ఫ్యామిలీ ప్యాక్‌…

Family Pack...– బీజేపీలో నారీ శక్తికి చోటేది..?
– వారసత్వ రాజకీయాలకు కమలం పార్టీ ప్రాధాన్యత..
– మెజారిటీ మహిళా అభ్యర్థులది కుటుంబ నేపథ్యమే
సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళల ఓట్లు రాబట్టుకోవటానికి మోడీ ప్రభుత్వం పదేండ్లుగా పట్టించుకోని మహిళా రిజర్వేషన్లను తెరపైకి తెచ్చింది. నారీశక్తి అంటూ పలు పథకాలకు హంగులు దిద్దింది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల విషయంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు కుటుంబపాలన చేస్తున్నాయని ప్రతిపక్షాలను విమర్శించే..బీజేపీ, మోడీ అండ్‌కో బరిలో దింపిన అభ్యర్థులను పరిశీలిస్తే..మోడీ వంశ రాజకీయాల జాబితా చాతాడంత ఉన్నదని స్పష్టమవుతోంది.
న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి వరకూ 417 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో కేవలం 68 మంది (16 శాతం) మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అందులో కూడా సగం మందికి పైగా అభ్యర్థులు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. బీజేపీ 2009 ఎన్నికల్లో 45 మంది, 2014లో 38 మంది, 2019 ఎన్నికల్లో 55 మంది మహిళా అభ్యర్థులను బరిలో నిలిపింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ పడుతున్న ప్రముఖ మహిళా నేతల్లో ప్రణీత్‌ కౌర్‌ (పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ భార్య), బన్సురీ స్వరాజ్‌ (సుష్మా స్వరాజ్‌ కుమార్తె), సీతా సొరేన్‌ (జేఎంఎం నేత శిబు సొరేన్‌ కోడలు), గీతా కోడా (జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య), జ్యోతి మీర్థా (మాజీ ఎంపీ నాథూరాం మీర్థా మనుమరాలు), గాయత్రి సిద్ధేశ్వర (కేంద్ర మాజీ మంత్రి జీఎం సిద్ధేశ్వర భార్య), నవనీత్‌ రాణా (మాజీ ఎమ్మెల్యే రవి రాణా భార్య), మాళవికా దేవి (మాజీ ఎంపీ అర్క కేసరి దేవ్‌ భార్య), కృతిసింగ్‌ దేవ్‌వర్మ (తిప్రా మోతా పార్టీ వ్యవస్థాపకుడు ప్రద్యోత్‌ కిషోర్‌ మాణిక్య దేవ్‌వర్మ సోదరి) ఉన్నారు.
తాను రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని సీతా సొరేన్‌ అంగీకరించారు. అయితే అది తన తప్పు కాదని చెప్పారు. నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్త ఎలా కష్టపడతారో తాను కూడా అంతే కష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కుమార్తె అన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఆరుగురు మహిళా అభ్యర్థులు బీజేపీ తరఫున పోటీకి దిగారు. ఎన్సీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సిట్టింగ్‌ ఎంపీ భారతి పవార్‌ దిన్దోరీలో పోటీ చేస్తున్నారు. ఆమె మామ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కుమారుడు కూడా శాసనసభ్యుడే. బీజేపీ ఎంపీ హీనా గవిట్‌ మూడోసారి విజయం కోసం నందుర్బన్‌ నుంచి రంగంలో దిగారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గిరిజన నేత విజరు గవిట్‌కు ఆమె కుమార్తె. దివంగత బీజేపీ నేత గోపీనాథ్‌ ముండే కుమార్తె పంకజ ముండే బీద్‌ లోక్‌సభ స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
సిట్టింగ్‌ ఎంపీ రక్షా ఖడ్సే మరోసారి రావర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె మామ ఏక్‌నాథ్‌ ఖడ్సే 2020లో బీజేపీని వీడి శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. జలగావ్‌లో సిట్టింగ్‌ ఎంపీ అన్మేష్‌ పాటిల్‌కు బీజేపీ టిక్కెట్‌ నిరాకరించింది. ఎమ్మెల్సీ స్మితా వాఫ్‌ును బరిలో దింపింది. ఆమె భర్త ఉదరు వాఫ్‌ు జలగావ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ నవనీత్‌ రాణా అమరావతి నుంచి పోటీకి దిగారు. ఇప్పటి వరకూ బీజేపీ తరఫున మధ్యప్రదేశ్‌ నుంచి ఆరుగురు మహిళా అభ్యర్థులు హిమాద్రి సింగ్‌ (షదాల్‌), సంధ్యారారు (భిండ్‌), లతా వాంఖేడే (సాగర్‌), అనితా చౌహాన్‌ (రత్లాం), భారతి పార్థి (బాగాఘాట్‌), సావిత్రి ఠాకూర్‌ (ధార్‌) పోటీలో ఉన్నారు. వీరిలో సావిత్రి ఠాకూర్‌ మినహా మిగిలిన వారందరూ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే.
If Modi comes again.. There is no democracyమాజీ రాజవంశీకులే…
రాజస్థాన్‌లో 2019 ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు మహిళా అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి వరకు ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇందూ దేవి జాదవ్‌ (ధోల్‌పూర్‌ కరౌలి), ప్రియాంక బాలన్‌ (శ్రీగంగానగర్‌), మంజూ శర్మ (జైపూర్‌), జ్యోతి మీర్థా (నాగౌర్‌), మహిమా విశ్వరాజ్‌ సింగ్‌ (రాజ్‌సమంద్‌) బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిలో మహిమా విశ్వరాజ్‌ సింగ్‌ రాజకుటుంబానికి చెందిన వారు. ప్రియాంక బాలన్‌ కుటుంబంలో మాత్రం ఎవరూ రాజకీయాలలో లేరు. మిగిలిన వారందరూ రాజకీయ కుటుంబాలకు చెందిన వారే.ఒడిషాలో ఇప్పటి వరకూ నలుగురు మహిళా అభ్యర్థులను బీజేపీ ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు పేరున్న రాజకీయ కుటుంబాలకు చెందిన వారే. తూర్పు ప్రాంతమైన జార్ఖండ్‌ నుంచి ముగ్గురు మహిళా అభ్యర్థులు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. వీరందరికీ రాజకీయ నేపథ్యం ఉంది. బీహార్‌ నుండి పోటీ చేసేందుకు బీజేపీ ఇప్పటి వరకూ మహిళా అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దాద్రా నగర్‌ హవేలీలో సిట్టింగ్‌ ఎంపీ కళాబెన్‌ దేల్కర్‌కే బీజేపీ మరోసారి టిక్కెట్‌ ఇచ్చింది. హర్యానాలోని అంబాలా నుంచి బీజేపీ తరఫున మహిళా అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి పోటీ చేస్తున్న రేఖా వర్మ, మేనకా గాంధీ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. కాగా రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలకే బీజేపీ టిక్కెట్లు ఇచ్చిందన్న వాదనను ఆ పార్టీ నేతలు తోసిపుచ్చారు. వీరిలో చాలా మంది తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వారేనని చెప్పుకొచ్చారు.

Spread the love