దుర్గాదేవి…భావి త‌రాల‌కు స్పూర్తి

దుర్గాదేవి...భావి త‌రాల‌కు స్పూర్తికొండపల్లి దుర్గాదేవి… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పేరు తెలియనివారు అతి కొద్దిమంది. ఉన్నత కుటుంబంలో పుట్టినా నిరుపేదల కోసం అహర్నిశలూ శ్రమించారు. ఎన్నో కష్టాలను అనుభవించారు. అయినా పేదల పక్షమే నిలిచారు. బాధిత మహిళలకు అండగా నిలబడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన వంతు పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఖమ్మం జిల్లా మొదటి అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా, రాష్ట్ర నాయకురాలిగా వివిధ హోదాలలో సుదీర్ఘ కాలం పని చేశారు. అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన ఆ గొప్ప నాయకురాలి రెండవ వర్ధంతి సందర్భంగా ఆమెతో నాకున్న కొన్ని జ్ఞాపకాలు మీ ముందుంచుతున్నాను.
దుర్గాదేవి 1933లో ఇల్లందు దగ్గరి కారేపల్లి గ్రామంలో పుట్టారు. తల్లి నేదునూరి రంగమ్మ, తండ్రి నేదునూరి వీరరాఘవరావు. ఇద్దరూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు. వీరి పెంపకంలో పెరిగిన కుటుంబ సభ్యులందరూ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా రాటుదేలారు. దుర్గాదేవి పినతండ్రి నేదునూరి జగన్మాధం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కార్యదర్శివర్గ సభ్యులుగా పని చేశారు. వీరందరి ప్రభావం దుర్గమ్మపై ఉండేది. ఆమెకు ఎనిమిదేండ్ల వయసున్నప్పుడు వారి ఇంట్లోనే పార్టీ నిర్మాణ తరగతులు జరిగాయి. ఆమెకు పదిహేనేండ్ల వయసులో 1948లో కేఎల్‌ నరసింహారావుతో అండర్‌ గ్రౌండ్‌లో దండల పెండ్లి జరిగింది. ఈ పెండ్లికి ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. అప్పట్లో కేఎల్‌ నాగపూర్‌, బొంబయి వెళ్ళి ఆయుధాలు తీసుకొచ్చి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనే ఉద్యమ కారులకు సరఫరా చేసేవారు. ఈ పనిలో దుర్గాదేవి భర్తకు సహకరిం చేది. ఇది అత్యంత సాహసోపేతమైన పని. అయినా ఎలాంటి భయం లేకుండా సాయుధపోరాటంలో ఆమె తన వంతు పాత్ర పోషించారు. ఇలా దుర్గాదేవి ఉద్యమంలో భర్తకు అన్ని విధాలుగా సహకరించేవారు.
వితంతువులను కొత్త జీవితం
ధనవంతుల కుటుంబంలో పుట్టినా దుర్గమ్మ పార్టీ, మహిళా సంఘ అభివృద్ధి కోసం అత్యంత సాధారణ జీవితం గడిపారు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లను అనుభవించారు. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. భర్త ఎమ్మెల్యేగా ఉన్నా తన ముగ్గురు పిల్లల్ని అత్యంత సాధారణంగా పెంచారు. అప్పట్లో ఆరుట్ల కమలాదేవి, దుర్గమ్మ కుటుంబం పార్టీ కేటాయించిన ఒకే ఇంట్లో ఉండేవారు. తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన తర్వాత ఆ ఉద్యమంలో భర్తలను పోగొట్టుకున్న మహిళలకు చదువు చెప్పించేవారు. వారికి తిరిగి వివాహాలు చేసి కొత్త జీవితం ఇచ్చేవారు. వారి పిల్లలకు కూడా చదువు నేర్పించేవారు. ఇలా అహర్నిశలూ పేదలు, మహిళల కోసమే ఆమె కృషి చేశారు.
