దరఖాస్తుల వెల్లువ

Flood of applications– మొదటిరోజే కేంద్రాల్లో భారీగా లబ్దిదారులు
– ప్రజల సందేహాలు.. అధికారుల నివృత్తి
– అక్కడక్కడా సమస్యలు
– కిక్కిరిసిన ‘ఆధార్‌’ కేంద్రాలు
– దరఖాస్తు ఫారంల కొరత
– మీసేవ, జిరాక్స్‌ సెంటర్లకు గిరాకీ
నవతెలంగాణ – విలేకరులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా చేపట్టిన ‘అభయహస్తం’ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. జిల్లాల వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని డివిజన్లలో కార్పొరేటర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరు గ్యారంటీల కోసం అర్హులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మీ, గ్యాస్‌ పథకాలకు ఉదయం నుంచే బారులు తీరారు. ఎక్కువ మంది మహిళల నుంచి స్పందన లభించింది. లబ్దిదారులకు కొన్నిచోట్ల దరఖాస్తు చేసుకోవడంలో సందేహాలు రాగా అధికారులు నివృత్తి చేశారు. దరఖాస్తు కేంద్రాలను ప్రత్యేక అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు సందర్శించి ప్రక్రియను పర్యవేక్షించారు. కాగా, దరఖాస్తుల కొరత చాలా తీవ్రంగా కనబడింది. కొన్ని చోట్ల అధికారులు దరఖాస్తు ఫారాలను జిరాక్స్‌ కూడా తీసుకోవడంతో కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యింది. ఈ దరఖాస్తు ఫారాలను పూరించి ఆధార్‌ కార్డులను తప్పకుండా జత చేయాల్సి ఉన్నందున ఆధార్‌ కార్డుల్లో తప్పులు, చేర్పులు, మార్పులు చేయించుకోవడానికి ప్రజలు ఆధార్‌ కేంద్రాలకు బారులుతీరారు. దరఖాస్తు ఫారంలో కొత్త రేషన్‌ కార్డుల ప్రస్తావనే లేకపోవడంతో ప్రజలు అసంతృపికత వ్యక్తంచేశారు. ఈ విషయమై అధికారులను ఆరా తీసినా.. వారు సైతం తెలవదన్నారు. అభయహస్తం దరఖాస్తులు తీసుకోవడానికి వెళ్లిన వారికి సంబంధిత బాధ్యులు ఎక్కడ ఆధార్‌కార్డు ఉంటే అక్కడే దరఖాస్తు చేసుకోవాలని చెబుతుండడంతో నగరవాసులు విస్తుపోయారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ వార్డులో ఏర్పాటు చేసిన దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 54 గ్రామపంచాయతీల్లో నిర్వహించిన కార్యక్రమంలో 17,001 దరఖాస్తులు, 80 మున్సిపల్‌ వార్డుల్లో 4918 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 21,914 దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 112 గ్రామపంచాయతీల్లో, నాలుగు మున్సిపల్‌ కేంద్రాల పరిధిలోని 146 సెంటర్‌లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ఫారాలు నింపేందుకు అవగాహన లేక పలువురు ఇబ్బందులు పడ్డారు. వాటిని నింపేందుకు అంగన్‌వాడీలను, ఆశాలను కేటాయిస్తున్నట్టు అధికారులు తెలిపినా.. పలు సెంటర్‌లలో అధికారుల కొరతతో.. వారే దరఖాస్తులు స్వీకరించాల్సి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజాపాలన దరఖాస్తులు మొదటి రోజు 83 గ్రామ పంచాయతీలు, 23 మున్సిపాలిటీ వార్డులో గ్రామ సభల ద్వారా 52880 కుటుంబాల నుంచి 25087 దరఖాస్తులు స్వీకరించినట్టు కలెక్టర్‌ ప్రియాంక అలా తెలిపారు. ఖమ్మం జిల్లాలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఖమ్మం నగరం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో పర్యటించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలంలోని మారుమూల తండాల్లో అధికారులు ఉదయమే ఆయా గ్రామాలకు చేరుకొని.. 6 గ్యారంటీలు కావాలంటే ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులను పూర్తి చేసి ఇవ్వాలని గ్రామస్తులకు తెలిపారు. రెండు రోజుల ముందే దరఖాస్తులు ఇస్తే వాటికి కావలసిన ధ్రువపత్రాలతో పాటు ఫొటో కూడా జత చేసి ఇచ్చేవారమని ఇదే రోజు వచ్చి దరఖాస్తులను నింపి ఇవ్వాలంటే ఎట్లా సాధ్యమవుతుందని లబ్దిదారులు అధికారులను నిలదీశారు. దాంతో పూర్తి చేసిన దరఖాస్తులను 6 తేదీ లోపు అందజేయాలని అధికారులు తెలిపారు. నల్లగొండ పట్టణంలోని 20వ వార్డు, పెద్ద బండ పరిధి మిర్యాలగూడ రోడ్డులోని 5వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పాత, కొత్త గ్రూపుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
హైదరాబాద్‌లో..
