ముంబయి: పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి జరిగిన ఇంటర్వ్యూలకు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, డబ్ల్యువి. రామన్ హాజరయ్యారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సిఎసి) మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు వీరు హాజరయ్యారు. ఐసిసి టి20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనుండడంతో మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా నేతృత్వంలోని సిఎసి కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకు హాజరుకాగా.. భారత మహిళల జట్టు బ్రాడ్‌కాస్టర్‌గా ఉన్న డబ్ల్యువి రామన్ బెంగళూరునుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మల్హోత్రాతోపాటు సులక్షణ నాయక్, జతిన్ పరాంజపే సిఎసి కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రధాన కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బిసిసిఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.