కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో గెస్ట్ ప్యాకల్టీని వెంటనే నియమించాలి

– టీఎస్ యుటిఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి
నవతెలంగాణ – సిద్దిపేట
జిల్లాలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో సబ్జెక్టుల కొరత తీర్చడానికి తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ ఫ్యాకల్టీ ని వెంటనే నియమించాలని టీఎస్ యుటిఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి టీ. యాదగిరి అధికారులను కోరారు. బుదవారం టిఎస్ యుటిఎఫ్  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో ప్రసూతి  మరియు మెడికల్ లీవుల కారణంగా కొన్ని సబ్జెక్టులలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందున, వారి స్థానంలో తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ ఫ్యాకల్టీని నియమించాలని అన్నారు. గత నెలలో ఖాళీలను పూరించడానికి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని,  కొత్త నోటిఫికేషన్ పైన గతంలో కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం వలన కొత్త నియామకాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే జిల్లాలో వివిధ కారణాల రీత్యా సెలవులో ఉన్న సబ్జెక్టు టీచర్ల స్థానంలో సంబంధిత మండలంలోని ఇతర కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా పాఠాలు చెప్పించాలని విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించడం జరిగిందని అన్నారు.  దీనివలన సంబంధిత పాఠశాలలోని విద్యార్థులకు సరైన బోధన జరగకపోగా, రెండు పాఠశాలల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని అన్నారు.  వెంటనే గెస్ట్ ఫ్యాకల్టీని నియమించి సబ్జెక్టు కొరతను తీర్చి, ఉపాధ్యాయులకు పని భారాన్ని తగ్గిస్తూ, విద్యార్థులకు మేలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి  కనకరాజు, శివలింగం జిల్లా కమిటీ సభ్యులు శివుడు, రాజనర్సింహ పాల్గొన్నారు.
Spread the love