పరువునష్టం కేసులో రాహుల్‌కు ఊరట

Relief for Rahul in defamation case– హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
– నన్ను ఎవరూ ఆపలేరు : కాంగ్రెస్‌ నేత
ప్రియాంకా గాంధీ హర్షం
న్యాయస్థానం స్టే ఇవ్వడంపై ప్రియాంకా గాంధీ వాద్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు చెప్పిన ఓ సూక్తిని ట్వీట్‌ చేశారు. ‘సూర్యుడు.. చంద్రుడు.. సత్యం.. ఈ మూడు ఎంతో కాలం దాగి ఉండవు. న్యాయమైన తీర్పు ఇచ్చినందుకు గౌరవ సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు. సత్యమేవ జయతే’ అని పేర్కొన్నారు.
న్యాయమే గెలిచింది : స్టాలిన్‌
‘సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. న్యాయమే గెలిచింది. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింతగా పెంచింది’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.
సోమవారం నుంచి పార్లమెంటుకు?
రాహుల్‌ గాంధీ సోమవారం నుంచి పార్లమెంటుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్టు, ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనను జారీ చేయవలసి ఉంటుంది.
న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి భారీ ఊరట లభించింది. ఆయనను దోషిగా పేర్కొని, రెండేండ్లు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యలకు గాను క్రిమినల్‌ పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూ ర్తులు జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ పిఎస్‌ నరసింహ, జస్టిస్‌ పివి సంజరు కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ‘పరువు నష్టం కేసు తీవ్రమైనది కాదు.. బెయిల్‌ ఇచ్చే కేసు. ఈ అతి శిక్ష వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది రాహుల్‌ గాంధీ హక్కునే కాకుండా, ఆయన లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్‌ నియోజకవర్గ ఓటర్ల హక్కులపై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అందరూ ఆశిస్తారు. ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావన్న విషయంలో సందేహమే లేదు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఈ అంశాలన్నీ మేం పరిగణనలోకి తీసుకుంటున్నాం. దోషిగా నిర్ధారించే ట్రయల్‌ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నాం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.రాహుల్‌ తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. పరువు నష్టం దావా వేసిన, గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ అసలు ఇంటిపేరు ‘మోడీ’ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తరువాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్‌ గాంధీ నేరస్థుడు కాదనీ, బీజేపీ కార్యకర్తలు గతంలోనూ ఆయనపై అనేక కేసులు వేసినప్పటికీ.. ఏ కేసులోనూ శిక్ష పడలేదని సింఘ్వీ వాదించారు. పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ.. రాహుల్‌ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమని తెలిపారు. పూర్ణేష్‌ మోడీ తరపున సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తూ మోడీ ఇంటిపేరుతో అందరి పరువు తీయడమే రాహుల్‌ గాందీ ఉద్దేశమన్నారు. దీనికి జస్టిస్‌ గవారు స్పందిస్తూ రోజుకు 10-15 సభల్లో ప్రసంగించిన తరువాత, ఎంతమంది రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు గుర్తుంటాయని ప్రశ్నించారు.
2019లో కర్నాటకలోని కోలార్‌ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నీరవ్‌ మోడీ, లలిత్‌ మోడీ వంటి పరారీలో ఉన్న వ్యక్తులతో ముడిపెట్టి దొంగలందరి ఇంటి పేరు మోడీ ఎలా అవుతుందో అంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ సూరత్‌ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. మార్చి 23న సూరత్‌ కోర్టు జడ్జి హదీరాష్‌ వర్మ 168 పేజీల సుదీర్ఘ తీర్పులో రాహుల్‌ గాంధీని దోషిగా పేర్కొంటూ ఆయనకు రెండేండ్లు జైలు శిక్ష విధించారు. రెండేండ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం రద్దయింది. తన నేరారోపణను నిలిపివేయాలని కోరుతూ గాంధీ చేసిన పిటిషన్‌ను సూరత్‌లోని సెషన్స్‌ కోర్టు ఏప్రిల్‌ 20న తోసిపుచ్చింది. అయితే సూరత్‌ కోర్టు తీర్పును రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. అక్కడ కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు స్టే విధించింది.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. : రాహుల్‌గాంధీ
ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎలాంటి పరిణామాలు ఎదురైనా తనను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ”ఏది జరిగినా నా కర్తవ్యం మాత్రం ఒకేలా ఉంటుంది. దేశ సిద్ధాంతాలు, ప్రజల ప్రయోజనాలను రక్షించడమే నా బాధ్యత” అని రాహుల్‌ పేర్కొన్నారు. దేశ ఆలోచనను రక్షించడం తన కర్తవ్యమని అన్నారు.
రాహుల్‌ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి : అధిర్‌ రంజన్‌ చౌదరి
రాహుల్‌ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి కోరారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం అవిశ్వాస తీర్మానంపై గాంధీ మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని చౌదరి తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి చిదంబరం కోరారు. సుప్రీంకోర్టులో ఉపశమనం లభించడంతో ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ హర్షం వ్యక్తం చేసింది. ”వస్తున్నా.. ప్రశ్నలు కొనసాగుతాయి” అంటూ రాహుల్‌ గాంధీ ఫొటోతో ఓ ట్వీట్‌ చేసింది.

Spread the love