Wednesday, September 2, 2026
E-PAPER
Homeబీజినెస్యూపీలోని పీఎన్‌బీలో నకిలీ నోట్లు

యూపీలోని పీఎన్‌బీలో నకిలీ నోట్లు

- Advertisement -

రూ.7.40 కోట్ల విలువ
నలుగురు సిబ్బంది సస్పెన్షన్‌
‌లక్నో :
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌‌బీ) డబ్బు నిల్వ కేంద్రంలో భారీ ఎత్తున నకిలీ కరెన్సీ వెలుగులోకి వచ్చింది. ఆర్‌‌బీఐ తరఫున పెద్ద మొత్తంలో కొత్త నోట్లను, నాణేలను భద్రపరిచే బ్యాంకు చెస్ట్‌లో తనిఖీలు నిర్వహించగా.. ఏకంగా రూ.7.40 కోట్ల విలువైన నకిలీ నోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగానూ.. బ్యాంకు వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. బ్యాంకు అధికారుల వివరాల ప్రకారం.. పిఎన్‌‌బి కరెన్సీ చెస్ట్ నుంచి ఆర్‌‌బీఐకి పంపిన నగదును పరిశీలించగా రూ.4.36 లక్షల కొరత ఉన్నట్లు తేలింది. ఈ చిన్న వ్యత్యాసంపై ఆరా తీయడానికి బ్యాంకు అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా విశాల్ కుమార్ అనే పార్ట్ టైమ్ హౌస్ కీపర్ నోట్ల కట్టల నుంచి నగదు తీస్తున్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కరెన్సీ చెస్ట్‌లో ప్రత్యేక ఆడిట్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెస్ట్‌లో భారీ స్థాయిలో రూ.7.40 కోట్ల నకిలీ నోట్లు ఉన్నట్లు ఆడిట్ బృందం నిర్ధారించింది. అయితే ఈ నకిలీ కరెన్సీని ఎలాంటి లావాదేవీలకు ఉపయోగించలేదని, ఖాతాదారులకు లేదా ఇతర శాఖలకు పంపిణీ చేయలేదని బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పీఎన్‌బీ యాజమాన్యం సీరియస్‌గా స్పందించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. వీరిలో డివిజనల్ ఆఫీస్ సీనియర్ మేనేజర్, నోడల్ ఆఫీసర్ రవి కుమార్, కరెన్సీ చెస్ట్ మేనేజర్లు సుశీల్ శర్మ, అమిత్ కుమార్‌లు ఉన్నారు. మరోవైపు నగదు కొరతకు కారణమైన హౌస్‌కీపర్ విశాల్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు, ప్రత్యేక విచారణ బృందం వేర్వేరుగా దర్యాప్తు చేపట్టాయి. కరెన్సీ చెస్ట్‌లోకి ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. రవాణా ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగింది అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. బ్యాంకు రికార్డులు, నోట్ల లెక్కింపు, ప్యాకింగ్, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని.. పూర్తి విచారణ తర్వాత బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ అభిషేక్ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -