కరెంట్‌ అఫైర్స్‌

పాకిస్తాన్‌ తాత్కాలిక ప్రధాని అన్వరుల్‌ హక్‌ కాకర్‌ : పాకిస్తాన్‌ 8వ తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వరుల్‌ హక్‌ కాకర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్‌ హౌస్‌లో కాకర్‌ చేత ప్రమాణం చేయించారు. రాబోయే సాధారణ ఎన్నికలను పర్యవేక్షించడం మరియు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక అడ్డంకులను పరిష్కరించడం వంటి బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఈయన బలూచిస్తాన్‌ అవామీ పార్టీ (బి.ఎ.పి.) కి చెందినవారు. పాకిస్తాన్‌ రాజ్యాంగం ప్రకారం జాతీయ అసెంబ్లీ పదవీకాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది. కానీ జాతీయ అసెంబ్లీ కాలం ముగియక ముందే రద్దు చేస్తే 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించవచ్చు.
ప్రపంచంలోనే అత్యంత నివాసమోగ్యమైన నగరంగా వియన్నా : ఎకనామిస్ట్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ యొక్క వార్షిక గ్లోబల్‌ లైవబిలిటీ ఇండెక్స్‌ ప్రకారం, వియన్నా ఎవరుసగా 4వ సారి ప్రపంచంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరంగా పేరు పొందింది. రాజకీయ స్థిరత్వం, నేరాల రేటు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, విద్య, సాంస్కృతిక సమర్పణలతో సహా వివిధ అంశాలతో ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాలను ఈ నివేదిక ర్యాంకు చేసింది. వియన్నా 2021 లో మహమ్మారి సమయంలో ర్యాంకింగ్స్‌లో పడిపోయినప్పటికీ తిరిగి పుంజుకుని 2022 లో ఆగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 2023 లోనూ ఆ స్థానాన్ని కొనసాగించింది. ఈ జాబితాలో డెన్మార్క్‌కు చెందిన కొపెన్‌ హగన్‌ 2 వ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్నీ వరుసగా 3,4 స్థానాల్లో నిలిచాయి. కెనడాకు చెందిన వాంకోవర్‌ 5వ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి 10 స్థానాల్లో కెనడా నుండి 3 నగరాలు, స్విట్జర్లాండ్‌ నుంచి 2, ఆసియా నుండి 2 నగరాలు చోటు దక్కించుకున్నాయి. సిరియాలోని డమాస్కస్‌, లిబియాలోని ట్రపోలి ర్యాంకింగ్‌లో అట్టడుగున నిలిచాయి. ఇండియా నుండి న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు 45 నుండి 50 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
రష్యన్‌ లూనా – 25 విఫలం : చంద్రునిపై పరిశోధన కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక లూనా – 25 ప్రయోగం విఫలం అయింది. సాంకేతిక సమస్య కారణంగా చంద్రునిపై క్రాష్‌ లాండింగ్‌ అయినట్లు రష్యన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌ కాస్మోస్‌ వెల్లడించింది. చంద్రుడిపై పరిశోధన నిమిత్తం ఆగస్టు 10న వోస్తోచ్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి రష్యా ప్రయోగించిన లూనా – 25 ఆగస్టు 19న సాంకేతిక సమస్య తలెత్తడంతో చంద్రునిపై కూలిపోయింది. ఈ నెల 21 న ఇది చంద్రునిపై దిగాల్సి వుంది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు ఈ ప్రయోగం రష్యా చేసింది. కానీ దురదృష్ట వశాత్తు ఈ ప్రయోగం విఫలమైంది.
జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఆగస్టు 23 : చంద్రయాన్‌ 3 చంద్రుడి పై దిగిన ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్రమోడి ఆగస్టు 26న ప్రకటించారు. చంద్రుడిపై ల్యాండర్‌ దిగిన ప్రదేశాన్ని ‘శివశక్తి’ అని, చంద్రయాన్‌ 2 తాకిన ప్రదేశాన్ని ‘తిరంగా పాయింట్‌’ గా పిలవనున్నట్టు ఆయన ప్రకటించారు. కొన్ని సంవత్సరాలలో భారత అంతరిక్ష పరిశ్రమ 8 బిలియన్‌ డాలర్ల నుండి 16 బిలియన్‌ డాలర్లుగా మారుతుందని నిపుణులు సూచించారని నరేంద్రమోడి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రతిష్టాత్మక జైవిక్‌ అవార్డు : రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు జైవిక్‌ ఇండియా అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్‌ కాంపిటిషన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ (ఐసిసిఒఏ) సంస్థ 2023 కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి జైవిక్‌ ఇండియా అవార్డు ప్రకటించింది. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో 51 అవార్డులను వెల్లడించగా ఇందులో రాష్ట్రానికి 3 అవార్డులు దక్కడం విశేషం. ప్రకృతి వ్యవసాయం ఉద్యమం 700 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో ప్రారంభమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు పొందింది. ఫలితంగా ఇప్పుడు ప్రకృతి సాగు 3,730 పంచాయితీలకు విస్తరించింది. 9.40 లక్షల ఎకరాలకు పైగా 8.5 లక్షల మంది రైతులు భాగస్వామ్యంతో గణనీయమైన అభివృద్ధి సాధించింది.
ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇగా స్వియాటక్‌ : మహిళల టెన్నిస్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ఇగా స్వియాటిక్‌ను ఇన్ఫోసిస్‌ కు గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది. డిజిటల్‌ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడం, ప్రపంచ వ్యాప్తంగా మహిళలను ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం. టెన్నిస్‌ దిగ్గజం రాపెల్‌ నాదెల్‌ కూడా ఈ గౌరవానికి సంతకం చేశారు.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love