– యూఎస్పిసి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ముల్కల కుమార్
నవతెలంగాణ- వీణవంక
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పిసి) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆగస్టు 12న నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమం గోడ ప్రతిని యూఎస్పిసి జిల్లా స్టీరింగ్ కమిటీ బాధ్యులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జూన్ 30తో గత పిఆర్సి గడువు ముగిసినందున ప్రభుత్వం వెంటనే నూతన పిఆర్సి కమిటీని నియమించి, మద్యంతర భృతి (ఐ ఆర్) వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రెజరీలో ఆమోదం పొంది ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటిని తక్షణమే చెల్లించాలన్నారు. గత 8 ఏళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, ఆరేళ్లుగా బదిలీలు లేనందున బదిలీల్లో అడ్డంకులను తొలగించి వెంటనే బదిలీలు పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల ఆర్థిక భద్రతకు భరోసా లేకుండా శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యమయిందని అందువల్లే యూఎస్పీసీ ఆధ్వర్యంలో దశలవారి పోరాట కార్యక్రమాలు చేపడుతుందని, ఆగస్టు 12న జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూఎస్పిసీ బాధ్యులు మేకమల్ల శ్రీనివాస్, లింగయ్య, తిరుపతి రెడ్డి, కనకం శ్రీనివాస్, ఉమారెడ్డి, రామ్మూర్తి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.