స్వచ్ఛ మేడారం కోసం..

– పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి
– డిపిఓ వెంకయ్య  
నవతెలంగాణ- తాడ్వాయి 
కోటిన్నర మంది భక్తులు తర లివచ్చే మేడారం మహాజాతరను పరిశుభ్రంగా, స్వచ్ఛం గా జరిపించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పారిశుధ్య పరిరక్షణకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంది. వెయ్యి మంది అధికారుల పర్యవేక్షణలో 4వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులతో 24 గంట లు క్లీనింగ్‌ పనులు చేయాలని నిర్ణయించింది.
మహాజాతరలో పారిశుధ్య పరిరక్షణకు సిద్ధమవుతున్న యంత్రాంగం
– 10 జోన్లుగా మేడారం విభజన
– 4వేల మంది స్కావెంజర్లతో వ్యర్ధాల ఏరివేత
– రాజమండ్రి, తెనాలి, విజయవాడ నుంచి కార్మికులు
– పర్యవేక్షణకు 1,072 మంది అధికారులు
– 10 డంపింగ్‌ యార్డులు సిద్ధం
– రోడ్లను ఊడ్చేందుకు ఐదు స్వీపింగ్‌ మిషన్లు
ములుగు, ఫిబ్రవరి 3: కోటిన్నర మంది భక్తులు తర లివచ్చే మేడారం మహాజాతరను పరిశుభ్రంగా, స్వచ్ఛం గా జరిపించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పారిశుధ్య పరిరక్షణకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంది. వెయ్యి మంది అధికారుల పర్యవేక్షణలో 4వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులతో 24 గంట లు క్లీనింగ్‌ పనులు చేయాలని నిర్ణయించింది.
10 జోన్లు.. 25 సెక్టార్లు
మేడారం జాతర జరిగే ప్రదేశం, భక్తులు విడిది చేసే ప్రాంతాలను కలుపుకొని ఏడు కిలోమీటర్ల విస్తీర్ణంలో పారిశుధ్య చర్యలకు అధికారులు నిర్ణయిం చారు. 10 జోన్లు, 25 సెక్టార్లు, 60 సబ్‌ సెక్టార్లుగా విభ జించారు. జోన్‌కు డీఎల్‌పీవో, సెక్టార్‌కు ఎంపీవో, సబ్‌ సెక్టార్లకు పంచాయతీ కార్యదర్శులను పర్యవేక్షక అధికా రులుగా నియమించారు. డీపీవో ఆధ్వర్యంలో మొత్తం 1,072 మంది ఆయా కేడర్‌ల అధికారులు, సిబ్బందికి జాతర నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
4వేల మందితో వ్యర్ధాల ఏరివేత
జాతరలో పారిశుధ్య పనుల కోసం 4వేల మంది కార్మికులను వినియోగించనున్నారు. ఎప్పటిలాగే రాజమండ్రి, విజయవాడ, తెనాలి ప్రాంతాల నుంచి కార్మికులను రప్పిస్తున్నారు. మరుగుదొడ్ల క్లీనింగ్‌ కోసం ప్రత్యేకంగా 1200 మందిని నియమిస్తున్నారు. జోరు జాతర జరిగే వారం రోజులలో 8 గంటలకో షిప్టు చొప్పున మూడు షిఫ్టులలో 24 గంటల పాటు పారిశుధ్య పనులు చేయనున్నారు. మిగతా రోజుల్లో రెండు షిఫ్టులలో పనులు చేస్తారు. ప్రస్తుతం 380 మందితో పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. క్రమంగా వీరి సంఖ్యను పెంచనున్నారు.
10 చోట్ల భారీ డంపింగ్‌ యార్డులు
సేకరించిన చెత్తను జాతరకు దూరంగా తరలించేం దుకు 10 చోట్ల డంపింగ్‌ యార్డులను గుర్తించడం జరి గింది. గుడ్డేలుగు గుట్ట, కొంగల మడుగు-1, 2, చింతల్‌ క్రాస్‌-1, 2, కన్నెపల్లి, ఊరట్టం, కొండాయి-1, 2 డంపిం గ్‌ యార్డులను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్లాస్టిక్‌, తడి, పొడి, మాంసం వ్యర్ధాలను వేర్వేరుగా సేకరించి డం పింగ్‌ యార్డులకు తరలించనున్నారు. ఇందుకోసం ట్రాక్టర్లు, మినీ డంపర్లను సిద్ధం చేస్తున్నారు. అదేవి ధంగా రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 5 స్వీపింగ్‌ యంత్రాలను సమకూర్చుకుంటున్నారు.
6వేల తాత్కాలిక మరుగుదొడ్లు
జాతర పరిసరాల్లో మొత్తం 279 బ్లాక్‌లలో 6వేల తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే శాశ్వత ప్రాతిపదికన 12 బ్లాక్‌లలో 25 చొప్పున నిర్మించిన మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. ఒక్కో కార్మికునికి ఐదు మరుగుదొడ్ల బాధ్యతను అప్పగించి ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం నీటి సరఫరా జరిగేలా పైప్‌లైన్‌లను విస్తరించి నీటి తొట్లను నిర్మిస్తున్నారు.
బ్లీచింగ్‌, సున్నం డంప్‌
జాతర జరుగుతున్న సమయం, అనంతరం బ్యాక్టీరి యా వ్యాపించకుండా యాంటీ లార్వా ద్రావకాన్ని పిచి కారీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం బ్లీచింగ్‌ పౌడర్‌, సున్నం, కెమికల్‌ ద్రావకాలను దిగు మతి చేసుకుంటున్నారు. 2,500 బస్తాల చొప్పున బ్లీచింగ్‌, సున్నం బస్తాలు, తడి, పొడి చెత్త సేకరణ కోసం 25వేల చొప్పున కవర్లు తెప్పిస్తున్నారు. వ్యర్ధాలను తొలగించిన తర్వాత దుర్గంధం వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు వీటిని పరిసరాలలో చల్లుతారు.
భక్తులు సహకారం అందించాలి:  కె.వెంకయ్య, ములుగు డీపీవో
మేడారం జాతరను కాలుష్య రహితంగా జరిపించేందుకు భక్తులు సహకారం అందించాలి. అడవి మధ్యలో కొలువైన వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. సిబ్బందికి సహకరించాలి. జాతర పరిసరాలలో ఏర్పాటుచేసే మినీ డంపింగ్‌ సెంటర్లు, చెత్త కుండీలలోనే వ్యర్ధాలను వేయాలి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించవద్దని ఇప్పటికే స్థానికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేశాం. అవగాహన కల్పిస్తున్నాం. పెద్ద ఎత్తున జూట్‌ బ్యాగులను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నాం.
Spread the love