పంజాబ్‌లో పట్టాలెక్కిన అన్నదాతలు

Graduated breadwinners in Punjab– 62 ప్రాంతాల్లో రైలు రోకో
– హర్యానాలో రైతుల నిర్బంధం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, రైతులందరికీ రుణమాఫీ అమల్జేయాలని కోరుతూ అన్నదాతలు ఆందోళనలను ఉధృతంగా కొనసాగిస్తున్నారు. పంజాబ్‌లో 62 ప్రాంతాల్లో రైతులు రైలు రోకో నిర్వహించారు. రైల్వే స్టేషన్లలోకి దూసుకెళ్లి పట్టాలపై కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మరోవైపు హర్యానాలోనూ వివిధ రూపాల్లో ఆందోళనలకు సిద్ధమైన అన్నదాతలను అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్బంధించింది. పలుచోట్ల 144 సెక్షన్‌ విధించి అణచివేతకు పాల్పడింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు రైలురోకో నిర్వహించారు. ఈ ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు. పంజాబ్‌లో 62 ప్రాంతాల్లో రైలు రోకో చేపట్టగా 49 రైలు సర్వీసులు రద్దు అయ్యాయి. ఇంటర్‌ సిటీ లైన్లతో పాటు ప్రధాన లైన్లు కూడా రైలు రోకో ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. హర్యానా, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో వందలాది మంది రైతులను అక్కడి ప్రభుత్వాలు నిర్బంధించాయి. హర్యానాలోని దబ్వాలి, ఎల్లెనాబాద్‌లో అనేక మంది రైతులు ఆందోళన ప్రదేశాలకు వెళుతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని దౌసాలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. హర్యానా బిజెపి ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రతిఘటించి అన్నదాతలు మూడు చోట్ల రైలు రోకో చేపట్టారు. అంబాలాలోని మోహదా రైల్వే క్రాసింగ్‌, పంచకులలోని మనక్‌పూర్‌, అంబాలాలోని సర్సిని రైల్‌ రోకో జరిగింది. కిసాన్‌ మజ్దూర్‌ మంచ్‌ (కేఎంఎం) సమన్వయకర్త సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ మాట్లాడుతూ రాజస్థాన్‌లోని పిలిబంగ, తమిళనాడులోని తంజావూరు, మధ్యప్రదేశ్‌లోని ఝబువాతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు రైలు రోకో నిర్వహించారని తెలిపారు. రైళ్లను అడ్డుకోవడం తమకే సంతోషకరమైన విషయం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లు తెలియజేసేందుకు మరో మార్గం లేకపోయిందని ఆయన అన్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) సమన్వయకర్త జగ్జిత్‌ సింగ్‌ దల్లెవాల్‌ మాట్లాడుతూ రైతుల సమస్యలు ఆలకించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సాహసించలేకపోతోందని, రైతుల ఆందోళనను చూసి అది పారిపోతోందని విమర్శించారు. బీజేయూ షహీద్‌ భగత్‌ సింగ్‌ ప్రతినిధి తేజ్వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ హర్యానాలో రైతులపై బీజేపీ ప్రభుత్వ నిర్బంధ చర్యలను ఖండించారు.
మరోవైపు శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ధర్నాలు యథావిధిగా కొనసాగాయి. సమీప గ్రామాల నుంచి చాలా మంది నిరసనకారులు సమీపంలో ఉన్న శంభు రైల్వే స్టేషన్‌కు వెళ్లి నాలుగు గంటల పాటు పట్టాలపై కూర్చొని ఆందోళన చేపట్టారు.

Spread the love