నవజాత శిశువుల ఆకలి తీర్చిన అమ్మకు గిన్నిస్‌ రికార్డ్‌

నవతెలంగాణ – వాషింగ్టన్: బిడ్డ ఎదుగుదలలో అతల్లి పాలు ఎంతో కీలకం. అయితే కొందరు పసిపిల్లలు వివిధకారణాలతో తల్లిపాలకు దూరం అవుతుంటారు. అలాంటి ఎంతోమంది పిల్లల ఆకలి తీర్చిందో మాతృమూర్తి. ఆమె సహృదయానికి గిన్నిస్‌ రికార్డూ దక్కింది. అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన ఎలిసాబెత్‌ అండర్సన్‌ సియోర్రాకు ఇద్దరు సంతానం. తన బిడ్డలకు పాలు పట్టడంతో పాటు 2015 నుంచి 2018 మధ్యలో 1,599.68 లీటర్ల చనుబాలను విరాళంగా అందించింది. ఈ స్థాయిలో పాలను దానం చేయడంతో ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ లెక్క కేవలం పాల బ్యాంకులకు ఇచ్చినవి మాత్రమే. ఇంక ఆమె వివిధ రూపాల్లో తన పాలను అందించింది. ఎలిసాబెత్‌ గిన్సిన్‌ వరల్డ్ రికార్డుతో మాట్లాడుతూ.. ‘ఓసారి ప్యూర్టెకికోలో ఒక నవజాత శిశువుకు పాలుపట్టాను. ప్రసవం సమయంలోని సమస్యలతో ఆ బిడ్డ తల్లిని కోల్పోయింది. ఆ చిన్నారిని రక్షించుకోవడానికి తండ్రి ఒక మిల్క్‌ బ్యాంకు నుంచి పాలు కొంటున్నారు. నా భర్తది ప్యూర్టెరికో కావడంతో ఓసారి నేను ఆ ద్వీపానికి వెళ్లాను. అప్పుడే ఆ బిడ్డ గురించి తెలిసి పాలిచ్చాను’ అని చెప్పారు. తర్వాత అలా వేలాది మంది పసికందులకు ఆకలి తీర్చడం సంతోషంగా అనిపించేదంటూ ఆనందం వ్యక్తం చేశారు. హైపర్‌లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా ఎలిసాబెత్‌కు పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవట. ఇలా తనలోని లోపం.. ఎందరో చిన్నారుల ఆకలి తీర్చడానికి ఉపయోగపడిందని, చివరకు గిన్నిస్ రికార్డును ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తల్లిపాలు ఇవ్వడానికి ఉపయోగించే పరికరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.

Spread the love