నవతెలంగాణ-వీణవంక
ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ సహకారంతో వీణవంక మండల కేంద్ర అభివృద్ధికి కృషి చేస్తూ మండల కేంద్రాన్ని మోడల్ విలేజిగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటునందిస్తానని సర్పంచ్ నీల కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన ‘నవతెలంగాణ’తో ఆదివారం మాట్లాడారు. మండల కేంద్రం విస్తరించిందని, మండల కేంద్రంలో ఎక్కడ కూడా సరైన రోడ్లు, మురుగు కాల్వలు లేకపోవడంతో గ్రామం అందకారంలోకి నెట్టివేయబడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ది చేసేందుకు అధిక నిధులు కేటాయిస్తోందని చెప్పారు. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు పోయడంతో పాటు మురుగు కాల్వలను నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. వీణవంక మండల కేంద్రాన్ని మోడల్ విలేజిగా రూపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు, పాలక వర్గం సహకారంతో గ్రామాన్ని అందంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. ఈ పనులు వేగవంతం చేసి ముమ్మరంగ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కావున గ్రామ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పట్టుదలతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్న ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.