గ్రాఫ్‌డౌన్‌…

– చేజారుతున్న కమలం
-కర్నాటక తర్వాత …కేవలం 15 రాష్ట్రాల్లో బీజేపీ
న్యూఢిల్లీ: కర్నాటక ఫలితాల తర్వాత బీజేపీ చేతిలోనుంచి మరో రాష్ట్రం తగ్గింది. ఇప్పుడు బీజేపీ అధికారం 15 రాష్ట్రాల్లో మిగిలింది. మెజారిటీ ఉన్న 6 రాష్ట్రాల్లో, మిత్రపక్షాలున్న 9 రాష్ట్రాల్లో ప్రభుత్వం నడుస్తోంది. దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వంలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గరిష్ట ఉనికిని కలిగిఉన్నది.వాస్తవానికి బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా..అక్కడ ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను అడ్డదారుల్లో కూల్చి అధికారమెక్కినవే అధికం గా ఉన్నాయన్నది నిర్వివాదాంశం.
ఐదేండ్లలో ఏం జరిగిందంటే..
మే 2018 నుంచి మే 2023 వరకు అంటే ఐదేండ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషిస్తే.. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, అందులో ఆరు ఎన్నికలలో మాత్రమే బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. మరో 16 రాష్ట్రాల్లో కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఎన్నికల తీరుతెన్నులు…
ప్రస్తుతం దేశంలో 30 శాసన సభలు ఉన్నాయి. రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ పుదుచ్చేరి కూడా ఉన్నాయి. కర్నాటక ఫలితాల తర్వాత 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇందులో 9 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నాయి. మిగిలిన 6 రాష్ట్రాల్లో కూటమి భాగస్వాములతో కొనసాగుతున్నాయి. అయితే ఇవేవీ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కావు. 2018లో బీజేపీ 21 రాష్ట్రాలను, దేశ జనాభాలో 71శాతం మందిని పాలించింది, కానీ ఇప్పుడు బీజేపీ అధికారం జనాభాలో 45 శాతానికి తగ్గిపోయింది. బీజేపీ లేదా దాని భాగస్వామ్య ప్రాంతాలలో కేవలం ఏడు రాష్ట్రాల జనాభా కోటి కంటే ఎక్కువ.
సౌత్‌ ఇండియా నుంచి బీజేపీ క్లీన్‌ స్వీప్‌.. నార్త్‌ ఈస్ట్‌ లో 3 బీజేపీ సీఎంలు
ఈశాన్య భారతదేశం (సిక్కింతో సహా): ఈశాన్య ప్రాంతంలోని 8 రాష్ట్రాల్లో మొత్తం 498 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బీజేపీకి 206 మంది ఎమ్మెల్యేలు అంటే 41.3% ఉన్నారు. అదేవిధంగా, ఈశాన్య రాష్ట్రాల నుంచి మొత్తం 25 మంది ఎంపీలు వచ్చారు. వీరిలో బీజేపీకి 15 మంది ఎంపీలు అంటే 60% ఉన్నారు. అసోంలో హేమంత్‌ బిస్వా శర్మ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ )నాయకత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. ఎన్‌డీపీపీకి చెందిన నే నీఫియు రియో ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మణిపూర్‌లో స్థానిక పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌, కేపీఏలతో కలిసి బీజేపీ సంకీర్ణ సర్కార్‌ నడుస్తోంది. బీజేపీకి చెందిన బీరేన్‌ సింగ్‌ సీఎంగా ఉన్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి.
మిజోరామ్‌ను మిజో నేషనల్‌ ఫ్రంట్‌ పాలిస్తోంది. జోరంతంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్రిపురలో బీజేపీ అధికారంలో ఉండగా, ఇక్కడ మాణిక్‌ సాహా ముఖ్యమంత్రి పాలన సాగుతోంది.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ పెమా ఖండూ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా అధికారంలో ఉంది. ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ సీఎం. రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు లేరు, కానీ ఎస్కేఎంలో బీజేపీ నేతత్వంలోని ఎన్డీఏలో భాగమే.
