ఆరు గ్యారంటీల అమలుకు..

For the implementation of six guarantees..– డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షులుగా మంత్రివర్గ ఉపసంఘం
– సభ్యులుగా పొంగులేటి, శ్రీధర్‌ బాబు
– లబ్దిదారుల ఎంపికపై విధివిధానాలు ఖరారు
– మొత్తం కోటి 25 లక్షల దరఖాస్తులు
– క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత లబ్దిదారుల ఎంపిక
– ప్రజాపాలనపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
– నిర్ణయ వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆరు గ్యారంటీలను పకడ్బందిగా అమలు చేసేందుకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనపై హైదరాబాద్‌లోని సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను వేగంగా అమలు చేయాలని నిర్ణయించారు. అనంతరం సమావేశ వివరాలను సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రజా పాలనలో ఒక కోటి 25లక్షల ధరఖాస్తులు వచ్చాయనీ, అందులో ఆరు గ్యారెంటీలకు సంబంధించి కోటి 5 లక్షలు, రేషన్‌ కార్డులు, భూములు తదితర అంశాలకు సంబందించి 20లక్షలు వచ్చాయన్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఎక్కించి, ఆధార్‌, రేషన్‌ కార్డు ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులతో లింక్‌ చేయనున్నట్టు పొంగులేటి వివరించారు. డేటా ఎంట్రీ అనంతరం సబ్‌ కమిటీ, కేబినెట్‌లో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో 85లక్షల రేషన్‌ కార్డులుంటే ఒక కోటి 5లక్షల దరఖాస్తులు వచ్చాయనీ, క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులను ప్రకటిస్తామని తెలిపారు. 40 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదనీ, డిసెంబర్‌ 9న అధికారం చేపట్టినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. ఈ అంశంపై ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారాలను మానుకోవాలనీ, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల రోజులు కాకముందే అధికారం లాక్కోవాలని బీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరుతోందని ఎద్దేవా చేశారు. వంద రోజుల వరకు ఓపిక పట్టాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట మేరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా హామీలను అమలు చేస్తుందని తెలిపారు.
కేటీఆర్‌లో అసహనం పెరిగింది: పొన్నం ప్రభాకర్‌
అధికారం కోల్పోవడంతో కేటీఆర్‌లో అసహనం, అసూయ పెరిగి ఇష్టా రాజ్యంగా మాట్లాడుతున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. 32 మెడికల్‌ కాలజీలకు బదులు 32 యూ ట్యూబ్‌ చానళ్లను ఏర్పాటు చేస్తే గెలిచే వాళ్లమంటూ పరిపక్వత లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా అధికారంలో ఉన్నామనే మైకంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పల పాలు చేసింది చాలక స్వేద పత్రాల పేరుతో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలనీ, లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Spread the love