నిత్య కోతల నుంచి నిరంతర వెలుగులకు ప్రస్థానం

– అన్ని రంగాలకు నిరంతర 24 గంటల విద్యుత్
– ఇది స్వరాష్ట్రం సాధించిన ఘనత…
– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించక ముందు తెలంగాణలో నిత్యం కోతలు ఉండేవని నేడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరంతర వెలుగులు విరజిమ్మేల అభివృద్ధి సాధించుకున్నమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ శుభం గార్డెన్ లో హుస్నాబాద్ నియోజకవర్గం స్థాయి దశబ్ది వారోత్సవాల విజయోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సీఎం కేసీఆర్ దూరదృష్టి, కృషి పట్టుదలతో ఇది సాధ్యమైందని అన్నారు. నేడు పరిశ్రమల కోసం, వ్యవసాయ అవసరాల కోసం నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు. రానున్న రోజుల్లో దేశంలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ మారబోతుందని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు , పవర్లూమ్ వినియోగదారులకు, స్పిన్నింగ్ మిల్స్, పౌల్ట్రీ ఫార్మ్స్ కు సబ్సిడీలు ఇస్తున్నామని హెయిర్ కటింగ్ సెలూన్స్ కు, లాండ్రీ షాపులకు, దోబిగాట్ లకు ఫ్రీగా కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అవసరమున్న ప్రతిచోట సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకొని, కొత్తగా దాదాపు నాలుగు వేల ట్రాన్స్ఫార్మర్లను నిర్మించుకున్నామని తెలిపారు. నాగ సముద్రాలలో 220 కెవి సబ్స్టేషన్ నిర్మాణం చేసుకున్నామని మిగులు విద్యుత్ ను స్టోరేజ్ చేసుకుని వాడుకునే వెసులుబాటు కూడా కల్పించుకున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయ వినియోగం, పరిశ్రమల కోసం గృహ అవసరాల కోసం నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని ఇందుకోసం కృషి చేస్తున్న విద్యుత్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, సిద్దిపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజారెడ్డి, విద్యుత్ శాఖ డీఈ , ఏడి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, జడ్పిటిసి భూక్య మంగా, ఎంపీపీలు లకావత్ మానస సుభాష్, లక్ష్మి బిల్ నాయక్, కీర్తి, సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love