కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

Golden Telangana is possible only with Congress– ఐదు రాష్ట్రాల్లో మాదే విజయం : ‘సీడబ్ల్యూసీ’లో కాంగ్రెస్‌ నేతల ఉద్ఘాటన
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ మోసకారి పార్టీలంటూ విమర్శ
– తెలంగాణ వనరులు లూటీ అవుతున్నాయని ఆందోళన
– ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని హైదరాబాద్‌లో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశం పేర్కొంది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది నిర్వహించే పార్లమెంట్‌ ఎలక్షన్లలోనూ తమ పార్టీ గెలిచి తీరుతుందని ఆ సమావేశం ధీమా వ్యక్తం చేసింది. అందుకోసం ఎక్కడికక్కడ పటిష్ట ప్రణాళికలు, ముందస్తు వ్యూహంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించింది. బీజేపీ అవకాశవాద రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కాంగ్రెస్‌ పాలసీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనీ, క్షేత్రస్థాయి కార్యకర్తలు,నాయకులతో కలిసి పనిచేయాలని సీడబ్ల్యూసీ… నాయకులు, కార్యకర్తలకు నిర్దేశించింది. త్వరలో ఎన్నికలు జరగబోయే తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై సీడబ్ల్యూసీ సమావేశం రెండోరోజైన ఆదివారం చర్చించారు. తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయా రాష్ట్రాల నాయకులు పార్టీ కార్యచరణను వివరించారు. తెలంగాణకు సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
మోసకారి విధానాలతో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు తెలంగాణ సంపదను లూటీ చేశాయనీ, అందువల్ల ఇక్కడి ప్రజల ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరలేదని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందనీ, నిజాం తరహా పాలనతో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల హక్కులను హరిస్తున్నదని పేర్కొంది. ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొని,తెలంగాణ ప్రజల డిమాండ్‌ను గౌరవించి కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందనీ సమావేశంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ లక్ష్యం నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులతోపాటు ప్రభుత్వాల లోపభూయిష్ట బీమా పాలసీతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌ వల్ల గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములపై దళిత, గిరిజన, బలహీనవర్గాల వారు హక్కులు కోల్పోయారని సమావేశం పేర్కొంది. బీజేపీ విధానాలతో చిన్న వ్యాపారస్తులు నష్ట పోతున్నారని తెలిపింది. ప్రయివేటీకరణతో దేశంలో యువతకు ఉపాధి దొరకడం లేదనీ, నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారిందని వివరించింది. కాంగ్రెస్‌తోనే తెలంగాణ సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని ఉద్ఘాటించింది. అందరినీ కలుపుకునిపోయే పరిపాలన కాంగ్రెస్‌కే సాధ్యమని సమావేశంలో తీర్మానించారు. అందువల్ల వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీని ఆదరించి, అక్కున చేర్చుకోవాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు విజ్ఞప్తి చేశారు. రెండురోజులపాటు నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశం జయప్రదంగా ముగిసిందని వారు ఈ సందర్భంగా ప్రకటించారు.
రాష్ట్రాన్ని దివాలా తీయించారు
– ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ధనిక రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్‌ దివాళా తీయించారని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందనీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంతో చేసిందని తెలిపారు. ఆదివారం తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన విజయభేరీ సభలో ఆయన ప్రసంగించారు. తమ ప్రయాసను పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం బీఆర్‌ఎస్‌ బడ్జెట్‌ కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. బడాబాబులు రూ. వేల కోట్ల ప్రజల సొమ్మును దోపిడీ చేసి విదేశాలకు పారిపోతుంటే చోద్యం చూస్తూ ఉండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తాననీ, విదేశాల నుంచి నల్లధనం రప్పించి రూ.15 లక్షల చొప్పున ప్రజల అకౌంట్లో వేస్తామనీ హామీలిచ్చిన మోడీ సర్కార్‌ వారిని మోసం చేసిందని గుర్తుచేశారు.
మాట తప్పని సోనియమ్మ : రేవంత్‌ రెడ్డి
సోనియాగాంధీ అంటే మాట తప్పని, మడమ తిప్పని నేత అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రాష్ట్ర ప్రజల కోసం మరో ఆరు గ్యారంటీలను ఇచ్చారని తెలిపారు. ఒక తల్లిగా తెలంగాణ ప్రజల బాధను ఆమె అర్థం చేసుకున్నారని తెలిపారు.
నియంత పాలన అంతానికే….:కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సెప్టెంబర్‌ 17 తెలంగాణ ఆత్మగౌరవ దినమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో సోనియాగాంధీ 2014లో మరోసారి తెలంగాణకు స్వాతంత్య్రం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో నియంత పాలనను అంతం చేసేందుకే సోనియాగాంధీ తెలంగాణకు వచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించి దోపిడీ బీఆర్‌ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. విజయభేరి సభలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్‌ విందర్‌ సింగ్‌ తదితరులు మాట్లాడారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాహుల్‌ గాంధీ హిందీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మధుయాష్కీ మల్లి కార్జున ఖర్గే ప్రసంగాన్ని అనువదించారు.

Spread the love