నవతెలంగాణ – హైదరాబాద్
ఆస్ట్రేలియాలోని ఓవల్ మైదానంలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా వైఫల్యం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తోపాటు చటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ 15 పరుగులు మించకుండానే పెవిలియన్ చేరగా, అజింక్య రహానే, జడేజా, శార్థూల్ ఠాకూర్ క్రీజులో కుదురుకుని ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్నారు. దీనిపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ స్పందిస్తూ.. రహానే తన ఇన్నింగ్స్ ద్వారా టాపార్డర్ బ్యాటర్లకు తగిన సందేశాన్ని పంపించాడని వ్యాఖ్యానించారు. తద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని గంగూలీ విమర్శించినట్టయింది. ముఖ్యంగా రహానే, ఠాకూర్ భాగస్వామ్యం వల్లే టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు అయినా చేయగలిగింది. లేదంటే ఫాలో ఆన్ ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చేది. విదేశీ పిచ్ లపై ఎంత ఓపికగా ఆడాలో, సామర్థ్యాలను ప్రదర్శించాలతో ఈ ఇద్దరు టాపార్డర్ కు సందేశం పంపించినట్టు గంగూలీ వ్యాఖ్యానించారు. ‘‘అదృష్టం తోడవ్వాలంటే వికెట్ పై పరుగులు చేయగలగాలి అని వారు డ్రెస్సింగ్ రూమ్ కు తెలియజేశారు. రహానేకి ఈ ఘనత అంతా దక్కుతుంది. అతడు అద్భుతమైన ఆటగాడు. శార్థూల్ కు ఆరంభంలోనే దెబ్బలు తగిలినా కానీ, కుదురుకున్నాడు. అతడు గతంలోనూ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వేదికలపై బాగా బ్యాట్ చేశాడు. భారత్ మంచిగా పోరాడింది. టాపార్డర్ కు ఇదో సందేశం కూడా’’అని అభిప్రాయం వ్యక్తం చేశారు.