మొదటి పరిచయం
రాష్ట్ర కార్యదర్శి మోటూరు ఉదయం, మల్లు స్వరాజ్యం తరచూ వస్తూ ఖమ్మం జిల్లా ఉద్యమానికి గైడెన్స్‌ ఇచ్చేవారు. 1982లో ఒంగోలు పట్టణంలో రాష్ట్రస్థాయి ఐద్వా క్లాసులు ఎనిమిది రోజులపాటు నిర్వహించారు. అఖిలభారత నాయకులు విమలా రణదివే, అహల్యా రంగేకర్‌ క్లాసులు బోధించారు. ఈ క్లాసులకు చింతూరు నుండి నేను మొదటిసారి హాజరయ్యాను. ఆ ప్రాంత ఉద్యమ నాయకులు భీష్మారావు వెంటబెట్టుకుని వచ్చి ఖమ్మం రైల్వే స్టేషన్‌లో దుర్గాదేవికి నన్ను అప్పగించి వెళ్ళారు. అలా ఉద్యమంలో అడుగుపెట్టాను. జిల్లా కమిటీ సభ్యురాలిగా దుర్గాదేవితో పని చేస్తూ వచ్చాను.
ఐద్వా పోరాటాల ఫలితంగా…
1990 తర్వాత నేను ఖమ్మం సెంటర్‌కు వచ్చాను. ఆనాటికి ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో విపరీతమైన అవినీతి, అరాచకాలు, పేషంట్లను, పేషంట్లతో ఉండేవారిని హింసించే సంస్కృతి ఉండేది. పక్కనే ఉన్న నర్సు ట్రైనింగ్‌ అమ్మాయిలపైన కూడా ఆస్పత్రి సిబ్బంది రౌడీలుగా తయారై హాస్టల్‌ వార్డెన్‌ను బెదిరించి లైంగిక దాడులు చేస్తుండేవారు. నర్సులను వేధించేవారు. ఆస్పత్రి పక్కన ఉండే ఖాళీ స్థలంలో బహిర్బూమికి వెళ్ళిన పెషెంట్‌ సహాయకులపై కూడా దాడులు చేసేవారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా 1995 నుండి 1996 వరకు ఏడాది కాలం సుదీర్ఘ పోరాటం చేసి డాక్టర్లతో సహా కొంతమందిని సస్సెండ్‌ చేయించాము. ఐద్వా పోరాటాల ఫలితంగా చాలా వరకు ఈ హింసను అరికట్టగలిగాం. ఆనాటి అలాంటి దారుణ పరిస్థితుల్లో ఉన్న ఆ ఆస్పత్రి ఇప్పుడు నూతన భవనంతో దేదీప్యమానంగా ఉందంటే అందులో దుర్గాదేవి కృషి ఎంతో ఉందని చెప్పాలి.
అగ్రవర్ణంలో పుట్టినా…
జిల్లాలో జరిగిన వ్యవసాయ కూలి మహిళల హక్కుల కోసం దుర్గాదేవి ఆధ్వరంలో మేము నిరంతరం పోరాటం చేశాము. ఆమె అగ్రవర్ణంలో, భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా కార్మికవర్గ దృక్పథంతో పనిచేసేవారు. అందరితో కలిసిపోయారు. కోయగూడేలు, ఎస్‌సి పేటలతో సహా ఏ గ్రామ ప్రజలు అన్నంపెట్టినా ఎటువంటి ఇబ్బంది పడకుండా తినేవారు. మాంసాహారం మాత్రం తినేవారు కాదు. పక్కన మేము తింటున్నా ఇబ్బందిపడేవారు కాదు. జిల్లా ముఖ్యమైన సమావేశాలు ఎక్కువగా ఆమె ఇంట్లోనే జరిగేవి. మా తొమ్మిది మంది టీమ్‌కి తానే స్వయంగా వంటచేసి పెట్టేవారు. అప్పట్లో కుల వివక్ష తీవ్రంగా ఉండేది. అలాంటిది ఇంట్లో వాళ్ళు తినే ప్లేటులోనే మాకు వడ్డించేవారు. మాకు చాలా గొప్పగా అనిపించేది. ఆ కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని కుటుంబ సభ్యులుగానే చూసేవారు.
టీంని ప్రోత్సహించేవారు…
మహిళా ఉద్యమానికి కావలసిన నిధులు సమకూర్చడంలో గానీ, ఉద్యమాలు, క్లాసులు నిర్వహించడంలో గానీ… ఇలా ప్రతి కార్యక్రమంలో ముందుండి టీంని ప్రోత్సహించేవారు. ఎంత చిన్న కార్యక్రమమైనా బాగా ఆలోచించి ప్లాన్‌ చేసేవారు. రాష్ట్ర నాయకురాలిగా ఆమె వరంగల్‌ జిల్లాను చాలాకాలం గైడ్‌ చేసారు. 45 ఏండ్ల పాటు సుదీర్ఘ కాలం పోరాటాలు సాగించారు. చివరలో ఇంట్లో జారిపడి కాళ్ళకి, గుండెకి కూడా మేజర్‌ ఆపరేషన్‌ అయిన రెండు నెలలు తిరగకుండానే ఆఫీస్‌కు వచ్చి మీటింగ్‌లో పాల్గొనేవారు. 80 ఏండ్ల వయసు వరకు అలుపు లేకుండా పనిచేసిన పోరాట యోధురాలు దుర్గాదేవి. అటువంటి గొప్ప నాయకురాలు, నేటి తరానికి స్ఫూర్తి ప్రధాతకు రెండవ వర్ధంతి సందర్భంగా జోహార్లు.
ఎక్కడ అన్యాయం జరిగినా…
పేరులోనే కాదు మహిళల సమస్యల పట్ల కూడా దుర్గామాతలాగే పోరాడేవారు. చెప్పుకుంటే దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఖమ్మం జిల్లా వాజేడు మండలం వరకు చాలా విస్తారమైన అడవులతో నిండిన జిల్లా. ఈ జిల్లా అంతా ఎక్కడ మహిళలపై అన్యాయం జరిగినా ఆ ఘటనని ఖండించేవారు. అంతేకాదు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని వ్యక్తిగతంగా కలిసి, విచారణ జరిపి దోషులపై చర్య తీసుకునే వరకూ పోరాటం చేసేవారు. 1990 ప్రాంతంలో పాల్వంచలో వనమా రాఘవేంద్ర ఒక మైనార్టీ మహిళను అడవిలోకి తీసుకెళ్ళి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ విషయం తెలిసి మేము జీపు తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి పర్యవేక్షించి ముద్దాయిని అరెస్టు చేయించాము. పాల్వంచలో ర్యాలీ తీసాము. ఇటువంటి అనేక ఘటనలు ఉన్నాయి. ఇలా ఆ రోజుల్లోనే చాలా ధైర్యంగా ఆమె అన్యాయాలను ఎదిరిస్తూ పోరాడారు.
ఎమర్జెన్సీ కాలంలో…
1974లో ఆంధ్రప్రదేశ్‌ మహిళాసంఘం (పున:నిర్మాణం) రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరిగాయి. ఈ సభలు దుర్గమ్మ నాయకత్వంలోనే జరిగాయి. ఈ సభలోనే ఖమ్మం జిల్లా కమిటీ ఏర్పాటు చేసారు. ఆ తర్వాత బయ్యారం గ్రామంలో జరిగిన ఖమ్మం మహిళా శిక్షణా తరగతులకు కూడా ఆమె నాయకత్వం వహించారు. ఖమ్మం జిల్లా అధ్యక్షురాలిగా ఏలూరి జయమ్మ, కార్యదర్శిగా కొండపల్లి దుర్గాదేవితో పాటు 15మందితో మొదటి జిల్లా కమిటీ ఏర్పడింది. ఆనాటి నుండి వారివురు ఇల్లందు నియోజకవర్గంలో గ్రామగ్రామం తిరుగుతూ మహిళా సమస్యలపైన పనిచేసి బలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మించారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఖమ్మం జిల్లావ్యాప్తంగా వామపక్ష కుటుంబాల మహిళలని చైతన్యం చేస్తూ కదిలించారు. ఆ విధంగా 1980 నాటికి ఖమ్మం జిల్లా 8 నియోజకవర్గాలలో మహిళా కమిటీలు ఏర్పడి ఒక బలమైన జిల్లా కమిటీ ఏర్పడి వారిద్దరి నాయకత్వంలో ఉద్యమం అభివృద్ధి చెందింది.

Spread the love