వరద రాజకీయం

Flood politics– హస్తం విమర్శలు… గులాబీ ఎదురు దాడి
– మాపై బలప్రయోగం చేస్తారా? : శ్రీధర్‌బాబు
– మాట్లాడుతుంటే అడ్డుకోవడమేంటి? : భట్టి

– రుణమాఫీ ప్రకటించగానే కాంగ్రెస్‌కు ఫ్యూజులెగిరిపోయాయి : శాసనసభలో మంత్రి కేటీఆర్‌
శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటిదాకా బయట పేలిన మాటల తూటాలు శుక్రవారం అసెంబ్లీలోనూ ప్రతిధ్వనించాయి. వరదలను నివారించటంలో, బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించగా… వరదల పేరిట బురద రాజకీయం చేయొద్దంటూ అధికార బీఆర్‌ఎస్‌ హితవు పలికింది. అకాల వర్షాలు, వరదలపై లఘు చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుపై మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌పై పై చేయి సాధించేందుకు ఎదురుదాడే వ్యూహంగా వారు వ్యవహరించారు. మరోవైపు జీరో అవర్‌లో మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్‌ సభ్యుడు జగ్గారెడ్డి తదితరులనుద్దేశించి సెటైర్లు విసిరారు. ప్రశ్నోత్తరాలు, సంతాప ప్రతిపాదనలు, జీరో అవర్‌, లఘు చర్చలు… వెరసి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభా కార్యక్రమాలు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా (12 గంటలపాటు) కొనసాగటం గమనార్హం. శాసనమండలిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆయనతోపాటు కాంగ్రెస్‌ సభ్యుడు టి.జీవన్‌రెడ్డి… విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావటం లేదనే విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. అయితే విమర్శలు చేయటం కాకుండా ఎక్కడెక్కడ ఏయే కాలేజీల్లో అవి రాలేదో చెప్పాలంటూ బీఆర్‌ఎస్‌ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి వారిని ఎదురు ప్రశ్నిచటం గమనార్హం.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రాష్ట్రంలో ఏర్పడిన అతివృష్టి వల్ల సంభవించిన పరిణామాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు’ అంశంపై చర్చ సందర్భంగా శాసనసభ శుక్రవారం హాట్‌హాట్‌గా నడిచింది. మంత్రులు, కాంగ్రెస్‌ సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీధర్‌బాబుపై మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి ఎదురుదాడికి దిగారు. దీంతో ఆ పార్టీ పక్షనేత భట్టివిక్రమార్క వారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలపై బీఆర్‌ఎస్‌ సభ్యులు గండ్రవెంకటరమణరెడ్డి చర్చను ప్రారంభించారు. భారీ వర్షాలు, వరదలతో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద ప్రాంతాలను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉట్టిచేతులతో వచ్చారని విమర్శించారు. పైసా కూడా కేటాయిస్తామని ప్రకటించకుండా వెళ్లిపోయిండని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500కోట్లను గ్రీన్‌ ఛానెల్‌ పెట్టి కలెక్టర్ల ద్వారా నిధులను ఖర్చుచేయాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ సభ్యులు దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడారు. వరదల కారణంగా 40వేల కుటుంబాలు నష్టపోయాయని, 15లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. 50మంది వరకు మరణించినట్టు సమాచారమని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మూడువేల ఇండ్ల వరకు కూలిపోయాయని చెప్పారు. పత్రికల్లో వచ్చిన సమాచారం మేరకు 15లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని, ఎకరాకు రూ.10వేల చొప్పున రూ.15వేల కోట్లు అవుతుందని అంచనా అని వివరించారు.
