12 నుంచి ఢిల్లీలో జి-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు

నవతెలంగాణ- ఢిల్లీ: జి-20 దేశాల 9వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు ఈ నెల 12 నుంచి 14 వరకూ ఢిల్లీలో జరుగనుంది. ఈ సదస్సుకు ద్వారకాలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ యశోభూమి వేదిక నియమించారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నిన్న జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఇందులో జర్మనీ, అర్జెంటీనా మినహా మిగిలిన జి-20 సభ్యదేశాలు, 9 ఆహ్వానిత దేశాల సభాపతులు, ఇంటర్‌పార్లమెంటరీ యూనియన్‌, కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. మొత్తం 50 మంది పార్లమెంటు సభ్యులు, 26 మంది స్పీకర్లు, 10 మంది డిప్యూటీ స్పీకర్లు, 14 మంది సెక్రటరీ జనరళ్లు, 1 కమిటీ ఛైర్మన్‌, 1 ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ ప్రెసిడెంట్‌ తమ రాకను ఖరారు చేసినట్లు స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. తొలిసారి ఆఫ్రికన్‌ పార్లమెంట్‌ ప్రెసిడెంట్‌ ఇందులో పాల్గొంటున్నట్లు చెప్పారు. గతంలో ఏ సదస్సుకూ హాజరుకానంత మంది ఈ సదస్సుకు హాజరుకాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం చూపే దిశగా ఇందులో చర్చలు నిర్వహించనున్నట్లు స్పీకర్‌ చెప్పారు. దినిలో తొలిరోజు పర్యావరణంపై జీవన విధాన ప్రభావం అన్న అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. 13వ తేదీన విదేశీ అతిథులు పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శిస్తారని చెప్పారు. 13వ తేదీ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి ప్రసంగిస్తారన్నారు.

Spread the love