Tuesday, April 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆఫ్టర్‌ కేర్‌ పిల్లలకు అండగా ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి సీతక్క

ఆఫ్టర్‌ కేర్‌ పిల్లలకు అండగా ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆఫ్టర్‌ కేర్‌ పిల్లలకు అండగా ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ”చైల్డ్‌ సేఫ్టీ – ప్రొటెక్షన్‌ అండ్‌ సే నో టు డ్రగ్స్‌” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతా దయాకర్‌ రెడ్డి, సభ్యులు అపర్ణ చందన, సరిత, వందన, వచన్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక అల, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్‌, డైరెక్టర్‌ శృతి, ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు గిరిధర్‌, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూషన్లలో నివసిస్తున్న విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఆఫ్టర్‌ కేర్‌ విద్యార్థులు 1,055 మందికి ఆధార్‌ తదితర సర్టిఫికెట్లతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును మంత్రి సీతక్క అందజేశారు. ఆమె ఈగల్‌ ఫోర్స్‌ తరఫున విద్యార్థులకు స్పోర్ట్స్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. అనంతరం ”సే నో టు డ్రగ్స్‌” పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గతంలో సర్టిఫికెట్ల కోసం ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం పూర్తిగా తొలగించిందని తెలిపారు. అనాధ పిల్లలకు ఏకకాలంలో వేల సంఖ్యలో ద్రువీకరణ పత్రాలు అందజేయడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. ”మీ జీవితాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే వారు ఉంటారు. కానీ మీరు మంచి లక్ష్యంతో ముందుకు సాగాలి” అని విద్యార్థులకు సందేశమిచ్చారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని పేర్కొంటూ స్పోర్ట్స్‌ కిట్స్‌ పంపిణీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. ”ప్రతి చిన్నారి భద్రంగా ఉండాలి.ప్రతి యువకుడు సరైన దిశలో ఎదగాలి. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి. అదే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడుతుంది” అని సీతక్క అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, అధికారులు, విద్యార్థులను మంత్రి అభినందించారు. ప్రభుత్వం, అధికారులు, సామాజిక సంస్థలు కలిసి ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -