– టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ జనరల్‌బాడీ సమావేశంలో ఎస్ వీరయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నూతన ఎత్తుగడలతో కార్మికోద్యమం ముందుకు సాగాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య అన్నారు. టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) జనరల్ బాడీ సమావేశం శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్‌హాల్‌లో జరిగింది. దీనికాయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయనీ, వాటిని పరిష్కరించుకోవడానికి ఆ సంస్థ కార్మికులు కార్యోన్ముఖులై ఉండాలని చెప్పారు. దీనికోసం ఎస్‌డబ్ల్యూఎఫ్ ఎప్పటికప్పుడు కార్మికులను చైతన్యపరిచే కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫెడరేషన్ అధ్యక్షులు వీరాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తర్వాత ఏర్పడిన సమస్యలు, పరిష్కారాలపై చేసిన అధ్యయన వివరాలను తెలిపారు. ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మాట్లాడుతూ విలీన సందర్భంగా 27 సమస్యల్ని గుర్తించి, వాటి పరిష్కారాలు సూచిస్తూ విలీన కమిటీ చైర్మెన్, రవాణాశాఖ మంత్రి, టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్‌లకు వినతిపత్రాలు పంపామన్నారు. విలీన ప్రక్రియ పూర్తయ్యేవరకు కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలనీ, కార్మిక హక్కులకు విఘాతం కలిగే నిర్ణయాలను తిరస్కరిస్తూ, భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి ఆహూతులను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు.