వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌

– గ్రేటర్‌ నోయిడా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌
– ప్రభుత్వం మోసం చేసింది : బృందాకరత్‌
– పరిష్కారం లభించే వరకు ఉద్యమం కొనసాగుతుంది : హన్నన్‌ మొల్లా
న్యూఢిల్లీ : గత 21 రోజులుగా ఆందోళన చేస్తున్న గ్రేటర్‌ నోయిడా రైతులు సోమవారం అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ఆధ్వర్యంలో నోయిడా అథారిటీ అధికార కార్యాలయం ఎదుట కిసాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించారు. ఇందులో 39 గ్రామాల ప్రజలు పాల్గొనగా, అందులో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పంచాయతీకి రైతులు జైత్‌పూర్‌ రౌండ్‌ బౌట్‌ నుంచి విప్రో రౌండ్‌బౌట్‌ మీదుగా పికెట్‌ ప్రదేశానికి చేరుకున్నారు. మహాపంచాయతినుద్దేశించి సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ పార్లమెంటు సభ్యులు బృందాకరత్‌ మాట్లాడారు. స్థానిక రైతులకు ప్రభుత్వం, అధికారులు ద్రోహం చేశారనీ, వారికి సరైన హక్కులు, కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. అధీకృత భూమి కోసం రైతులు ఉద్యమిస్తున్నారనీ, రైతుల హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతోందని అన్నారు. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఐద్వా ఢిల్లీ కార్యదర్శి ఆశాశర్మ మాట్లాడుతూ.. రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పోరాటంలో వారికి అండగా నిలుస్తామని చెప్పారు.
పరిష్కారం లభించే వరకు ఉద్యమం కొనసాగుతుంది : హన్నన్‌ మొల్లా
మహాపంచాయతీని ఉద్దేశించి ఆందోళన చేస్తున్న రైతులతో మాజీ ఎంపీ, ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా మాట్లాడారు. రైతుల డిమాండ్లను గౌరవప్రదంగా పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. కిసాన్‌ సభ జిల్లా కార్యదర్శి రూపేష్‌ వర్మ, కన్వీనర్‌ వీర్‌ సింగ్‌ నగర్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గంగేశ్వర్‌దత్‌ శర్మ మాట్లాడుతూ అధికార యంత్రాంగం రైతులకు అన్యాయం చేస్తోందని, రైతు హక్కుల పోరాటానికి కార్మిక సంఘం సిఐటియు అండగా ఉందన్నారు. కిసాన్‌ మహాపంచాయత్‌లో సిఐటియు నాయకులు రాంసాగర్‌, లతాసింగ్‌, పూనమ్‌ దేవి, ముఖేష్‌ కుమార్‌ రాఘవ్‌, గంగేశ్వర్‌ దత్‌ శర్మ, రామ్‌ స్వరత్‌, సునీల్‌ పండిత్‌, హుకమ్‌ సింగ్‌ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిఐటియు కార్మికులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీధి వ్యాపారుల కార్మిక సంఘం నాయకులు రామశంకర్‌పాల్‌, అమిత్‌ రస్తోగి, హరి గుప్తా నేతృత్వంలో పదుల సంఖ్యలో వీధి వ్యాపారులు కూడా పాల్గొన్నారని రూపేష్‌ వర్మ తెలిపారు.

Spread the love