Monday, April 27, 2026
E-PAPER
Homeఖమ్మంరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

– ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్. కె. నాగాంజలి, డాక్టర్. ఐ. కృష్ణ తేజ లు సోమవారం అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం అవసరమని అన్నారు.

ప్రత్యేకంగా సేంద్రీయ వ్యవసాయం, సిఫారసు చేసిన మేరకు ఎరువుల వినియోగం, పంట మార్పిడి, సాగునీటి పొదుపు వంటి అంశాలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. జై హేమంత్ కుమార్ మాట్లాడుతూ రైతులు ఆరు ముఖ్య వ్యవసాయ సూత్రాలపై అవగాహన పెంపొందించుకొని రాబోయే వానాకాల పంట సాగుకు ముందస్తుగా సిద్ధం కావాలని సూచించారు.

డా. నాగాంజలి సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను రైతులకు వివరించి, భూమి ఆరోగ్యం కాపాడుకోవాలంటే సహజ పద్ధతుల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. డాక్టర్. కృష్ణతేజ మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను ఎంపిక చేసుకొని సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. డాక్టర్. రాంప్రసాద్ భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూ, పంట సాగులో సుస్థిరత సాధించాలంటే నేల స్వభావానికి అనుగుణంగా ఎరువుల వినియోగం అవసరమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏడీఏ పి. రవికుమార్, ఆత్మ చైర్మన్ ఎస్. వీరభద్రరావు, ఎంపీడీవో అప్పారావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, తిరుమలకుంట సర్పంచ్, జిల్లా టెలికాం కమిటీ సభ్యులు పి. రామలక్ష్మయ్య, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్వప్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగు, బాపిరెడ్డి, ఉద్యాన విస్తరణాధికారి ఈశ్వర్, ఆయిల్ పామ్ ఆఫీసర్ యశస్వి, ఆయిల్ పామ్ మానిటరింగ్ ఆఫీసర్ శివప్రసాద్, శ్రీనివాస్, విస్తరణాధికారి రవీంద్ర, రెడ్డిగూడెం సర్పంచ్ యు. వెంకటరమణ, రెడ్డిగూడెం వైస్ ప్రెసిడెంట్ పి. శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే 240 మంది రైతు సోదర సోదరీమణులు, వ్యవసాయ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -