Sunday, April 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాగర్‌ డ్యామ్‌ సమీపంలో చేపల వేట

సాగర్‌ డ్యామ్‌ సమీపంలో చేపల వేట

- Advertisement -

భద్రతను గాలికి వదిలిన సీఆర్‌పీఎఫ్‌
నవతెలంగాణ- నాగార్జునసాగర్‌

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ డ్యామ్‌కు అతి సమీపంలో చేపల వేట కొనసాగుతోంది. అడ్డుకట్ట వేయాల్సిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు తాము సైతం అన్నట్టుగా చేపల వేటలో ఆసక్తి చూపుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాగార్జునసాగర్‌ డ్యాం సమీపంలో చేపల వేట పూర్తిగా నిషేధం ఉంది. అయినా డ్యామ్‌ గేట్లకు అతి దగ్గరగా పుట్టీలలో చేపల వేట జరుగుతోంది. ఈ విషయంలో డ్యామ్‌ భద్రత విధులు నిర్వర్తించే కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, ఇరిగేషన్‌ అధికారులు సైతం నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం సాగర్‌ ప్రధాన డ్యామ్‌ భద్రత చేపట్టిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కూడా చేపల వేట కొనసాగిస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ భద్రత విధులు నిర్వర్తించేది. 2023లో శాసనసభ ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగడంతో సాగర్‌ డ్యామ్‌ భద్రతను ఎస్‌పీఎఫ్‌ బలగాలతోపాటు అదనంగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలకు కేంద్రం అప్పజెప్పింది. ఆ తర్వాత సాగర్‌ ప్రధాన డ్యామ్‌పై 13వ గేటు వరకు తెలంగాణ వైపున కేంద్ర బలగాలు, 13 గేటు నుంచి కుడి వైపు ఎర్త్‌ డ్యాం చివరి వరకు ఆంధ్రా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు భద్రతా విధులను నిర్వర్తించాయి. గతేడాది సాగర్‌ డ్యామ్‌పై తెలంగాణ వైపు ఉన్న కేంద్ర బలగాలను ఉపసంహరించుకోగా.. వైజాగ్‌ చెందిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ప్రాజెక్టు భద్రతను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నాయి. దీంతో తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల నియంత్రణ సాగర్‌ ప్రాజెక్టుపై లేకపోవడంతో డ్యామ్‌ భద్రతపై సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని రిటైర్డ్‌ ఇంజినీర్లు అంటున్నారు. ఇటీవల డ్యామ్‌ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి ఉన్నతాధికారులు సాగర్‌ డ్యామ్‌ను పరిశీలించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినా కేంద్ర బలగాల తీరులో మార్పు రాలేదు. దాంతో డ్యామ్‌ భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

నిషేధం విషయంలో మాకేమీ ఉత్తర్వులు లేవు : సీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ నాయుడు
సాగర్‌ డ్యామ్‌ సమీపంలో చేపల వేట నిషేధం విషయంలో మాకు ఎటువంటి ఉత్తర్వులూ లేవు. మా బలగాలు సాగర్‌ డ్యామ్‌పై చేపల వేట చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అటువంటిది ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -