మనం తెలుసుకోవాల్సిన సందేశం. మొత్తానికి మొత్తంగా ప్రతీకూల సమయాల్లో కూడా ఒక సానుకూల దృక్ఫధాన్ని అలవర్చుకో వాలన్నదే ఈ కవితల్లోని అంత్ణసారం. మనం కూడా ఎంచుకున్న పోరాటంలో ఎన్ని ఓటములు ఎదురయిన గెలుపు గమ్యం పైపు పయనం ఆపకూడదు. ‘ఎన్నడు ఒప్పుకోద్దురా ఓటమి… ఎన్నడు ఒదులుకోవోద్దురా ఓరిమి.. నిరంతరం ప్రయత్నము న్నదా.. నిరాశాకే నిరాశ పుట్టదా..’ అంటారు ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఓటమితో కుంగిపోకూ డదు, గెలిచే వరకు ప్రయత్నాల్ని ఆపకూడదు. అవరోధాలు ఎన్ని ఎదురైనా గమ్యంపైపు పయనం ఆపని వాడే విజేతగా నిలు స్తాడు. అలాంటి వారికే కాలం సలాం చేస్తుంది. అలా కాలం సలాం చేసే విజేతలుగా మీరంతా నిలవాలని కోరుకుంటూ.. భవితను నిర్మించుకునే యుద్ధానికి సిద్దమవుతున్న వారందరికీ ఆల్‌ ది బెస్ట్‌, శుభాకంక్షలు.
డాక్టర్‌ కె. శశిధర్‌
పర్యావరణ నిపుణులు
94919 91918

Spread the love