– ఆగస్టు 11 వరకు వర్షాకాల సమావేశాలు
– 31 బిల్లులను జాబితా చేసిన మోడీ ప్రభుత్వం
– అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీలు
– ప్రజా సమస్యలపై చర్చ చేయాలి : ప్రతిపక్షం
– మేము సిద్ధంగానే ఉన్నాం : కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. గత లోక్‌సభ సమావేశాలు దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయం నడిచాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సమాధాన మిస్తుందా..లేక గతంలో మాదిరిగా దాటవేస్తుందా..అనే చర్చ నడుస్తోంది.
17 రోజుల పాటు సభా కార్యకలాపాలు…
ఆగస్టు 11 వరకు జరిగే ఈ సమావేశాల్లో 17 రోజుల పాటు సభా కార్యకలాపాల నిర్వహణ జరగనుంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజు సాంప్రదాయంలో భాగంగా బుధవారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 34 పార్టీల నుంచి 44 మంది నేతలు హాజరయ్యారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కుల గణన, మహిళా రిజర్వేషన్ బిల్లు, మణిపూర్ అల్లర్లు, బాలసోర్ రైలు ప్రమాదం, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దుర్విని యోగం, ఎన్నికైన ప్రభుత్వాలపై గవర్నర్ల ఆధిపత్యం, సమాఖ్యవాదంపై దాడి, ఢిల్లీ ఆర్డినెన్స్ వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. అలాగే మణి పూర్‌పై చర్చ జరపాలని, ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.
31 బిల్లుల జాబితా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 31 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జాబితా చేసింది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, అటవీ సంరక్షణ సవరణ బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జీవ వైవిధ్య (సవరణ) బిల్లు వంటి 31 బిల్లులు ఈ జాబితాలో ఉన్నాయి.
కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ సమావేశాల్లో పలు అంశాలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలను అనుమతించాలని కోరినట్టు చెప్పారు. ఎస్పీ ఎంపీ ఎస్‌టి హసన్ మాట్లాడుతూ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై చర్చ జరపాలని కోరినట్టు తెలిపారు. ఒడిశాకు ప్రత్యేక హౌదా ఇవ్వాలని కోరినట్టు బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్ర అన్నారు. అఖిలపక్ష సమావేశానికి 34 పార్టీలు, 44 మంది నేతలు హాజరయ్యారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రతిపక్షాల నుంచి తాము చాలా ముఖ్యమైన సలహాలు పొందామని, 31 బిల్లులను జాబితా చేశామని అన్నారు. మణిపూర్ అల్లర్లపై ఎక్కువ మంది సభ్యులు లేవనెత్తారని, దానిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరామన్నారు.
సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రాం మేఘ్వాల్, మురళీధరన్, జైరాం రమేష్, ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), ఎలమారం కరీం, పిఆర్ నటరాజన్ (సీపీఐ(ఎం), కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (బిఆర్‌ఎస్), విజయసాయి రెడ్డి (వైసీపీ), గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ (టీడీపీ), సంజరు సింగ్ (ఆప్), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్‌పీ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), సంతోష్ కుమార్ (సీపీఐ), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్‌ఎస్‌పీ), తంబిదొరై (అన్నాడీఎంకే), ఈటి మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్) తదితర నేతలు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలపై చర్చ జరగాలి..
ఎలమారం కరీం సీపీఐ(ఎం) ఎంపీ
ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రయివేటీక రణ, కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలపై గవర్నర్ల పెత్తనం, మణిపూర్ వంటి అంశాలను అఖిలపక్షంలో లేవనెత్తుతాం. అలాగే పార్లమెంట్‌కు ప్రధాన మంత్రి గైర్హాజరుపై కూడా ప్రశ్నించాం. ప్రధాన మంత్రి సభకు హాజరై, మణిపూర్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాం. దీనిపై వాయిదా తీర్మాన నోటీసు కూడా ఇస్తాం.. ఇలాంటి అంశాలను పార్లమెంట్‌లో ప్రజల తరఫున గళమెత్తుతాం.
సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం
బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు
దేశంలోని అనేక సమస్యలపై వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో. బీఆర్ ఎస్ పెద్ద ఎత్తున చర్చకు పట్టు బడతాం. యూనిఫాం సివిల్ కోడ్,
మణిపూర్ అంశంపైనా పార్లమెంట్ సమావేశా ల్లో కేంద్రాన్ని నిలదీస్తాం. మణిపూర్ అల్లర్లపై ప్రధాని స్టేట్మెంట్ ఇవ్వాలని, ఆ అంశంపై చర్చ చేపట్టాలని కోరాం. గవర్నర్ల అంశంపై కూడా చర్చ చేపట్టాలని, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి రిపేర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన అంశాలపైనా కూడా పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలతోపాటు బకాయిలపై కూడా చర్చకు అవకాశం ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో కోరాం. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యల సాధనకు పెద్ద ఎత్తున పార్లమెంట్ సమావేశాల్లో లెవనెత్తుతాం.