హర్మన్‌ ఎందుకలా చేశావ్‌?!

– భారత కెప్టెన్‌తో చర్చించనున్న బిన్ని, లక్ష్మణ్‌
న్యూఢిల్లీ : భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ క్రమశిక్షణ గీత దాటడంతో ఐసీసీ రెండు మ్యాచుల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌, భారత్‌ వన్డే సిరీస్‌1-1తో డ్రా అయ్యింది. మూడో వన్డే టైగా ముగిసింది. ఇరు జట్ల గ్రూపు ఫోటో సమయంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సహనం కోల్పోయింది. ‘ మీ కోసం మ్యాచ్‌ను టై చేసిన అంపైర్లను సైతం పిలవండి’ అని వ్యాఖ్యానించింది. హర్మన్‌ వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ తన జట్టుతో డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిపోయింది. ఫీల్డ్‌ అంపైర్ల నిర్ణయాలు ఎలాగున్నా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. మీర్పూర్‌ ఘటనపై హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్ని, ఎన్‌సీఏ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాట్లాడతారని బోర్డు కార్యదర్శి జై షా తెలిపారు. హర్మన్‌ అలా ఎందుకు సహనం కోల్పోయారో ఇద్దరు జెంటిల్‌మెన్‌ క్రికెటర్లు అడిగి తెలుసుకుంటారు. రిఫరీ నిర్ణయాన్ని బోర్డు సవాల్‌ చేయటం లేదు.అందుకు సమయం సైతం మించిపోయిందని షా అన్నారు. రెండు మ్యాచుల సస్పెన్షన్‌తో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆసియా క్రీడల్లో ఆడేది అనుమానంగా మారింది.

Spread the love