– బీఆర్‌ఎస్ ముందస్తు అభ్యర్థులకు నోటు కష్టాలు..అయినా సీటు డౌటే..?
బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్.. పక్కా పొలిటీషియన్. అందరూ మరిచిపోయిన విషయాన్ని ఎలా తెరపైకి తీసుకురావాలో.. అంతటా మాట్లాడుకుంటున్న అంశాన్ని ఏ విధంగా తెరమరుగు చేయాలో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ప్రత్యేకించి ఎత్తులు జిత్తులకు ఆయన పెట్టింది పేరు. అయితే ప్రతిపక్షాలను గందరగోళంలో, అంతకు మించిన అయోమయంలో పడేయాలనే ప్లాన్‌తో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సొంత పార్టీ నేతలనే అయోమయానికి, ఆవేదనకు గురి చేస్తోంది. ఏమిటా నిర్ణయం అంటారా..? అదేనండీ… అందరికంటే ముందే తొందరపడి, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుండానే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయటం. నవంబరు చివరి వారంలోనో, డిసెంబరు మొదటి వారంలోనో నిర్వహించబోయే శాసనసభ ఎన్నికలకు ఆయన ఆగస్టులోనే జాబితాను విడుదల చేయటం బీఆర్‌ఎస్‌కు మేలు చేస్తుందో లేదో తెలియదుగానీ, అభ్యర్థులకు మాత్రం లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎన్నికల ప్రక్రియ మొదలవకుండానే ఒక్కో నియోజకవర్గంలో ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో తమకు టిక్కెట్ దక్కిందన్న ఆనందం కంటే అభ్యర్థుల్లో ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది.
బి.వి.యన్.పద్మరాజు
బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ఆగస్టు 21న ప్రకటించారు. అది కూడా ఒకేసారి 115 మంది పేర్లతో కూడిన లిస్టును వెలువరించారు. ఆ జాబితాలో చోటు దక్కిన వారి మోముల్లో ఆ రోజు వెయ్యి మతాబులు వెలిగాయి. సిట్టింగులు, సీటు దక్కిన వారు వెనువెంటనే రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని పార్టీ అధినేత ఆదేశించారు. ఇక మూణ్నెల్లపాటు హైదరాబాద్‌లో ఎవరూ ఉండొద్దు.. నియోజవర్గాలకు వెళ్లండి, జనంతో మమేకం కండి… ప్రతి ఒక్కరినీ కలవండి, తద్వారా ఇప్పటి నుంచే ఓటర్ల మనసులను గెలుచుకోండి అంటూ ఆయన వారికి దిశా నిర్దేశం చేశారు. అధినేత ఆదేశాలతో అభ్యర్థులందరూ ‘ఎలక్షన్ గ్రౌండ్’కి వెళ్లిపోయారు. అభివృద్ధి కార్యమ్రాల్లో కొన్నింటికి ప్రారంభోత్సవాలు, మరికొన్నింటికి శంఖుస్థాపన రాళ్లు పడ్డాయి. సామాజిక సేవా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఒక వారం రోజులు ఇదంతా బాగానే జరిగింది. ఇక అక్కడి నుంచే సీన్ సితారవుతూ వస్తోంది. అనుకున్నదొకటయితే.. అవుతోంది మరోటి…తమ పరిస్థితి ‘అనుకున్నదొక్కటీ.. అయినది ఒక్కటీ…’ అన్నట్టుగా తయారైందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ‘టిక్కెట్ దక్కిందనే జోష్‌లో మేముంటే.. అది దక్కింది కాబట్టి ఇక ప్రతీరోజూ ఒక ఊపు ఉపాల్సిందే అనే రీతిలో క్యాడర్ ఉంది…’ అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి వాపోయారు. ఇది వినటానికి బాగానే ఉన్నా… ఇప్పటి నుంచే ‘అన్నీ చూసుకోవాలి.. అన్నీ భరించాలి…’ అంటే ఖర్చే తడిసిమోపెడవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాపం… తెల్లవారకముందే తలుపు తడుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి వారిది. ఏ మాత్రం కటువుగా మాట్లాడినా, వారు ‘అడిగిన దానికి నో చెప్పినా…’ అలకపాన్పు ఎక్కుతారామోనన్న భయం వెంటాడుతోందని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. అలకపాన్పు ఎక్కినా ఫరవాలేదు, కానీ కోపానికొచ్చి… మాకు హ్యాండిచ్చి… ఇంకో పార్టీ ‘హస్తం’ అందుకుంటారేమోనని భయంగా ఉందంటూ మరో సీనియర్ ఆవేదన వ్యక్తం చేశారు. టిక్కెట్ దక్కిందనే ఆనందం కంటే… ఇప్పటి నుంచి పెట్టాల్సిన ఖర్చు చూస్తేనే ఏడుపొస్తోందని హైదరాబాద్‌కు చెందిన మరో ముఖ్య నేత నెత్తి పట్టుకున్నారు.
ముందుంది మొసళ్ల పండగ…
జాబితా వచ్చి నెలరోజులు కాకముందే చోటా మోటా నేతలు, కార్యకర్తలను కాపాడుకునేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తుంటే..ఈనెలతోపాటు అక్టోబరు, నవంబరు నెలల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవటానికే కష్టంగా ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నెలల్లో వరసగా వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు ఉండటమే దీనికి కారణం. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గాల్లోని ప్రతీ ఊరుకి గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పూజలు, ఊరేగింపులు, భజనల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు వారిని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. ఓట్ల పండుగ రాకముందే ఈ పండుగలు మాకు గుండు గీయిస్తాయని అభ్యర్థులు దిగులుపడుతున్నారు.
చంటి పాపలు.. కంటి పాపలు…
‘ఎన్నికలు అయిపోయేంత వరకూ కార్యకర్తలు, నాయకులను చంటి పాపల్లా చూసుకోవాలి. ఏ ఒక్కరినీ చేజార్చుకోవద్దు. ఇగోలు, ప్రెస్టేజీలన్నింటినీ పక్కన పెట్టండి. అవసరమైతే మీకు వ్యతిరేకంగా ఉన్న వారి కడుపులో తలకాయపెట్టి మరీ బతిమాలుకోండి…’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్… అభ్యర్థులకు మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. వారితోపాటు ఓటర్ల అవసరాలు గుర్తించి, వారిని ఇప్పటి నుంచే కంటి పాపల్లా చూసుకోవాల్సి వస్తోందని ఓ యువనేత చెప్పారు. ఇదే ఇప్పుడు తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ‘ఖర్చు’ సంగతేమోగానీ, అది వచ్చేదాకా.. ఈ రెండు, మూడు నెలల కాలం ఎలా గడుస్తుందోనని కారు పార్టీ అభ్యర్థులు మదనపడిపోతున్నారు. ఇంత చేసినా బీ-ఫామ్ దక్కేదాకా సీటుకు గ్యారెంటీ లేదని వారు వాపోతుండటం కొసమెరుపు.