ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్స్‌ బకాయిలు చెల్లించాలి

– విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు
– రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థుల ఆందోళన
– పలుచోట్ల విద్యార్థుల అడ్డగింత, అరెస్టులు
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రంలో మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.5177 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్స్‌ బకాయిలు విడుదల చేయాలని, ఉపాధ్యాయ, అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బంగారు తెలంగాణ కావాలంటే.. ముందు విజ్ఞాన తెలంగాణ కావాలని.. విజ్ఞాన తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు. సోమవారం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పలు జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. తమ డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న డిగ్రీ, ఇంటర్‌ కాలేజీలకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని, తమ సమస్యలు వినేందుకు కలెక్టర్‌ రావాలని నినాదాలు చేశారు. జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.
రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో.. విద్యార్థులు కలెక్టర్‌ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విద్యార్థులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వెనక్కి తగ్గిన విద్యార్థులు పోలీసు సమక్షంలో అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాగరాజు మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి ఇలాఖాలో 15 ఏండ్ల కింద మంజూరైన కాలేజీలు నేటికీ అద్దె భవనాల్లో కొనసాగడం సిగ్గుచేటన్నారు. విద్యాశాఖ మంత్రి ప్రాంతంలో సమస్యలు ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలకు పరిష్కారించకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. వికారాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించగా, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
జనగామ జిల్లాలో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి దద్దరిల్లింది. నెహ్రూ పార్క్‌ నుంచి ఆర్టీసీ చౌరస్తా మీదుగా కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థులను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు ముళ్లకంచె వేయగా, నాయకులు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు కేఆర్‌ఎల్‌ మూర్తి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించి విద్యార్థుల చదువుకు ఆటంకాలు కలగకుండా చూడాలని, లేకుంటే.. చలో హైదరాబాద్‌ చేపడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాము, ఏవో రవీందర్‌, ఎస్సీ డెవలప్‌మెంట్‌ జిల్లా అధికారి కోరినలియస్‌కు వినతిపత్రం అందజేశారు. ములుగు కలెక్టర్‌ కార్యాలయం ముట్టడించారు.
ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు తోపులాట జరిగింది. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌కి వినతిపత్రం అందించారు. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ డీఈఓ, డీఐఈవో పోస్టులను భర్తీ చేయాలని, గురుకులాలు సంక్షేమ హాస్టల్లో కేజీబీవీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి, జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్‌, వారితో పాటు మరికొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పాత బస్టాండ్‌ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా మున్సిపాలిటీ వివేకానంద పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌కు ర్యాలీ చేరగా, పోలీసులు విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు.
నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమస్యలను పరిష్కరించమంటే విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేసులతో ఉద్యమాలను ఆపలేరని తెలిపారు. అందుకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని పిలుపునిచ్చారు. తక్షణమే అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అక్రమంగా అరెస్ట్‌ చేసి నాన్‌బెయిలబుల్‌ కేసులను నమోదు చేసి బెదిరింపులకు పాల్పడడం సరైంది కాదని తెలిపారు. ప్రభుత్వం రూ.5,177 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love