ఆనాడు చీకటిని పారద్రోలేందుకు తుపాకి పట్టిన గద్దర్‌

– ఆటా పాటతో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేసిండు
– మార్పు కోసం యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది
– తెలంగాణ అన్నోళ్లను జైల్లో పెట్టించినోళ్లను మర్చిపోతున్నం
– గద్దర్‌ సంస్మరణ సభలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ 
నవతెలంగాణ-రామగిరి

ఆనాడు చీకటిని పారద్రోలేందుకు అడవిబాట పట్టిన గద్దర్‌ తుపాకీ చేతపట్టాడని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. రామగిరి మండలం సెంటినరీకాలనీలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రజా యుద్దనౌక గద్దర్‌ సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గద్దర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.. జన నాట్య మండలి నుంచి పరిచయమైన గద్దర్‌ ప్రజా యుద్దనౌకగా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారని ఆయన గుర్తు చేశారు.ఆనాడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో చర్చల సమయంలో కీలక పాత్ర పోషించారని, నాటి ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగానే ఆయన పోరాటం చేశారన్నారు. గద్దర్‌ పేరు మాత్రమే చాలా మందికి తెలుసునని, ఆయన ఆటా పాటలు ఎంతో గొప్పగా ఉంటాయని మాత్రమే తెలుసునని, ఆయనను చూడలేదన్నారు. తాను విద్యార్థి దశలో ఉన్న క్రమంలో మంథని మండలం సూరయ్యపల్లి సభకు వచ్చిన గద్దర్‌ను మొట్టమొదటిసారి చూశామని, ఆయనను చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారని, ఆ  తర్వాత వరంగల్‌లో జరిగిన సభకు సైతం రెట్టింపు స్థాయిలో ప్రజలు హజరయ్యారని ఆయన గుర్తు చేశారు. తన ఆటాపాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు గద్దర్‌ ఎంతో ప్రయత్నం చేశాడని, కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు కోసం యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు ఇదే తెలంగాణ చౌరస్తాలో నిలబడి తెలంగాణ అంటే దేశద్రోహులుగా ముద్ర వేసి జైల్లో పెట్టించినోళ్లను ఈనాడు మనం మర్చిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు గద్దర్‌ తుపాకీ చేతపట్టి చైతన్యం కోసం పాటుపడ్డాడని, ఈనాడు తుపాకీ కంటే వేగంగా దూసుకెళ్లే సోషల్‌ మీడియాను సక్రమంగా వినియోగించుకోవడం లేదని, సోషల్‌ మీడియా ద్వారా చైతన్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర యువ నాయకులు జక్కు రాకేష్‌, జెడ్పీటీసీ శారద కుమార్‌, వైస్‌ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి బాస్కర్‌, సర్పంచ్‌ అల్లం పద్మ తిరుపతి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, నాగేల్లి సాంబయ్య, గద్దల శంకర్, మహిళా విబాగం మండల అధ్యక్షురాలు ఆశాకుమారి, ఏఎంసీ డైరెక్టర్ మైదం స్వప్న సతీష్, ఎంపీటీసీ కామ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love