నేటి నుంచి జీపీ వర్కర్ల సమ్మె

gp workers strike– విధులు బహిష్కరించనున్న 60 వేల మంది కార్మికులు, ఉద్యోగులు
– మల్టీపర్పస్‌ విధానం రద్దు, వేతనాల పెంపుపైనే పట్టు
– 14 డిమాండ్లతో ముందుకు
– సమ్మెకు పాలకమండలి, ప్రజలు సహకరించాలి : జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. 60 వేల మంది కార్మికు లు విధులను బహిష్కరించనున్నారు. మల్టీ పర్పస్‌ విధానం రద్దు, వేతనాల పెంపుపైనే ప్రధానంగా వారు పట్టుపడుతున్నారు. 14 డిమాండ్లతో గత నెల ఐదో తేదీన పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామారావుకు సమ్మెనోటీసు అందించినా సర్కారు నుంచి కనీస స్పందన రాలేదు. చర్చల కూ పిలవలేదు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ కార్మికులు, కారోబార్లు, బిల్‌కలెక్టర్లు సమ్మెలోకి వెళ్తున్నారు. మల్టీపర్పస్‌ విధానం రద్దు, కారో బార్‌, బిల్‌కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌, జీవో నెంబర్‌ 60 అమలు, తదితదిర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. వారికి ఇప్పటిదాకా గ్రామపంచాయతీ నిధుల ద్వారా వేతనాలు ఇస్తున్నారు. మొన్నటిదాకా రూ.8,500 వేతనం అందగా..ప్రస్తుతం రూ.9,500 వేతనం దక్కుతున్నది. ఆ వేతనమూ ఇద్దరు, ముగ్గురు కార్మికులు పంచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు మాత్రమే వస్తున్నది. అదీ నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నది. 11 నెలల నుంచి వేతనాలు ఇవ్వని జీపీలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా వేతనాలివ్వాలనే డిమాండ్‌ను పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు తెరపైకి తెచ్చారు. బియ్యం, ఉప్పు,పప్పు ఇలా నిత్యావసరాల ధరలు భగభగ మండిపోతున్న క్రమంలో నాలుగైదు వేల రూపాయలతో ఇల్లు ఎలా గడుస్తుందని ప్రశ్నిస్తున్నారు. వేరే పనికి కూడా వెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితి వారిది. ఉద యం ఆరు గంటలకు డ్యూటీకెక్కితే మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల ప్రాంతంలో విధులు నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఇంత వండుకుని తిని మళ్లీ సాయంత్రం కూడా పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. మోరీలు తీస్తూ, మలం ఎత్తిపోస్తూ గొడ్డుచాకిరీ చేస్తున్నా తమ శ్రమను గుర్తించరా? అని పాలకులను ప్రశ్నిస్తున్నారు. పీర్సీలో కనీస వేతనంగా నిర్ణయించిన రూ.19 వేలను వేతనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కారోబార్‌, బిల్‌కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఎస్‌కే.డే ఇన్సూరెన్స్‌ పథకాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదననూ సర్కారు ముందు పెట్టారు. మల్టీపర్పస్‌ విధానం కార్మికుల ప్రాణాలను హరిస్తున్నది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరెంటు పనిరాకపోయినా అతన్ని స్తంభంపైకి బలవంతంగా ఎక్కించగా..అతను విద్యుద్ఘాతంతో చనిపోయిన విషయం తెలిసిందే. నల్లగొండ, సిద్దిపేట, కామారెడ్డి, తదితర జిల్లాల్లో ట్రాక్టర్లు బోల్తా పడి కార్మికులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే మల్టీపర్పస్‌ విధానం రద్దు అంశాన్ని కార్మికులు ప్రధాన డిమాండ్‌గా ఎత్తుకున్నారు. 2023 వచ్చినా 2011 జనాభా లెక్కల ప్రకారమే గ్రామాల్లో పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో తక్కువ మంది కార్మికులు ఎక్కువ పనిచేయాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే అవసరమున్న చోట కొత్త సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. పంచాయతీ కార్మికులు, ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ప్రమాదబీమా, యూనిఫారాలు, అల వెన్స్‌లు, తదితర సౌకర్యాలను వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికులు చేస్తున్న డిమాండ్లన్నీ న్యాయమైనవే. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత సర్కాదే.
డిమాండ్లు నెరవేర్చేదాకా సమ్మెలోనే
డిమాండ్లను పరిష్కరించే దాకా పంచాయతీ కార్మికులు, కారోబార్లు, బిల్‌కలెక్టర్లు సమ్మెలోనే ఉంటారు. ఇప్పటికే అధికారులు ఎన్నోసార్లు హామీలిచ్చారు. చేతులు దులుపుకున్నారు. హామీలు కాదు అమలు చేసేదాకా సమ్మె చేస్తాం. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు, వేల వేల రూపాయల జీతాలు పెంచుకున్నరు కదా. మేం వద్దనట్లేదు.
ఊర్లర్లో మోరీల్లోని మలమూత్రాలను ఎత్తిపోసి, ఇంటింటికీ పోయి కుళ్లిన చెత్తను తీసుకెళ్లి శుభ్రం చేస్తున్న కార్మికులు ముష్టి వెయ్యి రూపాయల వేతనం పెంచుతారా? జీపీ కార్మికుల్లో నూటికి 90 శాతానికిపైగా దళితులే ఉన్నారు కాబట్టి వివక్ష చూపుతున్నారా? ఇదెక్కడి అన్యాయం. వారికి కనీస వేతనాలు ఇవ్వాల్సిందే. ప్రాణాలు తీస్తున్న మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలి. అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి.
తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌

Spread the love