సిక్కింలో భారీ వర్షాల బీభత్సం..!

నవతెలంగాణ – సిక్కిం : సిక్కింలో భారీ వర్షాల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల ధాటికి పెద్ద ఎత్తున వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల ప్రభావిత ప్రాంతాల్లో 1200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. విద్యుత్‌ స్తంభాలు కూడా వరదల్లో కొట్టుకుపోవడంతో అంధకారంలో గడుపుతున్నారు. నెట్‌ వర్క్‌ లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర అవస్థలుపడుతున్నారు. రోడ్లన్నీ రాళ్ళతో బండ్లతో మూసుకుపోవడం వల్ల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి. ఆ రోడ్ల మరమ్మతులకు కనీసం 5 నుండి 6 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యాటకులను ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. అయితే సిక్కిం రాష్ట్రంలో చిక్కుకుపోయిన పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్‌ పాఠక్‌ వెల్లడించారు.
6కి చేరిన మృతుల సంఖ్య ….
ఉత్తర సిక్కింలో శుక్రవారం కూడా భారీ వర్షం పడింది. ఈ విపత్తు బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 6కి చేరుకుంది. గురువారం ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మరో ముగ్గురు వరదలో గల్లంతయ్యారు. సిక్కింలోని సంక్లాంగ్‌ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో చుంగ్తాంగ్‌, లాచుంగ్‌ ప్రాంతాల నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విపత్తు పరిస్థితిని సమీక్షించేందుకు సిఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ అధికారులతో ప్రత్యేక భేటీని ఏర్పాటు చేశారు. బాధిత ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులపై వివరాలు సేకరించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Spread the love