హమ్మ మోడీ..!

– పునర్విభజన పేరుతో విభజించు-పాలించు
– జనాభా నిష్పత్తి పేరుతో కుట్ర రాజకీయం
– ఇక్కడ బీజేపీకి ఉనికి లేదని ఒప్పుకోలు!
– ఉత్తరాదిలో ఎంపీ స్థానాలు పెంచి గెలవాలనే ఎత్తుగడ
– దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు
న్యూఢిల్లీ : ఢిల్లీ దేశాన్ని ప్రాంతాలవారీగా రాజకీయ విభజన చేసి, తద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తుంది. దాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రధాని మోడీ మీడియాకు లీకుల్ని విడుదల చేసి, ప్రాంతాల మధ్య రాజకీయ వైరాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనాభా ప్రాతిపదికగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలో స్థానాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. చట్టసభల్లో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాథాన్యత తగ్గి, అన్నింటికీ కేంద్రాన్ని ‘దేహీ’ అని అడుక్కోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని విశ్లేషిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. తమ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎంపీ స్థానాలు పెరుగుతాయనే అంచనాల్లో రాజకీయపార్టీలు, నేతలు మునిగిపోయారు. దక్షిణాది రాష్ట్రాలు మాత్రం పునర్విభజన ప్రక్రియ విధానాన్ని తప్పుపడుతున్నాయి. దేశానికి అగ్రభాగ ఆదాయాన్ని అందిస్తున్న తమకు చట్టసభల్లో సరైన ప్రాథాన్యత ఇవ్వకుంటే సహించేది లేదని తేల్చిచెప్తున్నాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న బీజేపీ దక్షిణాదిలో తమకు ఉనికి లేదని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టేనని ప్రచారం జరుగుతున్నది. అయితే ఢిల్లీలో మహిళా రెజ్లర్ల ఆందోళన తీవ్ర స్థాయికి చేరి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దీనిపై అంతర్జాతీయ రెజ్లర్ల సంఘం కూడా స్పందించి, ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం రాజకీయంగా మోడీ సర్కార్‌ను ఇరుకునపెట్టింది. రాజకీయపార్టీలన్నీ ఏకమై దానిపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ అంశాన్ని పక్కదారి పట్టించి, మరో రాజకీయ చర్చను తెరపైకి తెచ్చేందుకే ఇప్పుడీ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారనే చర్చా జరుగుతున్నది. జనాభా నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలో 84 శాతం సీట్లు పెరుగుతాయి. దక్షిణాదిలో 42 శాతం సీట్లు మాత్రమే పెరుగుతాయి. దీన్నే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు తప్పుపడుతున్నాయి. ఈ సీట్ల సంఖ్య 2026 నాటికి పెరిగినా, ప్రస్తుత రాజకీయ నిర్ణయం 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ఆ రాజకీయ లబ్ది కోసమే కేంద్రం ఇప్పుడు ఈ చర్చను తెరపైకి తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ”హిందీ మాట్లాడే ఎనిమిది రాష్ట్రాల్లో సీట్లు దాదాపు 84 శాతం పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే హిందీ రాష్ట్రాల సీట్లు దాదాపు రెట్టింపు అవుతాయి. దీనివల్ల బీజేపీకి లాభం కలుగుతుంది. గత ఎన్నికల్లో ఈ ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీకి 55శాతం సీట్లు వచ్చాయి” అని విశ్లేషిస్తున్నారు. 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని 1976లో చివరిగా నియోజకవర్గాల పునర్విభజన చేశారు. ఆ సమయంలో దేశ జనాభా 54 కోట్లు కాగా ప్రతి 10 లక్షల జనాభాకు ఒక లోక్‌సభ స్థానం అనే ఫార్ములాను ఆమోదించారు. ఈ విధంగా మొత్తం 543 సీట్లను ఖరారు చేశారు.
1971 తరువాత దేశంలో ఐదు సార్లు జనాభా గణన జరిగింది. 2021 జనాభా గణన ఇంకా జరగాల్సి ఉంది. చివరిసారిగా 2011లో జనాభా గణన జరిగింది. అప్పుడు దేశ జనాభా 121 కోట్లు ఉంది. అంటే 1971 కంటే 2.25 రెట్లు ఎక్కువ. అయితే లోక్‌సభలో సీట్లు పెరగలేదు. అలాంటప్పుడు 46 ఏండ్ల తరువాత కూడా అదే ఫార్ములాకు ఎందుకు కట్టుబడి ఉన్నారనేది ప్రశ్న.
