ప్రజాపంపిణీ, అక్రమాలపై ప్రభుత్వం దృష్టి

– బినామీ డీలర్లకు చెక్
– ఈ-పాస్ లాగిన్ లో మార్పులు 
– డీలర్ తోపాటు మరో ఇద్దరికే అవకాశం
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు అరికట్టడంతోపాటు,బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేదిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.ఇటీవల పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన డీఎస్ చౌహన్ ఆదిశగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.బినామీ డీలర్ల గుర్తింపు కోసం క్షేత్ర స్థాయిలో సర్వేతో పాటు,ఈపాస్ లాగిన్ లోనూ మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. డీలర్ తోపాటు రక్త సంబందికులు మాత్రమే ఈ యంత్రంలో లాగిన్ అయ్యేలా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది వరకు నలుగురుకి అవకాశం…..
ఇదివరకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలంటే తనకు కేటాయించిన ఈ పాస్ మీషన్ లో తన వేలిముద్ర ద్వారా లాగిన్ కావాలి. ఒకవేళ డీలర్ అనారోగ్యానికి గురైన, ఇతరత్రా ప్రత్యేక పరిస్థితుల్లో పౌరసరఫరాల శాఖ వారికి వేసలుబాటు కల్పించింది. డీలర్ ప్రతి పాదించిన మరో ముగ్గురు వ్యక్తులు లాగిన్ అయ్యే అవకాశం కల్పించారు.అదే అదునుగా కొంతమంది బినామీలకు తెరలేపారు. అయితే బినామీలుగా వచ్చిన వారు ఇష్టానుసారంగా దుకాణాలు తెరవడ, సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా కార్డుదారులకు ఇబ్బందులు  కలిగించారు. అర్హులైన వారికే ఈ పాస్ లాగిన్ కు అవకాశం ఇవ్వాలని గతంలో నుంచే నిబంధనలు ఉన్నప్పటికీ కొంతమంది రెవెన్యూ అధికారులు వాటిని పట్టించుకోలేదు.ఈ పాస్ లో వేలిముద్రలు నమోదు చేసే అవకాశం తహశీల్దార్లకె ఉంటుంది.అయితే రెవెన్యూ సిబ్బంది కొంతమంది తహశీల్దార్ల తెలియకుండానే డీలర్లతో కుమ్మక్కై వారు చెప్పిన వేలిముద్రలు సేకరించి మిషన్ లో నమోదు చేశారు. దీంతో పలుచోట్ల డీలర్లు కాకుండా బినామిలు పెత్తనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అందిన ఫిర్యాదుల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ప్రక్షాళన చేపట్టింది.
క్షేత్రస్థాయిలో సర్వే…
బినామీ డీలర్లను గుర్తించాలనే పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టారు.గత జనవరిలో తమ పరిధిలోని ప్రతి దుకాణాన్ని తనిఖీ చేసి వివరాలు అరా తీశారు.నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారిని అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికను అందించారు.బినామీ డీలర్లకు, అక్రమాలకు బ్రేక్ పెట్టేలా ఈ పాస్ లాగిన్ లో  మార్పులు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా రక్త సంబంధికులకే….
బియ్యం పంపిణీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పాస్ లాగిన్ లో మార్పులు చేశారు.ఇక నుంచి ఎవరు పడితే వారు బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉండకుండా డీలర్ తోపాటు వారి కుటుంబీకుల్లో ఇద్దరికి మాత్రమే లాగిన్ అవకాశం కల్పించారు. భార్య, లేదా భర్త తోపాటు వారి పిల్లలకు అవకాశం ఉంటుంది. వారి ఇంట్లో సోదరి, సోదరులకు ఇవ్వకూడదని నిర్ణయించారు.ఒక వేళ డీలర్ కు పెళ్లి కాకపోతే అతడితోపాటు తల్లిదండ్రులకు అవకాశం కల్పించారు. నామినిలు రేషన్ కార్డులో పెరు కలిగి ఉండడంతో పాటు తహశీల్దార్ డిక్లరేషన్ ఇచ్చిన వారి వివరాలను స్కాన్ చేసి ఈ పాస్ మిషన్ లో నమోదు చేస్తారు.
Spread the love