గో బ్యాక్‌

– అజ్మీర్‌లో ప్రధానికి నిరసన ట్వీట్లతో స్వాగతం
న్యూఢిల్లీ : ‘మోడీ…గో బ్యాక్‌’ అంటూ వేలాది మంది ప్రజలు సామాజిక మాధ్యమాలలో ట్వీట్‌ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పాలనకు గుర్తుగా నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మోడీ బుధవారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ ప్రారంభానికి ముందే ఆయన పర్యటనను నిరసిస్తూ మధ్యాహ్నానికే 93 వేల మంది సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టారు. దేశ రాజధానిలో మహిళా మల్లయోధుల నిరసన ప్రదర్శనపై ఉక్కుపాదం మోపినందుకు వారంతా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓ రోడ్డుపై గో బ్యాక్‌ మోడీ అని రాసి ఉన్న ఫొటోను వారంతా విస్తృతంగా షేర్‌ చేశారు.
‘అతిథులకు సాదర స్వాగతం పలకడం రాజస్థాన్‌ సంప్రదాయం. మోడీజీ…మీరు ప్రధాని పదవి గౌరవాన్ని కాపాడి ఉంటే మేము మిమ్మల్ని అదే విధంగా గౌరవించి ఉండే వారం. అయితే మీరు ఆ పదవికి, దేశానికి అప్రదిష్ట తెచ్చారు. ఈ దేశ ఆడబిడ్డలు రోదిస్తున్నారు.
మీరేమో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు’ అని జాట్‌ యూనిటీ పేరిట ఓ ట్వీట్‌ కన్పించింది. మోడీకి ప్రవేశం లేదు అని రాసిన బ్యానర్‌ చిత్రాన్ని మరొకరు షేర్‌ చేశారు. ‘ఇది రాజస్థాన్‌. మీరు గుజరాత్‌ అనుకుంటున్నారా?’ అని ఆ బ్యానర్‌లో రాసి ఉంది. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిం చడానికి ముందు మోడీ పుష్కర్‌లోని బ్రహ్మదేవుని ఆలయంలో పూజలు చేశారు. విమానాశ్రయం నుంచి పుష్కర్‌కు హెలికాప్టర్‌లో వచ్చిన మోడీ, అక్కడి నుంచి మళ్లీ హెలికాప్టర్‌లోనే ర్యాలీ జరిగే ప్రదేశానికి వెళ్లారు.

Spread the love