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 వార్డుల్లో ఏర్పాటుచేసిన 600 కేంద్రాల్లో.. 1.98 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల పరిధిలో సుమారు 108 సెంటర్లలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అభయ హస్తం దరఖాస్తులు 28,612 రాగ సాధారణ దరఖాస్తులు 3431 వచ్చాయి. మొత్తం 32043 వచ్చినట్టు ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ దత్తాత్రేయ దొంత్రే తెలిపారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 4,427 దరఖాస్తులు రాగా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 2677 దరఖాస్తులు వచ్చాయి. ఇక రంగారెడ్డి జిల్లా హాయత్‌ నగర్‌ సర్కిల్‌లో 4 డివిజన్లు ఉండగా మొత్తం ప్రజావాణి దరఖాస్తులు 5771 రాగా అదనపు దరఖాస్తులు 901 వచ్చాయి.
దరఖాస్తు ఫారాలకు యమ గిరాకీ
అభయహస్తం దరఖాస్తు ఫారాలు సరిపడా అందజేయడంలో అధికారులు విఫలమవడంతో జిరాక్స్‌, మీసేవా కేంద్రాలకు గిరాకీ పెరింగింది. ఇక్కడ రూ.50 నుంచి రూ.100లకు విక్రయిస్తున్నారు. ఇదిలావుంటే జిరాక్స్‌ సెంటర్లలో తీసుకున్న దరఖాస్తులు చెల్లుబాటు అవుతాయా.. కావా.. అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రిజ్వాన్‌ భాషా స్పష్టత నిచ్చారు. జిరాక్స్‌ సెంటర్‌లో విక్రయించే దరఖాస్తులను సైతం స్వీకరిస్తామన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో ప్రజలందరికీ దరఖాస్తు ఫారంలో అందజేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిసింది. బాబుల్‌రెడ్డినగర్‌, లక్ష్మీ కూడా, హైదర్‌గూడా, మార్కండేయ నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, పద్మశాలిపురం, బుద్వేల్‌, అత్తాపూర్‌ ప్రాంతాల్లో దరఖాస్తుల కొరత చాలా తీవ్రంగా కనబడింది. హైదర్‌గూడ సెంటర్‌ వద్ద ఉదయం నుంచి దరఖాస్తు ఫారం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ లైన్‌లో ఉన్నా అక్కడ ఫారాలు రాలేవు. ఒకరి వద్దనున్న దరఖాస్తు ఫారాలను తీసుకునే క్రమంలో చిరిగిపోయాయి. దాంతో అధికారులు, స్థానికులకు వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తు ఫారాలు రూ.30 నుంచి రూ.50ల వరకు అమ్ముతున్నారని స్థానికులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ పలు చోట్ల ఫారాల కొరత ఏర్పడింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌, రణదివెనగర్‌ కాలనీల్లో ప్రజాపాలన సెంటర్‌కు దాదాపు 200 మంది లబ్దిదారులు రాగా కేవలం 50 దరఖాస్తు ఫారాలను మాత్రమే పంపిణీ చేశారు. సరిపోక ఒక్కో ఫారాన్ని రూ.10 నుంచి రూ.20 చెల్లించి ప్రజలు కొనుగోలు చేశారు.
జత చేయాల్సిన పత్రాల్లో గందరగోళం
దరఖాస్తుకు ఆధార్‌, రేషన్‌ కార్డు మాత్రమే జతపరిచాల్సి ఉండగా అవగాహన లేకపోవడంతో ఇతర కరెంట్‌ బిల్లు, గ్యాస్‌ బుక్‌, బ్యాంకు అకౌంట్‌, కుల ధ్రువీకరణ తదితర పత్రాలు జిరాక్స్‌ తీయించి జత చేశారు. జిరాక్స్‌ సెంటర్లలో ఇష్టారీతిన డబ్బులు వసూలు చేశారని పలువురు లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేయడం కన్పించింది. ఉదయం 7గంటల నుండే ఆశాలు, అంగన్వాడీలు, మెప్మా తదితర సిబ్బంది విధుల్లో ఉన్నారు. వరంగల్‌ జిల్లా 49వ డివిజన్‌లో ‘ప్రజాపాలన’ కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా, ఈ డివిజన్‌కు సంబంధించిన కేంద్రాన్ని 59వ డివిజన్‌లోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఏర్పాటు చేయడంపై కార్పొరేటర్‌ మానస రాంప్రసాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు.
సొంత ఊళ్లోనే దరఖాస్తు చేయాల్నా..?
పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం సొంత గ్రామాలను వదిలి నగరాలకు వలస వచ్చిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, కాజీపేట తదితర నగరాల్లో అద్దెకుంటున్న వారి ఆధార్‌ కార్డులు సొంత గ్రామాల్లో ఉన్నాయి. కానీ రేషన్‌ మాత్రం నగరంలోనే తీసుకుంటున్నారు. అభయహస్తం దరఖాస్తుల్లో ఆధార్‌కార్డులు ఎక్కడుంటే అక్కడే తీసుకోమని చెబుతుండటంతో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. పల్లెల నుండి వచ్చి నగరాల్లో అద్దెకుంటున్న వారికి గృహజ్యోతి పథకం కింద లబ్ది పొందాలంటే ఎలా సాధ్యం అని అద్దె ఇండ్లలో ఉంటున్న వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love