మరో నాలుగు రోజులు వానలు

– ఎల్లో అలెర్ట్‌ జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాలు వచ్చే నాలుగురోజుల పాటు కొనసాగనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈమేరకు శనివారం హెచ్చరిక జారీచేసింది. ముందు జాగ్రత్త చర్యగా ‘ఎల్లో’ అలెర్ట్‌ను జారీ చేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు కొత్తగూడెం, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వాన కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సమాచారం.
మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌లో అతిభారీ వర్షాలు పడే పరిస్థితి ఉందని పేర్కొంది. కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయనీ, అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ‘ఎల్లో’ అలెర్ట్‌ను జారీ చేసింది.

Spread the love