వెస్ట్‌ ఇండియా (మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌): మహారాష్ట్రలో శిండే నేతత్వంలోని శివసేనతో బీజేపీ ప్రభుత్వం ఉంది. గుజరాత్‌లో బీజేపీకి, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోని 670 మంది ఎమ్మెల్యేల్లో 331 మంది బీజేపీకి చెందిన వారు, అంటే 49%. అదేవిధంగా, ఈ రాష్ట్రాల్లోని మొత్తం 99 మంది ఎంపీలలో 73 మంది బీజేపీకి చెందిన వారు, అంటే 72%.
తూర్పు భారతదేశం (బీహార్‌, బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా): బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లో తణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం, జార్ఖండ్‌లో జీవీవీప్రభుత్వం ఉంటే.. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం ఉన్నాయి. అంటే తూర్పు భారతదేశంలో ఎక్కడా బీజేపీ ప్రభుత్వం లేదు. ఇక్కడ మొత్తం 722 మంది ఎమ్మెల్యేలలో 196 మంది బీజేపీకి చెందిన వారు, అంటే 27%. అదేవిధంగా, ఈ రాష్ట్రాల నుంచి మొత్తం 117 మంది ఎంపీలలో 54 మంది బీజేపీకి చెందిన వారు, అంటే 46%.
ఉత్తర భారతం (ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌, యూపీ, ఉత్తరాఖండ్‌): ఉత్తర భారతదేశంలో హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్‌లు బీజేపీ పాలనలో ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుంచి మొత్తం 818 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు, అందులో బీజేపీకి మొత్తం 377 మంది ఎమ్మెల్యేలు అంటే 46% ఉన్నారు. అదేవిధంగా మొత్తం 189 ఎంపీల్లో బీజేపీకి 98 ఎంపీలు అంటే 52% ఉన్నారు.
మధ్యభారత్‌ (ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌): మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నాయి. ఇక్కడ మొత్తం 420 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు, అందులో 144 మంది బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంటే 34% మంది ఉన్నారు. అదేవిధంగా మొత్తం 40 మంది ఎంపీల్లో 37 మంది బీజేపీకి చెందిన వారు అంటే 92%.
దక్షిణ భారతదేశం
కర్ణాటక ఓటమి తర్వాత ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం లేదు. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలు , ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొత్తం 130 మంది లోక్‌సభ ఎంపీలు వచ్చారు. వీరిలో బీజేపీకి 29 మంది ఎంపీలు అంటే 22% మాత్రమే ఉన్నారు. వీరిలో కర్నాటక నుంచి 25 మంది ఎంపీలు, తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు.
దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాల అసెంబ్లీలలో మొత్తం 923 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కర్నాటక ఎన్నికల వరకు బీజేపీకి మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్నాటకలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు తగ్గిన తర్వాత ఈ సంఖ్య 95కి పడిపోయింది. అంటే దక్షిణ భారతదేశంలోని మొత్తం ఎమ్మెల్యేలలో బీజేపీకి కేవలం 10% మంది మాత్రమే ఉన్నారు.
బెడిసికొట్టిన వ్యూహం...
సార్వత్రికానికి ముందే దక్షిణాది రాష్ట్రాలో తొలిదశగా కర్నాటకలో అడుగుపెట్టాలని వేసిన బీజేపీ వ్యూహం కాస్త బెడిసికొట్టింది. పార్టీలో ఓటమిపై పోస్టుమార్టం మొదలైంది. హిందూత్వం,మత విభజన రాజకీయా లను తెరపైకి తెచ్చినా..ఓటరన్న తిప్పికొట్టాడు. తాను ఎదుర్కొంటున్న బతుకు భారాలు..పూట గడవటం గురించి ఆలోచించే స్థితికి చేరుకున్నాడు. దాని ఫలితమే కర్నాటక ఎన్నికల రిజల్ట్‌ అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Spread the love