ఉత్త మాటలే…!

Utta words...!– హోదా,విభజన హామీల ఊసెత్తని మోడీ
– విశాఖ ఉక్కు ప్రస్తావన లేదు
– చంద్రబాబు, పవన్‌లదీ అదే తీరుొ రాష్ట్రంలో అవినీతి సర్కారును ఓడించాలని పిలుపు
– వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యమని ప్రకటన
– ఇండియా బ్లాక్‌పై విమర్శలు
అమరావతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ‘ప్రజాగళం’ పేరుతో జరిగిన ప్రధాని మోడీ సభ మాటల మాయాజాలానికే పరిమితమైంది. ఎన్‌డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రంలో నిర్వహించిన తొలి సభ కావడంతో పాటు, ప్రధాని మోడీ హాజరవుతుండటంతో రెండు రోజుల ముందునుండే కార్పొరేట్‌ మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. రాష్ట్రం ఎదుర్కుంటున్న అన్ని సమస్యలకు ఈ సభలోనే మోడీ పరిష్కారం చేస్తారన్నట్టుగా ఈ ప్రచారం సాగింది. అయితే, ఆదివారం సాయంత్రం జరిగిన సభలో మోడీ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలక సమస్యలను విస్మరించారు. ప్రత్యేకహోదా, విభజన హామీలను కూడా ఆయన ప్రస్తావించలేదు. కొద్ది సంవత్సరాల క్రితం తాను స్వయంగా శంకుస్థాపన చేసి, పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు కుమ్మరించిన అమరావతికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ సభ జరిగినప్పటికీ రాజధాని అంశాన్ని మోడీ మాటవరసకి కూడా మాట్లాడలేదు. సంవత్సరాల తరబడి సాగుతున్న విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటాన్ని ప్రస్తావించడం కానీ, రాష్ట్ర ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పడంకానీ చేయలేదు. అసలు అటువంటి ఆందోళనే రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలియని విధంగా ప్రధాని ప్రసంగం సాగింది. ఇతర ముఖ్యమైన సమస్యలను విస్మరించిన ప్రధాని ‘వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌’ తమ లక్ష్యమని చెప్పారు. సమస్యలు పరిష్కరించకుండా వికసిత రాష్ట్రం ఎలా సాధ్యమవుతుందో వివరించలేదు. ప్రధానికి ముందు ప్రసగించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ అంశాలను నామమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడంతో ఈ అంశాలపై ఎన్‌డీఏ కూటమి వైఖరి స్పష్టమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తునాయి. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉందని, దానికి చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని అన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏకి మూడో సారి అధికారం ఇవ్వడం, రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడటమన్న రెండు సంకల్పాలను ప్రజలు తీసుకోవాలని చెప్పారు. వైసీపీ పాలనలో గడిచిన ఐదేండ్ల కాలంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు.
ఎన్‌డీఏతోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ వేర్వేరు కాదని, రెండు ఒకే కుటుంబం చేతిలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఇండియా బ్లాక్‌లో పార్టీలు ఎవరికి వారుగా వ్యవహరిస్తుంటారని అన్నారు. ఎన్నికల అవసరాలకోసం ఏర్పాటైందని అన్నారు. పదేండ్ల తన పాలనలో రాష్ట్రానికి ఎంతో చేశానని చెప్పారు. అనేక జాతీయ విద్యాసంస్థలను ఇచ్చినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేసినట్టు చెప్పారు. ఎన్‌డీఏకు 400కు పైగా ఎంపీ సీట్లు దాటాలని అప్పుడే వికసిత్‌ భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం సాధ్యమవుతుందని చెప్పారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ రాష్ట్ర వికాసానికి చేసిన కృషిని, పోరాటాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని చెప్పారు.
కోటప్ప కొండకు సమీపంలో సభ జరుగుతుండటంతో ‘త్రిమూర్తుల’ ఆశీర్వాదం తనకు లభిస్తోందని చెప్పారు. మూడవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత మరిన్ని ధృడమైన నిర్ణయాలను తీసుకోవాల్సివుందన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహరావును, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌టి రామారావును తన ప్రసంగంలో మోడీ గుర్తు చేసుకున్నారు. ఎన్‌టిఆర్‌ రాముడి పాత్రలో జీవించారని, రైతుల కోసం, పేదల కోసం పోరాడారని అన్నారు. ఎన్‌టిఆర్‌ శతాబ్ధి ఉత్సవాల వేళ ఆయన స్మారక నాణాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ విస్మరించిన, తెలుగుబిడ్డ పివి నరసింహరావుకు భారత రత్న ఇచ్చి గౌరవించినట్టు చెప్పారు.

Spread the love