రైతు రాబంధులు మీరు
దీంతో శ్రీధర్‌బాబుపై మంత్రి కేటీఆర్‌ ఎదురుదాడికి దిగారు. ‘శ్రీధర్‌బాబు సంస్కార్‌వంతుడు…మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.అయినా అన్ని గాలి మాటలు మాట్లాతుండు. ప్రభుత్వమే పంట నష్టం అంచనా వేయలేదు…కాంగ్రెస్‌ అంచనా వేసింది. కేసీఆర్‌ రుణమాఫీ ప్రకటన చేయగానే కాంగ్రెస్‌ నేతల ఫీజులెగిరిపోయాయి. కాంగ్రెస్‌ పాలనలో రైతులను రాబంధుల్లాగా పీల్చుకుతిని మాకు సుద్దులు చెబుతారా?24గంటల కరెంట్‌ వద్దు..3గంటలే చాలంటున్నారు. రైతు బంధు, రైతు బీమా వద్దంటున్నారు. మీరు రైతుల పక్షాన వకాల్తా పుచ్చుకుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? రైతుల ఖాతాల్లో రూ.72వేలకోట్లు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. మళ్లీ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘సభ్యులు మాట్లాడేదాక ఓపిక ఉండాలి. మీరు చెబితే వినే ఓపిక మాకుంది. బలం ఉందని మంత్రి బలప్రయోగం చేస్తే ఊరుకోవాలా? నేను, సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించి చెబుతున్నా’ అని తెలిపారు. వెంటనే కలగజేసుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్‌బాబు తప్పుడు లెక్కలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రశాంత్‌రెడ్డిది ముగియకముందే మంత్రి కేటీఆర్‌ అందుకున్నారు. ‘కాంగ్రెస్‌కు చిన్న, సన్నకారు రైతులపై ప్రేమ లేదు. ఓకాయనేమో వ్యవసాయమే దండగా ఉన్నారు. ఇంకోకాయనేమో 24గంటల ఉచిత కరెంట్‌ దండగా అన్నారు. రైతులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే మాట్లాడాలి’ అని డిమాండ్‌ చేశారు. దీనికి శ్రీధర్‌బాబు సవాల్‌ చేశారు. కరెంట్‌పై చర్చపెట్టాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘రైతులకు 3 గంటల చాలని రేవంత్‌ అనలేదని శ్రీధర్‌బాబు అంటున్నారు. అనుమతిస్తే వీడియో ప్రదర్శిస్తాం. ఉపద్రవం వచ్చింది..నష్టం వాటిల్లింది. దీనికి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. దిక్కుమాలిన లెక్కలతో ప్రజలను గందరగోళం చేసే ప్రయత్నం మానుకోవాలి’ అన్నారు. మంత్రుల దాడిని భట్లి విక్రమార్క ఖండించారు. సభ్యుడు మాట్లాడుతుంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.
అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 2020 వరదల సందర్భంగా ప్రభుత్వం రూ.450కోట్లు కేటాయిస్తే రూ.150కోట్లు మాత్రమే ఖర్చుచేశామని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, ఈసారి రూ.500కోట్లకు ఎంత ఖర్చుచేస్తారో చెప్పాలన్నారు. ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యామ్‌లు శాస్త్రీయబద్ధంగా లేవని, ఫలితంగా పొలాల్లో మూడు ఫీట్ల వరకు ఇసుకమేటలు పేరుకుపోయాయని, వాటిని తొలగించడానికి ఎకరాకు రూ.50వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు. చెక్‌డ్యామ్‌లను ఒకసారి పరిశీలించాలని సూచించారు.
మీ పాలనలో లంచాలు…పైరవీలు
మైక్‌ అందుకున్న మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ‘రైతులకు మేలు జరుగుతుంటే కాంగ్రెస్‌ జీర్ణించుకోవడంలేదు. టీపీసీసీ చీఫ్‌ మాట్లాడుతూ 24గంటల ఉచిత కరెంట్‌ వద్దంటారు. ధరణిని రద్దు చేస్తామంటారు. శ్రీధర్‌బాబు చెక్‌డ్యామ్‌లను వద్దంటున్నారు. శ్రీధర్‌బాబు చెక్‌డ్యామ్‌లను వద్దంటారనినేనెప్పుడూ ఊహించలే. మా పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. ధరణితో ఆన్‌లైన్‌లో రైతులే నిమిషాల్లో పనులు చేసుకుంటున్నారు. రైతు మరణిస్తే వారం తిరగకముందే రైతు బీమా పేరుతో రూ.5లక్షల వస్తున్నాయి. రైతు బంధు వస్తున్నది. మీ పాలనలో లంచాలు, పైరవీకారులదే రాజ్యం. చెక్‌డ్యామ్‌లు వద్దని ఎలా అంటావు. వెంటనే ఆయన మాటలను ఉపసంహరించుకోవాలి’ అని విమర్శించారు.
అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ చెక్‌డ్యామ్‌ల నిర్మాణం హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చెక్‌డ్యామ్‌లు కట్టింది కానీ కరకట్టలను నిర్మించలేదన్నారు. భద్రాచలం కట్టకట్ట నిర్మానానికి వెయ్యి కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు తప్ప నిధులివ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వమేమో నిధులిస్తున్నామని చెబుతుందని, రాష్ట్ర ప్రభుత్వమేమో ఇస్తాలేదని చెబుతుందని తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.900కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని, ఇస్తే ఈ నిధులను ఎక్కడ ఖర్చుచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన క్షేత్రస్థాయిలో నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మోరంచపల్లిలో 69చెరువుల తెగిపోయాయని, ఇదంతా మానవ తప్పిదమేనని అన్నారు. ముంపు ప్రాంతాల్లోని బాధితులకు డబుల్‌బెడ్‌ ఇల్లు, రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Spread the love