నవతెలంగాణ-తుంగతుర్తి
కోట్లాది ప్రజల కల సాకారమై,అమరుల త్యాగం అక్షర రూపమై, తెలంగాణ అవతరించిన పర్వదినం సందర్భంగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నవతెలంగాణ పాఠకులకు కోసం ముఖాముఖీ:-
ప్రశ్న:నాడు ఉద్యమ పార్టీగా, నేడు ప్రధాన ప్రతిపక్షంగా, తెలంగాణ ప్రస్థానాన్ని ఎలా చూస్తున్నారు?.
60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ,14 ఏళ్లు కొట్లాడి మలిదశ ఉద్యమంతో నిజం చేసి, తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టి, ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించిన చరిత్ర కెసిఆర్ ది. గులాబీ పార్టీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతు భీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాము. భవిష్యత్తులోను తెలంగాణ హక్కుల కోసం, ప్రజా సంక్షేమం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు.
ప్రశ్న : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలా ఉంది?
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిలా చేసిన ఘనత కేసిఆర్ దే అన్నారు. కెసిఆర్ పాలనలో త్రాగు,సాగునీరు తో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామన్నారు. కేసీఆర్ పరిపాలనదక్షతకు జిల్లాల పునర్విభజన, సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ, నీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ కీర్తిని ఆకాశమంత ఎత్తుకు నిలిపిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం, జిల్లాకో మెడికల్ కాలేజ్, మిషన్ భగీరథ, వ్యవసాయ రంగ ముఖచిత్రానికి మార్గదర్శిగా నిలిచిన రైతుబంధు, అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ అగ్రగామిగా నిలిపిన ఘనత కెసిఆర్ ది అన్నారు.
ప్రశ్న: మీ పాలనలో తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటి?
2014కు ముందు బీడు భూములతో వలసలకు నిలయంగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేశాను. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు, సీసీ రోడ్లు, హరితహారం, స్మశాన వాటికలు, కమ్యూనిటీ హాల్స్, నిర్మించడం జరిగిందని తెలిపారు. 2014 ముందు నియోజకవర్గంలో 10 వేల పెన్షన్ దారులు ఉంటే, బిఆర్ఎస్ పాలనలో 50 వేల మందికి అందించామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని 5400 కోట్లతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని అన్నారు.
ప్రశ్న: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది?
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. అమలుకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. మహిళలకు రూ.2500, విద్యార్థినీలకు స్కూటీలు, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి లాంటి ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు. బిఆర్ఎస్ పాలనలో వేసవిలో కూడా చెరువులు కుంటలు అలుగులు పోసేవని, నాడు జాలువారిన పొలాలు నేడు బీటలు వారాయని అన్నారు. రెండు పంటలకు రైతులకు నీరు అందించామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పాలనలో ఒక్క పంటకు కూడా నీళ్లు అందించలేదని, యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెండు నెలలు దాటినా, నేటికి ధాన్యం కొనుగోలు కాలేదని అన్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని,కెసిఆర్ పాలనలో గురుకులాలు స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ప్రశ్న: రెండున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటి?
కాంగ్రెస్ ప్రభుత్వంలో తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. బీఆర్ఎస్ పాలనలో శంకుస్థాపన చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేసి పనులు చేస్తున్నారే తప్ప, కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కాంగ్రెస్లో వర్గ పోరే తప్ప అభివృద్ధి శూన్యమని, పంట పొలాలకు నీరు అందించలేదని, ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టలేకపోయారని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.
ప్రశ్న: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని, రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సమాజం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలతో మమేకమై, ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం పాటుపడతాను. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్షని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు.


