గణపతికి.. ఘన వీడ్కోలు

Ganesh– ప్రశాంతంగా నిమజ్జనం
– భారీ భద్రత, వార్‌ రూం నుంచి పర్యవేక్షణ
– హుస్సేన్‌సాగర్‌లో వేడుకగా నిమజ్జనోత్సవం
– వర్షంలోనూ సాగిన శోభాయాత్రలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరదారులన్నీ ట్యాంక్‌బండ్‌కు మళ్లాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో నగరం మారు మోగింది. డప్పుల చప్పుళ్లు, నృత్యాలు, పీకల మోతల మధ్య జై బోలో గణేష్‌ అంటూ కేరింతల మధ్య ట్యాంక్‌ బండ్‌ హౌరెత్తింది. వర్షంలోనూ వినాయక శోభయాత్రలు కొనసాగాయి. జనం ఆటలు, పాటలతో హుస్సేన్‌సాగర్‌ తీరంలో సందడి నెలకొంది. ఖైరతాబాద్‌ మహాగణపతికి ఘన వీడ్కోలు పలికారు. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు గణనాథుల నిమజ్జనం కొనసాగింది. చిన్న గణనాథులతోపాటు పెద్దపెద్ద గణనాథులు జనాన్ని ఆకర్షించాయి. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను చూసేందుకు జిల్లాల వారితోపాటు నగరమంతా ట్యాంక్‌బండ్‌కు పయనమైంది. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌తోపాటు వివిధ మార్గాల్లో శోభయాత్ర సందడిగా సాగింది. రహదారుల పొడవునా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద నీళ్లు, పులిహౌరాను అందించారు. మరికొన్ని చోట్ల భోజనాలు, పూరీలు, సమోసాలను పంచిపెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌డ కమిషనరేట్ల పరిధిలో 40వేల మందికిపైగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 25వేలకుపైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. వెంట వెంటనే క్రేన్లతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో అర్ధరాత్రి వరకు వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ ఏరియల్‌ వ్యూ
గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో గణేష్‌ శోభాయాత్ర, నిమజ్జనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు డీజీపీ అంజనీ కుమార్‌, పోలీస్‌ కమిషనర్‌ సీపీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌తో కలిసి ఏరియల్‌ వ్యూ ద్వారా నగరంలో గణేష్‌ విగ్రహాల శోభాయాత్ర, హుస్సేన్‌సాగర్‌ వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. అంతకుముందు మంత్రి తలసాని నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్రలో పాల్గొన్న అనంతరం చార్మినార్‌, మోజం జాహి మార్కెట్‌, ఆబిడ్స్‌, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ వద్ద శోభాయాత్రగా వస్తున్న విగ్రహాలకు స్వాగతం పలికారు. తదనంతరం హుస్సేన్‌సాగర్‌లో బోట్‌లో తిరిగి నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 90 వేల విగ్రహాలను ఏర్పాటు చేశారని, శుక్రవారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశముందని చెప్పారు.
వార్‌ రూం నుంచి పరిశీలన
గణేష్‌ నిమజ్జనాన్ని బంజారాహిల్స్‌లోని సీసీసీలోని (కమాండ్‌ కంట్రోల్‌ రూం) వార్‌ రూం నుంచి హౌంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌, సీపీ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ పరిశీలించారు. సిబ్బందికి కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు. అనంతరం హెలీక్యాప్టర్‌లో ఏరియల్‌ వ్యూవ్‌ దారా నగరంలో కొనసాగిన శోభయాత్రను పరిశీలించారు. జలమండలి ఏర్పాటు చేసిన తాగు నీటి శిబిరాలను ఎండీ దాన కిశోర్‌ తనిఖీ చేశారు. ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, పీపుల్స్‌ ప్లాజా పరిసరాల్లో ఉన్న శిబిరాలకు వెళ్లిన ఆయన అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. నీటి నాణ్యత, క్లోరిన్‌ పరీక్షల వివరాలు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.

7గంటలు సాగిన ఖైరతాబాద్‌ గణేషుడి శోభాయాత్ర
జనసంద్రమైన సాగర్‌ పరిసర ప్రాంతాలు..
ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం ముగిసింది. వేలాది మంది వెంట రాగా ఉదయం 6.30గంటలకు మండపం నుంచి దశ మహా విద్యాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌ క్రేన్‌ నెం.4 వద్ద నిమజ్జనం పూర్తి చేశారు. దాదాపు 7గంటలపాటు సాగిన శోభాయాత్రకు సందర్శకులు, రాజకీయ నాయకులు, ప్రముఖుల రాకతో హుస్సేన్‌సాగర్‌ ప్రాంగణం కిక్కిరిసింది. ఏడాదికో ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్న ఖైరతాబాద్‌ గణేష్‌ ఈసారి 63 అడుగులు, సిద్ధి, బుద్ధి సమేత గణపతిగా కనిపించారు. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ఖైరతాబాద్‌, టెలిఫోన్‌ భవన్‌, సెక్రటెరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్‌ బండ్‌ వద్దకు చేరుకుంది. ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.

Spread the love