విద్వేష విషం చిమ్మడంలోనే కాదు.. ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపులోనూ తనకెవరూ సాటిరారని నరేంద్రమోడీ సర్కారు నిరూపించుకుంటోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ వచ్చిన కమలం పార్టీ ప్రభుత్వం హోం శాఖ కనుసన్నల్లో నడిచే ఢిల్లీ పోలీసులను ఇప్పుడు ప్రయోగిస్తోంది. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై ఫేక్ వీడియో పోస్ట్ చేశారంటూ ఆ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆగమేఘాల మీద తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ హుకుం జారీచేసి వెళ్లారు.
అయోధ్య రామ్‌లల్లా ఓట్లు రాల్చ లేదనీ, వికసిత భారత్ కట్టుకథయేనని ప్రజలు గుర్తు పట్టేశారు. మొదటిదశ ఎన్నికల్లో అడుగుజారిందని అర్థమయ్యాక 2002 గుజరాత్ మారణకాండకు పురిగొల్పిన భాషను ప్రధాని మోడీ తన అంబుల పొదిలోంచి బయటకు తీశారు. మత విద్వేష వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు పెంచేపని చేస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకం గా విషం చిమ్ముతున్నారు. అది చాలదన్నట్టు 400 సీట్లిస్తే రాజ్యాంగం మార్చేస్తామని తమ అంతే వాసుల రణన్నినాదాలు ప్రతిపక్షాలు సరిగ్గా వాసన పట్టాయి. మనరాష్ట్రంలో ప్రతిపక్షాలు మన ముఖ్యమంత్రి సైతం తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రచారం కూడా ప్రజలను ఆకట్టుకోవట్లేదు సరికదా రిజర్వేషన్లు పొందే తరగతుల వారు ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రజలను ఏమార్చడానికి ఈ నోటీసుల తతంగాన్ని ముందుకు తెచ్చారన్నది నిర్వివాదాంశం.
అసలు రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ వైఖరేంటి? దాని వ్యవస్థాపకులేమన్నారు? బీజేపీ నేతలు ఇన్నాళ్లూ ఏం మాట్లాడారు? ఈ ప్రశ్నలకు వారెవ్వరూ సమాధానాలివ్వరు. ఇస్తే వారి బండారం బయటపడుతుంది. ”ఇప్పుడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అవసరం లేదు. ఎందుకంటే ఏ కులం కూడా వెనుకబడి లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పదేండ్లే కొనసాగించాలి. ఆ తరువాత కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు రద్దు చేయాలి” అని ది హిందూ పత్రికతో ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతిక వేత్త ఎంజి వైద్య 2015లోనే కుండబద్దలు కొట్టారు. ఇక ప్రస్తుత ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించాలని, ఏ కేటగిరీకి ఎంతకాలం అవసరమో నిర్ణయించాలని 2015 లోనూ, రిజర్వేషన్ల అనుకూలురు, వ్యతిరేకుల మధ్య సామరస్య వాతావరణంలో చర్చలు జరగాలని 2019లోనూ సెలవిచ్చారు. పరివార్ మూల పురుషుడు హెడ్గేవార్ మొదలు అందరిదీ ఇదే మాట. ఇప్పుడు కొత్తగా ఏం చెబుతారు?
పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తాను ప్రజలకు చేసిందేమిటో చెప్పుకుని ఓట్లడగటం సర్వ సాధారణం. మోడీ సారధ్యంలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, నల్ల చట్టాలు, రైతుల ఆందోళనలు ఉపసంహరణ.., కరోనా కాలంలో శవాల కుప్పలు, పళ్లాల మోతలు.. పెట్రో, గ్యాస్ ధరల బాదుడు, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇత్యాది ఘనకార్యాలను ఏమని చెప్పుకోగలరు? ఇక ప్రపంచ సూచీలన్నింటా పాతాళమేనాయె! పేదల్ని నిరుపేదలుగా దిగజార్చి కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు కట్టబెట్టడమే మోడీ నెరవేర్చిన గ్యారెంటీ! జీఎస్టీ పేరుతో రాష్ట్రాల వనరులన్నీ ఊడ్చేసినా, పన్ను కేటాయింపులను తొక్కిపెట్టినా, రుణ పరిమితిని తగ్గించేసినా కేరళ సహా అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలకన్నా మెరుగ్గా పాలన సాగిస్తున్నాయి.
కేంద్రం అన్యాయంపై కేరళ ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన నిరసన ప్రతిపక్షాల ఐక్య గొంతును వినిపించింది. తొలుత జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, ఆ తరువాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లను అరెస్టు చేయించిన కేంద్రం కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెపై ఈడి ద్వారా కేసు పెట్టడం, పలు రాష్ట్రాల్లో దాడులు చేయించడం తదితర ఎత్తులన్నీ ముగిసిపోగా, తాజాగా రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులతో నోటీసులిప్పించింది. ఆయన నోటికి తాళం వేయాలని బహుశా కాషాయ నేతల పేరాశ కావచ్చు. ఇప్పటికే సీఎస్‌డీఎస్ -లోక్‌నీతి సర్వే తేల్చినట్టు ఆర్థికాంశాలే రేపటి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఇక మిగిలింది నిరంకుశ పాలకులకు కర్రుకాల్చి వాతపెట్టేందుకు ఓటర్లు సిద్ధమవడమే.