సునీతారెడ్డి పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

నవతెలంగాణ – న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై ఇవాళ(జూన్‌ 19) సుప్రీంకోర్టులో విచారణ కొనసాగనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఏ.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ వాదనలు విననుంది. గత వాదనల సందర్భంగా సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించిన బెంచ్‌.. విచారణను నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి మే 31వ తేదీన షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తానే స్వయంగా వాదించేందుకు ముందుకు వచ్చింది ఆమె. అయితే సాంకేతిక అంశాలున్న నేపథ్యంలో అడ్వొకేట్ ను పెట్టుకోవాలని సూచించగా.. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రా ఆమెకు సాయం అందించారు. ఇక వాదనల సందర్భంగా.. ఈ కేసులో సునీత తీరు పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని సుప్రీం బెంచ్‌ అభిప్రాయపడింది. కేవలం అవినాష్ రెడ్డిని జైల్లో వేయించడమే లక్ష్యంగా సునీత తీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. చివర్లో.. కేసుకు సంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు సునీత అనుమతి కోరగా.. ఇవాళ్టి విచారణలో పరిశీలిస్తానని చెప్పింది బెంచ్‌.

Spread the love