– అరబిందో ఫార్మా సీఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో రూ.1.20 కోట్లతో పాఠశాల నిర్మాణం
– విద్యార్థులకు ఆధునిక విద్యా వసతుల కల్పనకే ప్రభుత్వ ప్రాధాన్యం..
– జూలై 4న మిడ్జిల్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.
– జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి
నవతెలంగాణ – ఊరుకొండ
ఊర్కొండ మండలంలోని గుడిగానిపల్లి గ్రామంలో అరబిందో ఫార్మా సీఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శుక్రవారం జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి అరబిందో ఫార్మా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పాఠశాల భవనం గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించనుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి.. మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా కార్పొరేట్ సంస్థలు విద్యారంగానికి చేయూతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరుకున్న గుడిగానిపల్లి పాఠశాల భవనాన్ని పునర్నిర్మించాలని స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు అరబిందో ఫార్మా సహకారంతో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేలా అన్ని సదుపాయాలతో ఈ భవనం నిర్మించబడుతుందని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ ముచ్చర్లపల్లి నుండి జగబోయినపల్లి వరకు 12 కిలోమీటర్ల డబుల్ రోడ్డు మంజూరు అయిందని, అలాగే మాదారం నుండి గుడిగానిపల్లి మీదుగా మల్లాపూర్ వరకు మరో డబుల్ రోడ్డు మంజూరైనట్లు తెలిపారు. జూలై 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండల పర్యటనకు రానున్నారని, ఉమ్మడి మిడ్జిల్ మరియు ఊర్కొండ మండల పరిధిలోని ప్రతి గ్రామానికి రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అదే రోజు గుడిగానిపల్లి గ్రామ వాసి ధ్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అరబిందో ఫార్మా ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


