ఇండ్లిచ్చేందుకు అడ్డెవ్వడు…?

‘వాడెవ్వడు.. వీడెవ్వడు.. తెలంగాణకు అడ్డెవ్వడు…’ తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నినాదం ఎల్లడెలా మార్మోగింది. అప్పట్లో అందరికంటే ఎక్కువగా టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రస్తుత అధికార బీఆర్‌ఎస్‌ నేతలు… ఈ నినాదాన్ని బాగా వాడుకున్నారు. ఆ మేరకు ఫలితం కూడా పొందారు. ఆ క్రమంలో వారితోపాటు అందరి నినాదాలు, ఆందోళనలు, ఉద్యమాలు, రాస్తారోకోలు, ధర్నాల వార్తలను కవర్‌ చేసి, వాటిని ప్రపంచానికి చాటి చెప్పటంలో జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు ఎంతో క్రియాశీలక పాత్రను పోషించారు. ఆ క్రమంలో పోలీసుల లాఠీ ఛార్జీలు, ఉద్రిక్తల్లో ఎంతో మంది విలేకర్లు, ఫొటోగ్రాఫర్ల కాళ్లు, చేతులూ విరిగాయి.. తలలు పగిలాయి. అయినా వృత్తి ధర్మాన్ని విడనాడకుండా వారు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. తొమ్మిదేండ్లు కూడా పూర్తయింది. కానీ విచిత్రమేమంటే… ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఎక్కడా ‘జర్నలిస్టుల కోసం’ ఒక రోజంటూ లేకపాయే. కనీసం ప్రస్తావన కూడా లేకపాయే. గీ ముచ్చట గిట్లుంటే… అన్ని కుల సంఘాలకూ ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌… జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్ల స్థలాల గురించి నోరు మెదకపోవటం నిజంగా విచిత్రమే. దాదాపు 20 ఏండ్ల కిందటే హౌజింగ్‌ సొసైటీల్లో డబ్బులు కట్టి… ఇప్పటిదాకా కండ్లు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న సీనియరు పాత్రికేయులు సర్కారు వైఖరితో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పరిస్థితి. వారిలో కొందరు ఆవేదనతో…’సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇండ్లు ఇవ్వట్లే. ఇప్పుడు ఇండ్లివ్వటానికి నిజంగా సర్కారు అడ్డెవ్వడు..ఎందుకివ్వట్లేదు…?’ అంటూ బాధపడుతున్నారు. -కేఎన్‌ హరి

Spread the love