2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ లోక్‌సభలో 1,000 సీట్లు కావాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ కూడా రానున్న కాలంలో లోక్‌సభలో సీట్లు పెరుగుతాయని చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ సింగ్‌, బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్‌ మోడీ కూడా డీలిమిటేషన్‌ గురించి ప్రస్తావించారు. అటువంటి పరిస్థితిలో 2026లో డీలిమిటేషన్‌ చేసే అవకాశం ఉంది.
వాస్తవానికి, 60-70 దశాబ్దంలో, ప్రభుత్వం జనాభాను నియంత్రించాలని పట్టుబట్టింది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో సమర్థవంతంగా అమలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఇదే అంశాన్ని దక్షిణాది రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర నిర్ణయాలు సమర్థవంతంగా అమలు చేస్తే, మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కుతారా అని తెలంగాణ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్‌ వేదికగా కామెంట్‌ చేశారు. ఇదే తరహా అభిప్రాయాన్ని పలు దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలూ వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్‌-81 ప్రకారం సభలో 550 మందికి మించి ఎన్నికైన సభ్యులు ఉండకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో సీట్ల సంఖ్య పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. లోక్‌సభలో మోడీ సర్కారుకు పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నందున గతంలో మాదిరే విపక్షాల వ్యతిరేకతను కాదని, బుల్డోజ్‌ రాజకీయంతో ఆ ‘సవరణ’ చేసుకున్నా ఆశ్చర్యం లేదు!
సీట్ల సంఖ్య పెరిగేదిలా!
2011లో దేశ జనాభా దాదాపు 121 కోట్లు. ఆ తరువాత జనాభా లెక్కలు చేపట్టలేదు. అదే జనాభా లెక్కలను 2026లో డీలిమిటేషన్‌ చేసి, 10 లక్షల జనాభాకు ఒక సీటు అనే ఫార్ములాను ఆమోదించినట్లయితే, దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య 1,210కి పెరుగుతుంది.కొత్త పార్లమెంటు లోక్‌సభలో గరిష్టంగా 888 మంది ఎంపీలు మాత్రమే కూర్చోగలరు. దీన్ని డీలిమిటేషన్‌ ప్రాతిపదికగా 1,210 సీట్లతో సర్దుబాటు చేస్తే ఉత్తరప్రదేశ్‌లో సీట్లు 80 నుంచి 143కి, బీహార్‌లో సీట్లు 40 నుంచి 79కి పెరిగే అవకాశం ఉంది. రాజస్థాన్‌లో సీట్లు 25 నుంచి 50కి, మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 29 నుంచి 52కి పెరగవచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో 11 నుంచి 19కి, గుజరాత్‌లో 26 నుంచి 43కి, హర్యానాలో 10 నుంచి 18కి, జార్ఖండ్‌లో 14 నుంచి 24కి, మహారాష్ట్రలో 48 నుంచి 76కి, ఒడిశాలో 21 నుంచి 28కి, పంజాబ్‌లో 13 నుంచి 18కి, ఉత్తరాఖండ్‌లో 5 నుంచి 7కి, పశ్చిమ బెంగాల్‌లో 42 నుంచి 60కి లోక్‌సభ సీట్లు పెరగనున్నాయి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కలిసి 42 సీట్లు ఉండగా ఈ సంఖ్య 54కి, కర్నాటక సీట్లు 28 నుంచి 41కి పెరగవచ్చు. తమిళనాడులో 39 నుంచి 49కి పెరగనున్నాయి. లోక్‌సభలో సీట్లు పెరిగితే, దాని ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై పెద్దగా ఉండదు. ఆ ఎనిమిది రాష్ట్రాలతో కలిపి తొమ్మిది సీట్లు మాత్రమే పెరుగుతున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బీజేపీ బలంగా ఉన్న అసోంలో గరిష్టంగా 7 సీట్లు పెరుగుతాయి. అంటే అసోంలో 14 నుంచి 21కి సీట్లు పెరగనున్నాయి. కేరళ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మిజోరాం, మేఘాలయా, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవకాశం లేదు.

Spread the love